కాలం కలిసి రావాలి...

చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం మనకు లభిస్తుంది. ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు. కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి.

Published : 16 Jun 2024 01:17 IST

చెట్టుకు ఉన్న మొగ్గ విచ్చుకుని పుష్పంగా రూపు సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం మనకు లభిస్తుంది. ఆలోగా ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం లభ్యం కాదు. కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాలి. కాలం కలిసి వచ్చేవరకు ఆగాలి. ఓర్పుతో వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయి. వసంతం కోసం, వర్షం కోసం చెట్లు నిరీక్షించవు, ప్రార్థించవు, ప్రాధేయపడవు. కాలం అనుకూలించగానే వసంతాగమనంతో చెట్లు చిగురిస్తాయి. గీతలో భగవానుడు బోధించినట్లుగా మనిషి కూడా తన పనిని తాను త్రికరణ శుద్ధితో నిర్వర్తించాలి. ఫలితం కోసం ఎదురుచూడకూడదు. అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృథా చేయకూడదు. నేడు జరగనిది రేపు తప్పక జరుగుతుందనే ఆశావాదంతో ముందుకు సాగాలి.

రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది. రాముడి అరణ్యవాసం ఆమె పాలిట వరమైంది. ఆమె నిరీక్షణ ఫలించింది. వనవాటికలో రాముడి దర్శనమైంది. ఆయనకు ఆతిథ్యమిచ్చి ధన్యురాలైంది. భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయింది. కాలం కలిసిరానప్పుడు, క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కొందరు నిరాశ, నిస్పృహలతో కుంగిపోతుంటారు. ఆ పరిస్థితులలో మనిషి ఆశ్రయించవలసింది ఆశావాదాన్ని. ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి పరిష్కారమార్గాలు ఆలోచించాలి. జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు.

లంకలో సీతకోసం వెతుకుతూ వాయునందనుడు ఒక దశలో విసిగి వేసారిపోయాడు. దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ క్షణంలోనే సీతమ్మ కంటపడుతుందన్న ఆశ ఆయన గుండెల్లో చిగురించింది. చచ్చి సాధించేదేమీ లేదు, బతికి ఉంటే శుభాలు చూడవచ్చునని భావించి తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు. సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు. అందుకే మనసులో ఎల్లప్పుడూ సద్భావనలు నింపుకోవాలి. అవే మనిషిని విజయతీరాలకు చేరుస్తాయి. కాలం కలిసి రానప్పుడు, సంకట పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతుంటారు. నిజానికి మన ఘనతకు మనమే కర్తలమని భావించుకున్నప్పుడు మన పరిస్థితులకు కూడా మనమే కొంతవరకు కారణమని తెలుసుకోవాలి. ఆ సమయంలో సానుకూల ధోరణి, ఆశావహ దృక్పథంతో మన ఆలోచనలు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది.

మోడువారిన వృక్షం ఎప్పుడూ అలాగే ఉండదు. కొంతకాలం తరవాత చిగురిస్తుంది. పుష్పిస్తుంది. ఫలాలను ఇస్తుంది. అలాగే మనిషి కూడా ఆశను ఆలంబనగా చేసుకుని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగాలి. నిజానికి కాలం ఎప్పుడూ మనిషి ఆశాకిరణమే. తీయని ఆశలు మనసులో రేకెత్తిస్తుంది. చిగురించే ఆశలతో బతకాలని బోధిస్తుంది. మంచికాలం వస్తుందని భరోసా ఇస్తుంది. అందుకే కాలాన్ని భగవంతుడి స్వరూపంగా చెబుతున్నాయి శాస్త్రాలు. అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుని, ఆ భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకుని, మన అర్హతల్ని పెంచుకుంటూ ఉంటే... అన్నీ మనకు చేరువవుతాయి.

నిజానికి ఏదైనా బాగా కష్టపడితేనే లభిస్తుంది. భగవంతుడు మన కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికేది ఇవ్వాలో దాన్ని తప్పక ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి మనిషీ భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకుని నిరంతర సాధనతో ముందుకు సాగితే విజయం మేళతాళాలతో వచ్చి చేరుతుంది.

విశ్వనాథ రమ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని