సోమరితనం వినాశ హేతువు

జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. జీవితం అనిశ్చితం. జీవించినంతకాలం సోమరితనంతో కాలం వృథాగా గడుపుతూ మరణించడం కన్నా, కష్టపడి పనిచేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సిద్ధించుకుని కాలగర్భంలో కలిసిపోవడమే ఉత్తమ జీవన విధానం.

Published : 19 Jun 2024 01:11 IST

న్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. జీవితం అనిశ్చితం. జీవించినంతకాలం సోమరితనంతో కాలం వృథాగా గడుపుతూ మరణించడం కన్నా, కష్టపడి పనిచేస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సిద్ధించుకుని కాలగర్భంలో కలిసిపోవడమే ఉత్తమ జీవన విధానం. ‘చలనం, అభివృద్ధి మాత్రమే జీవనానికి చిహ్నాలు. తుప్పుపట్టి చెడిపోవడం కన్నా అరిగిపోవడం అన్ని విధాలా మంచిది’ అన్నారు స్వామి వివేకానంద.

భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే బుద్ధిని ప్రసాదించాడు. బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సముపార్జించుకున్నవాడు యుక్తాయుక్త విచక్షణ చేయగలుగుతాడు. సదాచారాలను అనుసరిస్తాడు. సత్కర్మలను ఆచరిస్తాడు.

భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు కూడా బాధతో దుఃఖిస్తూ విచారంగా కాలం గడపలేదు. ధర్మరాజుకు రాజోచితమైన శిష్టాచారాలను, రాజ్యపాలనకు అవసరమైన సాధనాలను, ధర్మాచరణ వల్ల కలిగే లాభాలను వివరించాడు. విష్ణు సహస్ర నామాలను మానవాళికి అందించి మహోపకారం చేశాడు.

ఏభై సంవత్సరాల వయసులో శ్రీ రామకృష్ణుల వారికి కంఠంలో వ్రణం బయలుదేరింది. వైద్యుల చికిత్సకు లొంగక వ్యాధి నానాటికీ ప్రబల సాగింది. ప్రాణాపాయకరస్థితిలో ఉన్నా, వైద్యులు వారిస్తున్నా అఖండ విశ్వమానవ ప్రేమతో తన అంతిమదినం దాకా ఆయన ఉపదేశసుధ అవిచ్ఛిన్నంగా సాగింది. నిస్వార్థ సేవకులు కష్టాలకు లొంగకుండా అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉంటారు.

కష్టపడనిదే ఫలితం రాదు. ప్రయత్నం లేనిదే ఏదీ సిద్ధించదు. ఈత నేర్చుకోవాలనుకుంటే కొన్ని దినాలు ప్రయత్నించాలి. నదిలోకి దిగగానే ఈదడం ఎలాగో ఒంటపట్టదు. సంగీతం, నాట్యం వంటి కళల్లో నిష్ణాతులు కావడానికి కొన్ని సంవత్సరాలు సాధన చేయాలి. భగవంతుడి అనుగ్రహం పొందడానికి ఏకాగ్రతతో మనసును భగవంతుడివైపు మళ్ళించి నిరంతరం ధ్యానించాలి.

కామ క్రోధ మాత్సర్యాలనే అంతర్గత శత్రువుల ప్రేరణతో ఊహాలోకంలో విహరిస్తూ కార్యసాధనకు మీన మేషాలు లెక్కిస్తూ వ్యర్థంగా కాలం గడిపే సోమరులు జీవితంలో ఏమీ సాధించలేక నిష్ప్రయోజకులుగా మిగిలిపోతారు.

విద్య, శౌర్యం, సామర్థ్యం, ధైర్యం మనిషికి అంతర్గత మిత్రులని, వాటి ద్వారానే విద్వాంసులు జీవనయాత్ర సాగిస్తారని, ప్రాజ్ఞుడు సమర్థతతో పనిచేస్తూ ప్రతిష్ఠ పొందగలడన్న మహా భారత సందేశాన్ని అర్థం చేసుకున్నవారు తమ గమ్యాలను నిర్దేశించుకుని లక్ష్య సాధనకు కృషిచేసి విజేతలవుతారు. బాల్యంలో గురువులను పూజించి, పట్టుదలతో విద్య నభ్యసించి, కౌమార యౌవన దశల్లో విశేష కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించినవారు వృద్ధాప్యానికి మధుర స్మృతులు మిగుల్చుకుంటారు. భావి తరాలకు ఆదర్శప్రాయులవుతారు.

మొక్క సకాలంలో పుష్పిస్తుంది. చెట్టు కాలాన్ననుసరించి ఫలాలనందిస్తుంది. ప్రకృతిని ఆదర్శంగా తీసుకుని మనిషి సోమరితనాన్ని వీడి సత్కార్యాల్లో నిమగ్నమై సమాజాభివృద్ధికి పాటుపడాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మానవ జన్మను అనుగ్రహించిన భగవంతుడి సేవలో తరించాలి.

న్యాయం, శ్రమతో కూడిన సంపాదన మనిషికి సుఖాన్నిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. సత్కర్మలకు ప్రేరణ లభిస్తుందన్న వేద సందేశాన్ని అర్థం చేసుకున్నవారు ఇతరులపై ఆధారపడరు. శ్రమించడంలోనే ఆనందాన్ని అనుభవిస్తారు.

ఇంద్రగంటి నరసింహ మూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని