కీర్తి మూర్తులు

మనిషిని సంతోషపెట్టే అనేక లౌకిక విషయాల్లో కీర్తి ఒకటి. మనిషి సహజంగానే కీర్తికాముకుడు. ఎవరికైనా కీర్తి వస్తే వారు ఎంతగానో ఆనందిస్తారు. దాని నుంచి మరికొంత స్ఫూర్తినీ పొందుతారు. కీర్తి స్వభావం అటువంటిది. మంచి పనులు చేసినవారికి మంచి పేరు, తద్వారా కీర్తిప్రతిష్ఠలు తప్పక దక్కుతాయి.

Published : 20 Jun 2024 01:33 IST

మనిషిని సంతోషపెట్టే అనేక లౌకిక విషయాల్లో కీర్తి ఒకటి. మనిషి సహజంగానే కీర్తికాముకుడు. ఎవరికైనా కీర్తి వస్తే వారు ఎంతగానో ఆనందిస్తారు. దాని నుంచి మరికొంత స్ఫూర్తినీ పొందుతారు. కీర్తి స్వభావం అటువంటిది. మంచి పనులు చేసినవారికి మంచి పేరు, తద్వారా కీర్తిప్రతిష్ఠలు తప్పక దక్కుతాయి. మనం చేసే పనులను బట్టే కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయనేది సత్యం.

గురుస్థానంలో ఉండి ప్రసిద్ధులైన ఎందరో రుషులు మనకు కనిపిస్తారు. వ్యాసుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు... ఇలా చాలామంది లోకంలో గురుశ్రేష్ఠులై విలసిల్లారు. ఆధునిక కాలంలోనూ గురుపరంపర కొనసాగుతోంది. యథాశక్తి వారూ పేరుప్రతిష్ఠలు పొందుతున్నారు. మరికొందరు వారికిష్టమైన పనిలో ప్రావీణ్యం సంపాదిస్తారు. వారు ఆ పనిలో నిష్ణాతులై కీర్తి పొందుతారు. నలమహారాజు, భీమసేనుడు ఈ విధంగా పేరు గడించినవారే. వారు పాకశాస్త్ర ప్రవీణులు. లోకంలో నలభీమపాకమనే నానుడి ఉంది.

పాండవులు ఎప్పుడూ ధర్మం వైపే ఉన్నారు. వారు ఊరికెప్పుడూ ఉపకారమే చేశారు. సత్కార్యాలతో శాశ్వత కీర్తి గడించారు. అలాగే చేతికి ఎముక లేకుండా దానం చేసిన కర్ణుడు ఎనలేని కీర్తిని పొందాడు. లోకహితకరమైన కార్యాలు చేయడం ద్వారా శిబిచక్రవర్తి, దధీచి మొదలైనవారు ఎంతో కీర్తినార్జించారు. మమ్మటుడు తన ‘కావ్య ప్రకాశం’ గ్రంథంలో కావ్యాలు రాయడం వల్ల కలిగే ప్రయోజనాల జాబితా ఇచ్చాడు. ‘కావ్యం యశసే...’ అంటూ, కావ్యాలు రాయడం వల్ల కీర్తి వస్తుందని చెప్పాడు. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, భాసుడు మొదలైన మహాకవులు లోకప్రశస్తమైన కృతులు రాసి ఎంతో కీర్తిని పొందారు. తెలుగు సాహిత్యంలో కవిత్రయం, పోతన,   శ్రీనాథుడు గొప్ప గొప్ప కావ్యాలు రాసి ఘనమైన కీర్తి సంపాదించుకున్నారు. ఈ పరంపర నేటికీ కొనసాగుతోంది.

సమాజంలో కొందరికి దానం చేయడం వల్ల కీర్తి దక్కుతుంది. ఇంకొందరికి మంచి వ్యక్తిత్వం వల్ల పేరుప్రఖ్యాతులు వస్తాయి. మరికొందరికి వారు చేసే సేవల ద్వారా కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. శ్రీమతి డొక్కా సీతమ్మ లాంటివారికి అన్నదానం చేయడం వల్ల నిరుపమానమైన కీర్తిప్రతిష్ఠలు లభించాయి. స్వామి వివేకానంద లాంటివారు ఉన్నతమైన వ్యక్తిత్వం ద్వారా విశ్వవిఖ్యాత కీర్తి గడిం చారు. మదర్‌ థెరెసాకు ఆమె సేవల ద్వారా ఎనలేని పేరుప్రఖ్యాతులు వచ్చాయి. సమాజంలో ఇప్పుడూ ఎంతోమంది దాతృత్వం వల్ల ప్రఖ్యాతి పొందుతున్నారు.

చిత్రలేఖనం వంటి లలితకళలు సైతం కొందరికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. కేరళకు చెందిన రాజా రవివర్మ, తెలుగువారైన దామెర్ల రామారావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు. సిద్ధేంద్రయోగి నాట్యశాస్త్రం వల్ల ప్రసిద్ధి చెందారు. ఇటువంటివారి కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం ప్రకాశిస్తుంటాయి. అయితే, సమాజం ఎప్పుడూ ఒకటి గమనించాలి. ఇంతమంది మహానుభావులు ఆయా రంగాల్లో అంతటి విజయాలు సాధించింది కేవలం కీర్తిప్రతిష్ఠలు పొందాలని కాదు. అది వారివారి ప్రతిభా వైదుష్యమని గ్రహించాలి. అర్హులైనవారందరికీ కీర్తి దక్కుతుంది. అర్హత ఉంటే ఎవరినైనా, ఎప్పుడైనా పేరుప్రఖ్యాతులు వెతుక్కుంటూ వస్తాయి. అందులో లోకకల్యాణ కారకమైన పనులు చేసేవారిని కీర్తిప్రతిష్ఠలు తప్పక వరిస్తాయి.

డాక్టర్‌ బండి సత్యనారాయణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని