మార్గాన్వేషణ

ఆధ్యాత్మిక జీవితం చైతన్యం... ఉల్లాసం... ప్రకాశవంతం. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ఆధ్యాత్మికత అవకాశం కల్పిస్తుంది. ఆధునిక జీవితంలోని దుఃఖం, నిరాశా నిస్పృహలను అది తొలగిస్తుంది. మనిషిలోని అలసటను పోగొట్టి సరికొత్త శక్తినిస్తుంది.

Updated : 14 Jun 2024 05:50 IST

ధ్యాత్మిక జీవితం చైతన్యం... ఉల్లాసం... ప్రకాశవంతం. జీవితంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి ఆధ్యాత్మికత అవకాశం కల్పిస్తుంది. ఆధునిక జీవితంలోని దుఃఖం, నిరాశా నిస్పృహలను అది తొలగిస్తుంది. మనిషిలోని అలసటను పోగొట్టి సరికొత్త శక్తినిస్తుంది. స్ఫూర్తి నింపుతుంది. సృజనాత్మకంగా చేస్తుంది. మనిషిలో అత్యంత శక్తిమంతమైన కోణాన్ని ఆత్మజ్ఞానం పరిచయం చేస్తుంది.

ఆధ్యాత్మిక జీవితం అంటే అలంకరణలు, ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవడం కాదు. అది దృక్పథంలో మార్పు. స్వార్థం నుంచి సమర్పణలోకి... లాక్కోవడం నుంచి ఇవ్వడంలోకి... ‘నా’ నుంచి ‘మీకు’... తదితర ఉన్నత సాధనలకు అనుగుణంగా మనసును విస్తరింపజేయడమే ఆధ్యాత్మిక జీవితం. ఎవరైనా సరే, చేసే పనిపట్ల మక్కువ చూపాలి. క్రీడాకారులు తమ క్రీడకు అంకితమై ఉండాలి. కళాకారులు తాము ఎంచుకున్న రంగాన్ని ప్రేమించాలి. పనిని ‘యజ్ఞస్ఫూర్తి’తో చేయాలి. సేవ, త్యాగం, ఉన్నత ఆదర్శం వైపు దృష్టి పెట్టినప్పుడు అప్రయత్నంగా విజయం, శ్రేయస్సు సిద్ధిస్తాయి.

జీవించడానికి ఒక పెద్ద కారణం, విలువైన లక్ష్యం ఏర్పరచుకోవాలి. భౌతికసుఖాల స్థాయి నుంచి ఒక దృఢమైన భావోద్వేగ ప్రేరణకు ఎదగాలి. ఈ భౌతిక పరిమితులను అధిగమించినప్పుడే, అద్భుతమైన పనితీరు కనబరచే అవకాశం కలుగుతుంది. ఒక ఆధ్యాత్మిక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే అసాధ్యం సుసాధ్యం అవుతుంది. కేవలం భౌతిక శ్రేయస్సును కాంక్షించే వ్యక్తి సైతం జ్ఞానోదయమైన ఆత్మను అనుసరించాల్సిన అవసరం ఉందని ముండకోపనిషత్‌ చెబుతోంది.

కోరిక నెరవేరనంత కాలం మనసు ఆందోళన చెందుతుంది. అది నెరవేరినప్పుడు మనసు ప్రశాంతమై మనిషి సంతోషంగా ఉంటాడు. వస్తువుకు ఆనందాన్ని ఆపాదించడం తప్పు. వస్తువులోనే ఆనందం అంతర్లీనంగా ఉన్నట్లయితే, అదే వస్తువు అందరికీ ఒకే రకమైన ఆనందాన్ని కలిగించాలి. కోరికను అధిగమించగలిగినప్పుడే నిజమైన ఆనందం సిద్ధిస్తుంది.

ఎవరికివారు అంతరంగంలోని మూలాన్ని కనుగొనడానికి తమలోకి తాము జరిపే అన్వేషణే ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ మూలాన్ని చేరుకున్నప్పుడు, ఇక బయటి ఆనందాన్ని శోధించరు. చాలా సందర్భాల్లో జీవితాన్ని అనుభవించి, రోజువారీ ఉనికి కంటే వేరే ఏదో ఉండాలని నిర్ణయానికొచ్చినప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. 

ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన విషయం- మీరు మీ పట్ల, మీ చుట్టూ ఉన్నవారి పట్ల మరింత దయ, సానుభూతితో ఉండటం. ఆధ్యాత్మిక ప్రయాణంలో సహజంగానే ఇతరుల కష్టాలు, సంతోషాల్లో పాలుపంచుకోవడం ప్రారంభిస్తారు. దయతో కూడిన చర్యలు దైనందిన జీవితంలో ఒక భాగమవుతాయి. చుట్టూ ఉన్నవారికి సాయపడటంలో ఆనందాన్ని పొందుతారు. ఇతరుల పట్ల మరింత కనికరంతో ఉన్నారని మీరు భావిస్తే, సరైన మార్గంలో ఉన్నట్లే.

ప్రయాణ వేగం, మార్గం, విధానం, మీకున్న పరిపక్వత, గత అనుభవాల సంపదలపైన ఆధ్యాత్మిక యాత్ర ఆధారపడి ఉంటుంది. సత్యాన్ని చేరుకోవడానికి అసంఖ్యాకమైన మార్గాలున్నాయి. ఎవరికి ఏ మార్గం ఉపకరిస్తుందో చెప్పలేం. అయితే, మార్గనిర్దేశం చేసే గురువులున్నారు. మానవజన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ హృదయాన్ని ధర్మక్షేత్రంగా, మనసును మర్మక్షేత్రంగా, జీవితాన్ని శాంతిక్షేత్రంగా, జీవనాన్ని ఆనందక్షేత్రంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నమే- ఆధ్యాత్మిక సాధన.

మంత్రవాది మహేశ్వర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని