మనస్సాక్షి

ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే! ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే.

Published : 04 Jun 2024 01:23 IST

ప్రతి వారి జీవితంలోనూ ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఒక్కొక్కసారి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో సరైన మార్గం చూపించేది మనసే! ఎడారిలోనో, సముద్రంలోనో ప్రయాణం చేసేవారు దిక్కులు తెలియక దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి కలగకుండా దిక్సూచి అనే చిన్న యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఏ వైపున ఏముందో సూచించడం దాని పని. మనస్సాక్షి సైతం అలాంటిదే.

మనస్సాక్షి మూడు రకాలు. నిర్ధారిత మనస్సాక్షి, అనుమానకర మనస్సాక్షి, సున్నిత మనస్సాక్షి అనేవి ఆ మూడూ. తాను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనే సందేహ నివృత్తి చేసేది మొదటిది. మంచి చెడుల మధ్య భేదాన్ని తెలిపేది రెండోది. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా సూక్ష్మాంశాలను జాగ్రత్తగా గమనించి ఎరుక పరచేది మూడోది. మనస్సాక్షి చెప్పేదాన్ని విని సరైన నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో నిబద్ధత కలవారవుతారు.     

మన గురించి మనకు తెలియజేయడం, మన లోపలి ఆలోచనల్ని, భావాల్ని నిజాయతీగా ఉండేటట్లు నియంత్రించడం మనస్సాక్షి చేసే పని. అందుకే నీ ఆత్మ చెప్పినట్లు చేయడమే శ్రేయస్కరం (ఆత్మ బుద్ధిః సుఖంచైవ) అని సూక్తి.  

మనస్సాక్షి మంచిచెడులు రెండింటినీ విశ్లేషించి చెబుతుంది. చిత్రమైన విషయం ఏమిటంటే... అరిషడ్వర్గాలుగా పేర్కొనే కామ, క్రోధాదులకు తలొగ్గి కానిమార్గంలో పయనిస్తుంటారు కొందరు. అందువల్ల చరిత్రలో కళంకితులుగా ముద్ర పొందుతారు. గతంలో దశరథుడు ఇచ్చిన వరాలను కోరి వాటితో రాముణ్ని అడవులకు పంపమని కైకకు సలహా ఇచ్చింది మంధర. ఆ మాటలు తలకెక్కించుకున్న కైకకు ఇలాంటి సమయంలో వాటిని అడగడం తగని పని అని మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంది. అయినా దాని నోరు నొక్కేసి చెప్పుడు మాటలకే ప్రాధాన్యమిచ్చింది కైక. ఫలితంగా పతీ వియోగం, పుత్ర ఛీత్కారం దాపురించాయి. 

ఏకలవ్యుడికి తన పట్ల అవ్యాజమైన గురు భావం ఉందని ద్రోణుడికి తెలుసు. అతడికి విద్య నేర్పితే గొప్ప విలుకాడవుతాడని మనస్సాక్షి చెప్పింది. దుర్విచక్షణ అనే లోభం అతడి చేత ఏ గురువూ చేయకూడని పని చేయించింది. ఫలితంగా, చరిత్రలో కళంకిత గురువుగా ముద్రను పొందాడు. కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో ఒక చోట ‘సందేహాలు కలిగిన సందర్భంలో సజ్జనులకు వారి మనో స్పందనలే ప్రమాణాలు’ అని చెప్పిస్తాడు దుష్యంతుడితో.  

హరిశ్చంద్రుడితో ఎంతగా అబద్ధాలు పలికించాలని ప్రయత్నించినా మనస్సాక్షి సూచన మేరకు కష్టాలనే ఎదుర్కొన్నాడు. అంతే తప్ప అబద్ధం ఆడలేదు. ఫలితంగా సత్యానికి ప్రతీకగా నిలిచాడు.
ఎవరెన్ని విమర్శలు చేసినా, అభ్యంతరాలు చెప్పినా ఎక్కువ మందికి మేలు జరుగుతుందని మనస్సాక్షి చెబితే వారందరి మాటలను తోసిపుచ్చేసి స్వతంత్రంగా ప్రవర్తించవచ్చునని రాజధర్మాలు చెబుతున్నాయి. అందువల్లనే రాజ శాసనాలు కాస్త కఠినంగా కనిపిస్తాయి కొందరికి. కానీ ప్రజల పట్ల నిరతిశయమైన ఆపేక్ష కలిగిన పాలకులు మనస్సాక్షి సూచన మేరకు అలాంటి శాసనాలే చేయాలని చాణక్య నీతి చెబుతోంది.

కె.వి.ఎస్‌.ఎస్‌.శారద 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని