అల్లాహ్‌ అనుగ్రహించిన వేళ...

రాళ్లూ రప్పలు ఉన్న భూమిలో నుంచి దివ్యజలధార పైకి ఉబికింది. ఓ తల్లి బీబీ హాజిరా బిడ్డ ఇస్మాయిల్‌(అ.స.) దాహం తీరి అల్లాహ్‌ అనుగ్రహించిన వేళ సమస్త సృష్టి పులకించింది. నాలుగువేల సంవత్సరాలుగా ఎడారి ప్రాంతపు ప్రజలను ఆదుకొని సేద తీరుస్తున్న ఆ నీరు జమ్‌... జమ్‌.. నీరుగా ప్రసిద్ధి పొందింది.

Published : 17 Jun 2024 00:59 IST

రాళ్లూ రప్పలు ఉన్న భూమిలో నుంచి దివ్యజలధార పైకి ఉబికింది. ఓ తల్లి బీబీ హాజిరా బిడ్డ ఇస్మాయిల్‌(అ.స.) దాహం తీరి అల్లాహ్‌ అనుగ్రహించిన వేళ సమస్త సృష్టి పులకించింది. నాలుగువేల సంవత్సరాలుగా ఎడారి ప్రాంతపు ప్రజలను ఆదుకొని సేద తీరుస్తున్న ఆ నీరు జమ్‌... జమ్‌.. నీరుగా ప్రసిద్ధి పొందింది. ఇది మానవులకు అల్లాహ్‌ ప్రసాదించిన జలధార. దైవాన్ని నమ్మిన వారెన్నటికీ నిరాశచెందరు. అల్లాహ్‌ను విశ్వసించిన ఇబ్రహీం(అ.స.) జీవితం ఆమూలాగ్రం మానవులకు జ్ఞాన తృష్ణ తీరుస్తుంది. అల్లాహ్‌ దయతో ఇబ్రహీం(అ.స.) ప్రవక్తల పితామహుడికి ముదిమి వయసులో వరాల పుత్రుడు ఇస్మాయిల్‌(అ.స.) పుట్టాడు. పుత్రోత్సాహంతో ఉన్న ఆ తండ్రికి కొడుకును బలి ఇవ్వవలసిందిగా అల్లాహ్‌ ఆజ్ఞ వచ్చింది. కలవరపడిన ఇబ్రహీం (అ.స.) వెనకంజ వేయలేదు. అల్లాహ్‌ ఆదేశాన్ని శిరసావహిస్తూ బిడ్డను వధించే ప్రయత్నం చేశాడు. దైవం పెట్టిన పరీక్షలో నెగ్గి బిడ్డకు బదులుగా గొర్రెను ఖుర్బానీ ఇచ్చే అనుమతి పొందాడు. ఆనాటి నుంచి పవిత్ర ఈద్‌-ఉల్‌-అజ్‌హా బక్రీదు మాసంలో ఖుర్బానీ ఇచ్చే సంప్రదాయాన్ని విశ్వాసులు కొనసాగిస్తున్నారు.

ప్రవక్త ఇబ్రహీం(అ.స.)ను అనుసరించేవారికి అల్లాహ్‌ కరుణాకటాక్షాలు ఎక్కువగా లభిస్తాయని దివ్య ఖుర్‌ఆన్‌(3:65-68) పేర్కొంటుంది. తమలోని వికారాలను నిలువరించగలగాలి. అటువంటివారే అల్లాహ్‌ విశ్వాసులుగా మనగలుగుతారు. అల్లాహ్‌ మన్నింపునకు అర్హులై ఎన్నో ఘన విజయాలను కైవసం చేసుకొంటారు.  ప్రవక్త ఇబ్రహీం(అ.స.) నాటి ప్రజల మూర్ఖత్వాన్ని వ్యతిరేకించి అల్లాహ్‌ ఏకత్వం వైపు రావలసిందిగా పిలుపిచ్చారు. ఆ ప్రజలు వారి బోధనలు విని తమ విశ్వాసాల్లోని హేతురాహిత్యాన్ని గుర్తించినా అహంకారంతో ప్రవర్తించారు. ఇబ్రహీం(అ.స.)ను తాళ్లతో కట్టి అగ్నిగుండంలోకి విసిరివేశారు. అల్లాహ్‌ విశ్వాసిని ఆ అగ్నికీలలు ఏమీ చేయలేకపోయాయి. అవి పూలమాలలై ఇబ్రహీం(అ.స.)కు అలంకారాలయ్యాయి. ఏకైక దైవారాధన కేంద్రాన్ని మక్కా నగరంలో పునర్నిర్మించే బాధ్యత ఇబ్రహీం(అ.స.), ఇస్మాయిల్‌(అ.స.) తండ్రీ కొడుకులకు అందింది. అదే కాబా గృహంగా పేరొంది దైవదూతల ప్రార్థనలనూ ఆలకిస్తుంది. ఇస్లాంలోని అయిదో నిబంధనగా విశ్వాసులు హజ్‌యాత్ర చేసి కాబాగృహం దర్శించుకొని అల్లాహ్‌ అనుగ్రహాలను పొందుతారు. ఈ ప్రయాణం ధర్మబద్ధమైన సంపాదనతోనే చేయాలి. బక్రీద్‌ మాసంలో హజ్‌యాత్ర చేయలేని నిరుపేదలు ప్రత్యేక ఆరాధనలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. అల్లాహ్‌ ప్రసన్నత పొందడమే అంతిమ లక్ష్యంగా ఉపవాసాలు ఉంటారు. అల్లాహ్‌ను విశ్వసించి శరణు కోరేవారిని కరుణానుగ్రహాలతో అల్లాహ్‌ ముంచెత్తుతాడని ఖురాన్‌ గ్రంథంలోని నాలుగో ఆయత్‌ అన్‌నిసా బోధిస్తుంది. అల్లాహ్‌ దయకోసం శాంతి సహజీవనాలతో అందరం కలిసి ప్రార్థిద్దాం.

హజ్‌యాత్ర వల్ల మనిషి పాపప్రక్షాళన జరిగి అతడు అప్పుడే పుట్టిన పసిబిడ్డలా పునీతుడవుతాడు. అతడు ఐహిక వాంఛలకు, దైవాజ్ఞ ఉల్లంఘనకు పాల్పడకుండా, ప్రదర్శనాబుద్ధి లేకుండా, ఏకాగ్రచిత్తంతో హజ్‌ చేయాలని  హదీసులు వివరిస్తున్నాయి.

షేక్‌ బషీరున్నీసాబేగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని