ఊహలు - వాస్తవాలు

ఊహలు ఎలా ఉన్నా- నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికపరంగా కావచ్చు,  మిత్రులతో, బంధువులతో సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు.

Published : 02 Jun 2024 01:58 IST

ఊహలు ఎలా ఉన్నా- నిజ జీవితంలో మనిషి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవి ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికపరంగా కావచ్చు,  మిత్రులతో, బంధువులతో సంబంధ బాంధవ్యాల పరంగా కావచ్చు. అలాంటి మార్పు కొన్నిసార్లు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు భయంకర వర్తమానాన్ని చేరువ చేస్తుంది. కొన్ని మార్పులను అంగీకరించినా, అంగీకరించకపోయినా వాటి నైజం మారదు. అంగీకరిస్తే ప్రశాంత మనస్కులం కావచ్చు. అంగీకరించకపోతే మనో సంఘర్షణ తప్పదు!

మార్పు చేయలేని వాస్తవాన్ని అంగీకరించలేని మానవుడు సామాన్యుడు! మనసు ఎంతో ఎత్తుకు ఎదిగినవాడికి మార్పు చేయలేని వాస్తవాన్ని అంగీకరించడం పెద్ద కష్టం కాదు. మానసిక పరిణతి, వయసుతో వచ్చేది కాదు. వయసుడిగిన వ్యక్తి చిన్న మార్పును సైతం అంగీకరించడానికి భయపడవచ్చు. పరిణతి పొందిన యువకుడు ప్రకృతి నైజాన్ని తెలుసుకుని భయంకర వాస్తవాలను సైతం అంగీకరించవచ్చు. మార్పును స్వాగతించే మనిషి సంఘర్షణకు దూరంగా ప్రశాంత జీవనం గడుపుతాడు. అందుకు భిన్నంగా కష్టనష్టాలతో కూడిన వాస్తవాన్ని అంగీకరించలేని మానవుడికి మనో క్లేశాలు తప్పవు.

సంపద శాశ్వతం కాదు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్ల వుతాయి. ఏది ఏమైనా ఏమాత్రం చలించడు జ్ఞాని! మనం ఎందరో బాల మేధావులను చూస్తాం. ఇంకొందరు ఎదుగుతూ జీవికకు అవసరమైన జ్ఞాన సంపత్తిని సాధిస్తారు. మరికొందరు మలివయసులో సైతం అజ్ఞానులుగానే  మిగిలి జీవయాత్ర చాలిస్తారు.

వసంతం వస్తుంది. చెట్లు చిగిర్చి పూలు, ఫలాలను అందిస్తాయి. కొన్ని పుష్పజాతులు దిగంతాలలో సుమ సౌరభాలను గుప్పిస్తాయి. వసంత ప్రకృతిని ఆస్వాదించగల మనిషి ఆనందానికి కొదవుండదు. ఆస్వాదించలేని మనిషికి అనుభూతులతో పనిలేదు. జడంగానే ఉండిపోతాడు. రుతువులు మారుతూ ఉంటాయి. ప్రకృతి అవసరమైన మార్పులు సంతరించుకుంటూనే ఉంటుంది. మనిషి ప్రకృతిలో భాగమే! అవసరమైన మార్పును అంగీకరిస్తూనే తన ఊహలను నిజం చేసుకునే క్రతువులో మనిషి విజయం సాధించాలి. అతడే విజేత!
వయసుతోను, ప్రారబ్ధంతోను రోగాలు ముడివడి ఉంటాయి. మనిషి సామాజిక ఆర్థిక పరిపుష్టితో వాటికి పనిలేదు. ఆ క్షీణత దేహ నిష్క్రమణ దాకా కొనసాగుతూనే ఉంటుంది. అటువంటి వాస్తవాన్ని సైతం అంగీకరించినప్పుడు మహాభినిష్క్రమణం సైతం ఓ పండుగలా జరుగుతుందంటారు విజ్ఞులు. అందచందాలు, విద్య, పలుకుబడి, అధికారం, సంపద... ఇలా అనేక అంశాలు అహంకారానికి కారణమవుతాయి. అటువంటి వాస్తవాల ఎరనుంచి నిగ్గు తేలినవాడే విజ్ఞుడు, బలవంతుడు, తన మనో సామ్రాజ్యానికి చక్రవర్తి! ఊహలను వాస్తవాలు చేసుకోవడం అవసరం కూడా. అయితే వాస్తవ ప్రకృతిని అవగతం చేసుకుని నిరంతరం నేను ఉన్నానంటూ తోసుకువచ్చే మార్పును అంగీకరిస్తూ జీవించే మనిషే అజేయుడు. ఎటువంటి పరిస్థితిలోనూ అతడి ఆనందానికి లోటుండదు!

గోపాలుని రఘుపతిరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని