మనసుకు కళ్లెం

మనసు చంచలమైనది. అది ఒకసారి సాధు రూపాన్ని ధరిస్తే, మరొకసారి క్రూరత్వాన్ని  ప్రదర్శిస్తుంది. ఒకసారి సద్విచారాలతో నిర్మలమైతే, మరొకసారి దురాలోచనలతో మలినమవుతుంది. మనసు వేగాన్ని కొలవలేం. దాని తీవ్రతను అంచనా వేయలేం. కరుణామృతాన్ని వర్షించే మనసు కాఠిన్యానికి ఆలవాలం కావడం చాలా చిత్రమనిపిస్తుంది.

Published : 15 Jun 2024 00:48 IST

నసు చంచలమైనది. అది ఒకసారి సాధు రూపాన్ని ధరిస్తే, మరొకసారి క్రూరత్వాన్ని  ప్రదర్శిస్తుంది. ఒకసారి సద్విచారాలతో నిర్మలమైతే, మరొకసారి దురాలోచనలతో మలినమవుతుంది. మనసు వేగాన్ని కొలవలేం. దాని తీవ్రతను అంచనా వేయలేం. కరుణామృతాన్ని వర్షించే మనసు కాఠిన్యానికి ఆలవాలం కావడం చాలా చిత్రమనిపిస్తుంది. దాతగా నిలబెట్టేది అదే మనసు, లోభిగా అపకీర్తి పాలు చేసేది అదే మనసు. మనిషిని ఉత్తుంగ పర్వత శిఖరాలను అధిరోహింపజేసే మనసు, కాలవశాన అథఃపాతాళానికి తోసేస్తుంది.

పూర్వం ఒక వ్యక్తి దారిలో ప్రయాణిస్తూ, ఒక చెట్టు దగ్గర ఆగాడు. అతడికి ఒక డబ్బు సంచి కనిపించింది. బహుశా ఎవరో బాటసారులు అక్కడ దాన్ని మరచిపోయారని భావించిన ఆ వ్యక్తి కొంతసేపు అక్కడే ఆగిపోయాడు. అంతలో డబ్బు సంచి పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి రాగా, అతడు దాన్ని ఇచ్చివేసి తన సద్బుద్ధిని ప్రకటించుకున్నాడు. అదే వ్యక్తి తిరిగి ప్రయాణం సాగించి, ఒక ఊరికి చేరుకొని ఆకలి కావడంతో పూటకూళ్లమ్మ ఇంట్లో బసచేశాడు. భోజనం చేస్తుండగా అతడి మనసు తాను తింటున్న వెండి పళ్లెం మీద పడింది. అన్నం తిన్న తరవాత అతడెలాగో దాన్ని తస్కరించి, ప్రయాణం సాగించాడు. చూశారా! ఒకసారి తప్పు చేయని మనసు మరొకసారి చేయడానికి సాహసించింది. కనుకనే మనసు నమ్మదగింది కాదు. మావటివాడు ఏనుగును అంకుశంతో తన వశంలో ఉంచుకున్నట్లు, రౌతు గుర్రాన్ని కళ్లెంతో తన స్వాధీనంలో పెట్టుకున్నట్లు మనిషి కూడా మనసును ఎప్పటికప్పుడు తన నియంత్రణలో ఉంచుకోవాలి.

మనసు మనిషి నిగ్రహశక్తి వల్ల స్తంభంలా నిలబడుతుంది. అదే మనసు నిగ్రహశక్తి కోల్పోయినట్లైతే బొంగరంలా తిరుగుతుంది. మొత్తం మీద మనసు స్వభావం చంచలత్వమే. ఎండుగడ్డి అగ్నిలో దగ్ధమైనట్లు మనసు క్రోధాగ్నిలో మండిపోతుంది. కనుకనే దాన్ని శాంతింపజేయడానికి ఆచార్యుడి రూపంలో మేఘం ఉపదేశామృతాన్ని వర్షించాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి.

మన జాగ్రదావస్థలో ఎక్కడెక్కడికో పరిగెత్తే మనసు నిద్రావస్థలో నిస్తేజంగా ఉండిపోతుంది. స్వప్నావస్థలో కలలు కంటుంది. నిద్రావస్థలో మనిషి ఆనంద స్థితిలో ఉండగా మనసు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతుంది. అసలు మనసు ఉందా లేదా అనే అనుమానానికి తావిస్తుంది.

జాగ్రదావస్థలో మనల్ని ఇబ్బంది పెట్టే మనసు, మనం చెప్పినట్లు వినాలంటే, మనం నిగ్రహశక్తిని కలిగి ఉండక తప్పదు. స్వప్న స్థితిలో మనసు ఎన్నో వస్తువులను చూపిస్తుంది. ఎన్నో లోకాలకు పరిగెత్తుతుంది. నిజానికి ఆ వస్తువులు గాని, లోకాలు గాని మన ఎరుకలోనివే. అయితే నిద్రా స్థితిలో మనకు తెలియకుండానే నియంత్రణలో ఉండే మనసును, జాగ్రదావస్థలో మన నియంత్రణలోకి తెచ్చుకోవాలి. అందుకు గాను మన మనసును భగవంతుడి ధ్యానం వైపు మళ్ళించాలి. మనసులో వివేకాన్ని, వైరాగ్యాన్ని నింపుకోవాలి. అప్పుడే చంచలమైన మనసు మనకు సుఖదాయకమవుతుంది.

ఆచార్య మసన చెన్నప్ప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని