కృషి పూర్ణిమ

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు జరుపుకొనే ఏరువాక పున్నమి అన్నదాతలకు ఎంతో ఇష్టమైన పండుగ. అన్నదాతను దేశానికి వెన్నెముక అంటాం. అతడి పండుగ అందరికీ పండుగే. ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచిన నాగలి. ఏరువాక అంటే దుక్కి ప్రారంభ దినం. పొలం దున్నడానికి శుభప్రదమైన నక్షత్రం ‘జ్యేష్ఠ’. ఈ నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉంటాడు.

Published : 21 Jun 2024 01:19 IST

జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు జరుపుకొనే ఏరువాక పున్నమి అన్నదాతలకు ఎంతో ఇష్టమైన పండుగ. అన్నదాతను దేశానికి వెన్నెముక అంటాం. అతడి పండుగ అందరికీ పండుగే. ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచిన నాగలి. ఏరువాక అంటే దుక్కి ప్రారంభ దినం.

పొలం దున్నడానికి శుభప్రదమైన నక్షత్రం ‘జ్యేష్ఠ’. ఈ నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉంటాడు. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధుల సమృద్ధి మాత్రమే వ్యవసాయానికి మంచి ఫలసాయం అందిస్తుంది. అందుకు సకాలవృష్టి అవసరం. వర్షం కురిపించే ఇంద్రుణ్ని అందుకే ఈ రోజున ప్రార్థిస్తారు. ఈ రోజున వ్యవసాయ పరికరాలను శుభ్రపరచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, టెంకాయలు ఎడ్లకు సమర్పిస్తారు. ఎడ్లబండ్లనూ అలంకరించి, మంగళవాద్యాలతో ఊరేగిస్తారు. గోగునారతో చేసిన తోరణాలు గుమ్మాలకు కడతారు. వాటిని చర్నాకోలతో కొట్టి, ఆ పీచును తీసుకెళ్ళే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

కర్ణాటకలో ఈ పండుగను ‘కారిణి పబ్బం’ పేరుతో పిలుస్తారు. ‘పొంగలి’ వండి నివేదన చేసి అందరికీ పంచిపెడతారు. కొన్ని చోట్ల ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. ఐరోపాలో ఈ పండుగను ‘మేషోవ్‌’ అనే పేరుతో జరుపుకొంటారు. శుద్ధోదన మహారాజు కపిలవస్తు నగరంలో ఈ పండుగనాడు బంగారు నాగళ్లను రైతులకు బహూకరించేవాడట. ‘సీతాయజ్ఞం’ పేరుతో ఈ పండుగ జరుపుకొన్నట్లు విష్ణుపురాణం అభివర్ణిస్తోంది. ‘సీత’ అంటే నాగటి చాలు. అందుకే ఈ పేరు ఆ పండుగకు వచ్చి ఉండవచ్చు. బౌద్ధ జాతక కథల్లోని ‘వప్ప మంగల దివస’ ఈ పండుగ లాంటిదే! ఏరువాక పున్నమినాడు ‘పద్మపురాణం’ గ్రంథం దానం చేయడం అశ్వమేధయాగ పుణ్యఫలంతో సమానమని శాస్త్ర కథనం. జ్యేష్ఠ పూర్ణిమనాడు వట సావిత్రీ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు.

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఏదో పేరుతో ఈ రైతుల పండుగ జరుగుతుందని చరిత్ర చెబుతోంది. జైమిని న్యాయమాల గ్రంథం, బౌద్ధ జాతక కథలు, హాలుడి గాథా సప్తశతి, అథర్వణవేదం, వరాహమిహిరుడి బృహత్సంహిత, పరాశరుడి కృషి పరాశరం మొదలైన గ్రంథాల్లో ఈ రైతుల పండుగ గురించి విస్తారంగా కనిపిస్తుంది. ఈ పండుగ గురించిన ఎన్నో పల్లెపదాలు, జానపద గీతాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక సామెతలకు లెక్కే లేదు. ఇవన్నీ జానపద సంప్రదాయ- సంస్కృతులకు అద్దంపడతాయి. సురవరం ప్రతాపరెడ్డి, ముద్దా విశ్వనాథం మొదలైన ఆధునిక చరిత్రకారులు సైతం ఏరువాక పున్నమి గురించిన విశేషాలను తమ గ్రంథాల్లో ఉటంకించారు. రైతు బతుకే మనకు మెతుకు. ఏరువాక జాతికి తేనెవాక, దేశానికి వెన్నెలవాక. అన్నదాతకు తగిన ఆత్మస్థైర్యం, ప్రోత్సాహ సహకారాలందించడం మన పరమావధి.

చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని