మబ్బులతో ముచ్చట్లు

మబ్బులతో ముచ్చట్లేమిటి? మబ్బులేమైనా మాట్లాడతాయా, మబ్బులకు ప్రాణం ఉందా అనే సందేహాలు కలుగుతాయి. నిజమే- మబ్బులు మాట్లాడలేవు. వాటికి ప్రాణం ఉండదు. అయినా కవిభావనలో ఇవన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది. పూర్వం కుబేరుడు తన రాజధాని అలకాపురిలో యక్షరాజ్యాన్ని పాలించేవాడు.

Published : 29 May 2024 00:22 IST

మబ్బులతో ముచ్చట్లేమిటి? మబ్బులేమైనా మాట్లాడతాయా, మబ్బులకు ప్రాణం ఉందా అనే సందేహాలు కలుగుతాయి. నిజమే- మబ్బులు మాట్లాడలేవు. వాటికి ప్రాణం ఉండదు. అయినా కవిభావనలో ఇవన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది.

పూర్వం కుబేరుడు తన రాజధాని అలకాపురిలో యక్షరాజ్యాన్ని పాలించేవాడు. అతడి దగ్గర పనిచేసే హేమమాలి అనే సేవకుడు కుబేరుడి ఆదేశంపై మానస సరోవరానికి వెళ్ళి స్వర్ణకమలాలు తెచ్చేవాడు. ఆ కమలాలతో కుబేరుడు పరమశివుణ్ని పూజించేవాడు. ఒకనాడు హేమమాలి తన భార్యతో విలాస సుఖాల్లో తేలియాడుతూ, స్వర్ణకమలాలు తేవడం మరచిపోయాడు. పూజా సమయానికి స్వర్ణకమలాలు రాకపోయేసరికి కోపగించిన కుబేరుడు తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని, భార్య వ్యామోహంలో పడి విధిని మరచిన హేమమాలికి శాపం విధించాడు. ఆ శాపం ఏమిటంటే- అతడు చేసిన తప్పునకు శిక్షగా ఒక సంవత్సరంపాటు భార్యకు దూరంగా కాలం గడపాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న సేవకుడు రాజాజ్ఞకు నిబద్ధుడై రామగిరి ఆశ్రమాల దగ్గర తన శిక్షా కాలాన్ని గడపసాగాడు. నిర్మానుష్యమైన ఆ కొండప్రాంతాల్లో అతడితో ముచ్చటించడానికి ఎవరూ లేరు. తన విరహ సందేశాన్ని తన భార్యకు చేరవేయమని మబ్బులను కోరేవాడు. మబ్బులంటే ఏమిటి? పొగమంచు, మెరుపులు, నీళ్లు, గాలి... వీటన్నింటి కలగలిసిన రూపం కదా? ఈ విషయం ఆ యక్షుడికి తెలియదా అంటే, తెలుసు. కానీ విరహబాధలో తాను ఏం చేస్తున్నాడో, అతడు గుర్తించలేడు. పాపం ఆ యక్షుడికి కాలం కూడా అనుకూలంగా లేదు. అవి ఆషాఢ మాసంలోని ప్రారంభదినాలు. వర్షాలు కురుస్తుంటే విరహాగ్ని పెరుగుతుందే కానీ తరగదు. ఈ దురవస్థలో ఆ యక్షుడు తన భార్య నివసించే ఊరు, అందులో ఉండే తన ఇల్లు చిరునామాలను మబ్బులకు వివరించి చెబుతాడు. ఎలాగైనా తన ప్రణయ సందేశాన్ని భార్యకు చేర్చాల్సిందిగా ప్రాధేయపడతాడు.

యక్షుడు తాను నివసిస్తున్న రామగిరుల నుంచి అలకా పట్టణానికి చేరుకొనే దారులను స్పష్టంగా వివరిస్తుంటే- మహాకవి కాళిదాసు ఇన్ని రమణీయ ప్రదేశాలను దర్శించాడా అని ఆశ్చర్యం కలుగుతుంది. కవుల గొప్పతనం ఇదే. మబ్బులతో యక్షుడు ముచ్చటిస్తూ ‘ఓ మబ్బులారా! మీరు వెళ్ళే దారిలో కొంత పక్కకు మరలితే ఉజ్జయినీ నగరం చేరుకోవచ్చు. ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించకుండా వెళ్ళకండి. ఎందుకంటే మీకు జీవితంలో అలాంటి సదవకాశం మళ్ళీ దొరకదు. ఆ పుణ్యధామంలో కృష్ణపక్షం రాత్రుల్లో కూడా వెన్నెల కాస్తూనే ఉంటుంది. దీనికి కారణం మహాకాళేశ్వరుడి జటాజూటంలో ఉన్న చంద్రుడు ఆ నగరాన్ని ఎప్పుడూ తన వెన్నెల వెలుగులతో నింపుతాడు. అంతేకాదు- ఆ నగరంలో ప్రతినిత్యం సాయంకాల వేళలో పార్వతీపరమేశ్వరులు ఆనందతాండవం చేస్తారు. అప్పుడు వారి శరీరాల నుంచి రాలిపడే భస్మం కోసం ప్రమథగణాలు ఎదురుచూస్తుంటాయి. ఆ భస్మాన్ని పవిత్రంగా భావించి అందరూ నొసళ్లపై పూసుకొని, ధన్యులవుతారు. ఆ మహానగరం  చుట్టూ ప్రవహించే శిప్రానదిలోని స్వచ్ఛమైన నీటిలో ఎందరో సుందరీమణులు జలకాలాడుతూ కనువిందు చేస్తారు’ అని యక్షుడు వివరంగా మబ్బులకు చెబుతాడు.

కావ్యాలు కేవలం ఊహల్లో తేలిపోయేవి కావు. వాటిలో మానవ జీవన సౌందర్యం, పరమార్థం నిండి ఉన్నాయి. ఈ వాస్తవాలను అర్థం చేసుకోగల మనసు ఉంటే చాలు. ఆనందం ప్రతి ఒక్కరి సొంతం అవుతుందనడానికి ‘మేఘసందేశ’ కావ్యం ఒక మంచి ఉదాహరణ!

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని