విశ్వమంత వెలుగు!

పంచభూతాల్లో ఒకటైన అగ్ని అన్ని విధాలా అధికమైన ప్రాధాన్యం వహిస్తుంది. దీపారాధన, జ్యోతిప్రజ్వలన, యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నిప్రతిష్ఠ, ఆహారం ఉడికించడానికి మంట, నిప్పు, జ్వాల... పేర్లు వేరైనా అది ప్రకాశవంతమైన  వెలుగు. చీకటిలో దారి చూపే మార్గదర్శి.

Published : 03 Jun 2024 00:39 IST

పంచభూతాల్లో ఒకటైన అగ్ని అన్ని విధాలా అధికమైన ప్రాధాన్యం వహిస్తుంది. దీపారాధన, జ్యోతిప్రజ్వలన, యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నిప్రతిష్ఠ, ఆహారం ఉడికించడానికి మంట, నిప్పు, జ్వాల... పేర్లు వేరైనా అది ప్రకాశవంతమైన  వెలుగు. చీకటిలో దారి చూపే మార్గదర్శి. జ్ఞానజ్యోతి, ఆత్మజ్యోతి, విద్యాజ్యోతి... ఏమైనా దానిలో ప్రాణశక్తి మాత్రం అగ్ని స్వరూపమే. భగవంతుడు జ్యోతి స్వరూపమని వివిధ ఉపనిషత్తులు చెబుతున్నాయి. రుగ్వేదం మూడో మండలంలోని గాయత్రి మంత్రం అర్థం- ‘నేను ఆధ్యాత్మిక జ్ఞానం, వికాసం కోసం దివ్య ప్రకాశాన్ని ధ్యానిస్తున్నాను’ అని సూర్య తేజస్సును ప్రార్థించడం. దీపారాధన విశిష్టత గురించి ఆగమ శాస్త్రం ప్రముఖంగా పేర్కొంది. ఎటువంటి కార్యక్రమమైనా పరిపూర్ణ జ్ఞానం కలిగించాలని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేస్తారు. తమసోమా జ్యోతిర్గమయ మంత్రం అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానం వైపు నడిపించేది జ్యోతి అని చెబుతుంది. శుభాశుభాలు అన్నింటికీ దీపం ప్రాధాన్యం కలిగి ఉంటుంది. జ్యోతిని పరబ్రహ్మగా భావిస్తూ పూజ ప్రారంభంలో దీపం వెలిగించడం సంప్రదాయం. దీపాన్ని చివరి వరకు ఉంచి కర్పూర హారతితో పూజ ముగించడం షోడశోపచార పూజ పద్ధతి. యజ్ఞ యాగాది క్రతువుల్లో ఆరణి కట్టెల రాపిడితో నిప్పు రాజుకునేలా చేసి అగ్నిలో వివిధ ఆహుతులను సమర్పించి పూర్ణాహుతితో ముగిస్తారు. కొందరు ప్రతి నిత్యం అగ్నిహోత్రానికి ఆరాధన చేస్తారు. మనిషి జీవితం ముగిసి శవంగా మారినా తల వైపు దీపం పెడతారు. దానితోనే అంత్యక్రియలు చేయడం కొందరి ఆచారం. జ్యోతి వెలుగులో ఆత్మ ప్రయాణం సాగిస్తుందని గరుడ పురాణం పేర్కొంటోంది.

జ్వాల, వేడి, ప్రకాశం, దహన శక్తి అగ్ని సహజ గుణాలు. అడవిలో చెట్ల కొమ్మల రాపిడి వల్ల మంటలు రగిలి ఎండిన ఆకుల ద్వారా వ్యాపించేది దావానలం(దావాగ్ని). సముద్రంలో సైతం బడబాగ్ని రూపంలో ఉంటుంది. మనిషి శరీరంలో జఠరాగ్నిగా(వైశ్వానరుడు) మేలు చేస్తుంది. మనిషి శరీరంలో తగినంత వేడి ఉంటేనే ఆరోగ్యవంతంగా ఉంటారు. మంచి చెడుల తారతమ్యం లేకుండా తన ధర్మాన్ని నిర్వర్తించడం అగ్నిజ్వాల లక్షణం. ఎలా ఉపయోగించాలో మనిషి వివేకంతో ఆలోచన చేయాలి. విచక్షణ లేకుండా అగ్ని ఉపయోగం ప్రమాదానికి దారి తీస్తుంది.

ఎప్పుడూ ఊర్ధ్వ ముఖంగా వెలిగే జ్యోతి ఉత్తమ ఆశయాలతో ఉన్నత స్థాయికి చేరాలనే సందేశాన్ని అందిస్తుంది. బంగారు రంగులో స్వచ్ఛంగా ఉండి కల్మషాలను, కల్తీలను దహించి వేస్తుంది. మనిషి కూడా తనలోని చెడును తొలగించుకుని కలుషితం లేని స్వచ్ఛతను సంతరించుకోవాలి. ఎప్పుడూ తల ఎత్తుకుని ఉండే ఉదాత్తత కలిగి ఉండాలని సూచిస్తుంది. తాను కాలుతున్నా పరిసరాలకు దీపం వెలుగు చూపిస్తుంది. తాను బాధలో ఉన్నా ఇతరులకు సేవ చేసే గుణం మహత్తరమైంది.

ధ్యాన ప్రక్రియల్లో జ్యోతి ధ్యానం కూడా ఒక సాధనా మార్గం. శరీరంలో భావనా పూర్వకంగా అంతర్గతంగా జ్యోతిని వివిధ శరీర భాగాలకు వ్యాపింపజేసే ఒక ప్రత్యేక విధానం. శివుడి మూడో నేత్రం అగ్ని స్వరూపం. శివ పురాణం ప్రకారం శివుడి ధ్యానం మూడో నేత్రంతో సాగుతుంది. ఆ ప్రదేశమే భృకుటి అని అంటారు. ఏ ధ్యానమైనా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. మనిషిలోని ఆత్మజ్యోతి పరమాత్మలో లీనం కావడం మోక్షం. వెలుగుతున్న దీపం నుంచి అనేక దీపాలు వెలిగించినా వన్నె తరగనట్లు ప్రతి మనిషీ తాను పదిమంది బతుకుల్లో జీవన జ్యోతి వెలిగించే స్థాయికి చేరాలి. అదే జ్యోతిర్మయమైన విశ్వమంత వెలుగు!

రావులపాటి వెంకట రామారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని