ప్రకృతి పాఠాలు

అంతర్యామి సృజించినదేదీ పనికిరానిది కాదు. పాము విషాన్ని సైతం మనిషిలోని వివిధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారు. చెట్టు శ్వాసిస్తుందని మానవుడి అడుగుల సవ్వడిని గుర్తిస్తుందని ప్రఖ్యాత వృక్ష శాస్త్రజ్ఞుడు జగదీష్‌ చంద్రబోస్‌ నిరూపించారు. చెట్టు... విస్తరించిన శాఖలతో పండిన ఫలాలు, కాయలతో నిండి ఉన్నప్పుడు వినమ్రంగా ఒంగి ఉంటుంది.

Updated : 18 Jun 2024 05:20 IST

అంతర్యామి సృజించినదేదీ పనికిరానిది కాదు. పాము విషాన్ని సైతం మనిషిలోని వివిధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారు. చెట్టు శ్వాసిస్తుందని మానవుడి అడుగుల సవ్వడిని గుర్తిస్తుందని ప్రఖ్యాత వృక్ష శాస్త్రజ్ఞుడు జగదీష్‌ చంద్రబోస్‌ నిరూపించారు. చెట్టు... విస్తరించిన శాఖలతో పండిన ఫలాలు, కాయలతో నిండి ఉన్నప్పుడు వినమ్రంగా ఒంగి ఉంటుంది. దాని నీడ కూడా భూమిపై  వ్యాపించి ఉంటుంది.  నిండుగా ఫల పుష్పాలతో ఉన్న చెట్టు తలెత్తుకుని పొగరుగా ఉండదు. అలాగే శిశిర రుతువులో ఆకులన్నీ రాలి పళ్లూ పువ్వులు లేక ఏ దుఃఖమూ లేక నిటారుగా నిలుచుని గంభీరంగా అనువైన కాలం కోసం చెట్టు ఎదురు చూస్తూ  ఉంటుంది. కుంగిపోదు. నీళ్లతో నిండిన మేఘాలు సమయానుకూలంగా భూమికి దగ్గరగా వచ్చి వర్షిస్తాయి. అనుకూలమైన తరుణంలో మళ్ళీ చిగిర్చి లేలేత ఆకులతో నిండైన రెమ్మలతో... కొమ్మలతో చెట్టు  శోభిస్తుంది. సుఖం దుఃఖం ఒకదాని తరవాత ఒకటి వస్తుంటాయనే సూక్తిని మానవులు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటోంది ఐతరేయోపనిషత్తు.
సుఖం కలిగినప్పుడు గర్వించడం తగదు. ఆ వెంటనే దుఃఖం కూడా రాబోతోందని తెలుసుకోవాలి. జీవితం సుఖదుఃఖాల మయం. సౌఖ్యంలో పొంగిపోకుండా విషాదంలో కుంగిపోకుండా స్థితప్రజ్ఞతో జీవించడం అలవాటు చేసుకొంటే మానవుడే మహనీయుడవుతాడు. మహావిష్ణువు బాలకృష్ణుడిగా మర్రి ఆకు మీద పవళించాడు. శివుడికి మారేడు చెట్టు, వినాయక పూజలో భాగంగా అనేక పత్రాలను సేకరించి అర్చించే ఆచారం ఉంది. మనిషి ప్రకృతిని ప్రేమించాలి... ప్రకృతి సకల జీవులనూ సంరక్షిస్తుంది.

చెట్టంత మనిషి అని, చెట్టంత ఎదిగాడని  అంటారు. ఈ విశ్వం అంతా పంచ భూతాత్మకమైనదే. ప్రకృతిలోని చెట్లు తదితరాల్లో మనిషిలో ఉన్నట్లే పంచభూతాలూ ఉన్నాయి. వాటిక్కూడా మనిషికిలాగే వినడం, వాసన చూడటం, చవిచూడటం, స్పర్శ, దృష్టి అనే అయిదు ఇంద్రియాలూ ఉన్నాయన్నారు వృక్షశాస్త్ర పరిశోధకుడు జగదీశ్‌ చంద్రబోస్‌. ఉరుములూ పిడుగుల ధ్వని విన్నప్పుడు పువ్వులు, పండ్లు రాలిపడుతుంటాయి. తీగలు భయంతో మొక్కలను చుట్టుకొని పందిరి పైకి  ఎగబాకుతాయని వృక్షశాస్త్రం చెబుతోంది.

మైమరపించే సుగంధానికి, సాంత్వననిచ్చే సంగీత రాగాలకు మొక్కలు స్పందించి ఎదుగుతాయి. వసంతరుతువులో కోయిల చెట్టుకొమ్మలపై కూర్చుని పంచమంలో అభేరి రాగాలను పలుకుతుంటే తరువులు తలలూపుతూ ఆస్వాదిస్తాయని మేఘసందేశంలో మహాకవి కాళిదాసు మనోహరంగా వర్ణించాడు. మనిషిలో పరిణామక్రమం ఎలా ఉంటుందో వాటిలోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తడం, పెరిగి పెద్దవ్వడం, పుష్పించి ఫలాలను ఇవ్వడం, కొంత కాలానికి వయస్సుడిగి నశించడం... ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషికి, చెట్లకు ఆత్మీయ సంబంధం ఉన్నట్లు తోస్తుంది.
వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే- చీడపీడలు సోకిన చెట్టు కూడా బాధపడుతున్నట్లు నీరసించినట్లు ఉంటుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషిలాగే నవనవలాడుతూ మళ్ళీ ఆ చెట్టు కనిపిస్తుంది. ఎర్రటి ఎండలో ప్రయాణం చేసి ఏ చెట్టు కిందో విశ్రమిస్తున్నప్పుడు తల్లి లాలించినట్లే కొమ్మలు కదిలి చల్లని గాలి తెమ్మెరలతో పాటు నీడనిస్తుంది. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైంది బోధి వృక్షం కిందనే. ప్రకృతి ప్రాణం పురుడు పోసుకున్న రోజునే తరువు కూడా పురుడు పోసుకుందని ఆరణ్యకాలు వివరిస్తున్నాయి. ప్రకృతికి వికృతి, వికృతికి ప్రకృతి అనుసంధానమైనట్లు చెట్లు మొక్కలు మానవుడికి అనుసంధానమై ఉన్నాయి. ఈ నిజం తెలుసుకొని ప్రకృతిని మనం ప్రేమిస్తే సర్వ సృజనకారుడు అంతర్యామి మనల్ని ప్రేమిస్తాడు. ఇదే ప్రకృతి తెలిపే గొప్ప పాఠం.

అప్పరుసు రమాకాంతరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని