సమస్థితి

ఈతి బాధలతో సంసారసాగరం ఈదలేక, జీవితంమీద విరక్తిచెందిన ఓ వ్యక్తి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఓ ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించాలని వేడుకున్నాడు. గురువు అతడి బాధలు విని మరో శిష్యుడితో ఓ చెంబుతో నీళ్లు తెప్పించాడు.

Published : 22 Jun 2024 01:07 IST

తి బాధలతో సంసారసాగరం ఈదలేక, జీవితంమీద విరక్తిచెందిన ఓ వ్యక్తి సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. ఓ ఆధ్యాత్మిక గురువు వద్దకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించాలని వేడుకున్నాడు. గురువు అతడి బాధలు విని మరో శిష్యుడితో ఓ చెంబుతో నీళ్లు తెప్పించాడు. కొత్తగా వచ్చిన వ్యక్తితో ఆ చెంబులో మరికొన్ని నీళ్లు పోయమన్నాడు. చెంబునిండా నీళ్లు ఉన్నాయి, ఇంకా పోస్తే ఒలికిపోతాయి అన్నాడా వ్యక్తి. వెంటనే గురువు- నీ మనసు ఇప్పటికే రకరకాల బాధలతో, భావాలతో, నమ్మకాలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. ముందు దాన్ని ఖాళీ చేసుకుని రా అని చెప్పాడు.

అర్జునుడు కురుక్షేత్ర సంగ్రా మంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువును, సమ ఉజ్జీ అయిన కర్ణుడిని, దాయాది అయిన దుర్యోధనుణ్ని, అశ్వత్థామను, బంధుగణాన్ని చూశాడు. వెనక్కి తిరిగి తన పరివారాన్ని చూస్తే పెద్దవాడవుతున్న ధర్మజుడు, తనకంటే భుజబలం ఎక్కువ ఉన్నా బుద్ధిబలం తక్కువ కలిగిన భీముడు, చిన్నవాళ్లైన నకుల సహదేవులు కనిపించారు. కాబట్టి యుద్ధంలో గెలుపు ఓటములు తన భుజస్కంధాలపైనే ఆధారపడి ఉన్నాయని గ్రహించాడు. ఒకవేళ ఓడిపోతే ఎదురయ్యే పరిణామాల్ని తలచుకునేసరికి మనోవ్యాకులత ఆవహించింది. అర్జునుడి వద్ద పాశుపతాది అస్త్రాలు మెండుగా ఉన్నా, ఆత్మవిశ్వాసం నిండుకుంది. అర్జునుడిలో అడుగంటిన ఆత్మవిశ్వాసాన్ని, మనోశక్తిని సమాయత్తం చెయ్యడానికి శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో అనేక మార్గాలను బోధించాడు. అవి కేవలం అర్జునుడికి మాత్రమే కాకుండా- సృష్టి ఉన్నంతవరకు సమస్త మానవాళికీ ఉపయోగపడే ఆణిముత్యాలు. అర్జునుడి మనోక్షేత్రంలో మొలిచిన అనుమానపు కలుపు మొక్కల్ని శ్రీకృష్ణుడు ఏరిపారేశాడు. అర్జునుడి మనసును సేద్యానికి అనువైన సుక్షేత్రంలా మార్చాడు. అందులో కర్మయోగం అనే విత్తనాలను వెదజల్లాడు.

ఆధునిక సమాజంలో ధనిక పేద భేదాలు లేకుండా ప్రతి మనిషీ ఏదో ఒక మనోవ్యాకులతతో బాధపడుతున్నాడు. కారణం సంతృప్తి, సమతుల్యత లోపించడమే. కోరికలు ఉండాలి. కానీ, ఎంతవరకు? మనసులో ఉద్భవించే దుర్గుణాలను తిరస్కరించాలనే బుద్ధికుశలత ఉండటం ఎంతో అవసరం. ఇవాళ మరొకరు చెబితే వినే స్థితి అటు మనిషిలోను, ఇటు సమాజంలోను లోపించింది.

అంతరంగంలో ఉద్భవించే ఆలోచనల అంతఃకరణమే మనసు. అలాంటి మనసును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునేవాళ్లలో సదాలోచనలు కలుగుతాయి. అవి ఎప్పటికప్పుడు సత్కార్యాచరణకు ప్రేరణనిస్తాయి. ‘కృష్ణుడు ఎప్పుడూ నిన్ను విడవకుండా తన చేతుల్లోనే ఉంచుకుంటాడు కదా... ఆ రహస్యం ఏమిటో చెప్పు’అని ఒకసారి వేణువును చూసి రుక్మిణీదేవి అడిగింది. అందుకు వేణువు- నాలో శూన్యం తప్ప మరేమీ లేదు. ఏమీ లేకపోవడమే నన్ను ఆయనతోనే ఉండేలా చేసింది అంది. ఎవరైతే ప్రాపంచిక విషయాలను మనసు నుంచి పూర్తిగా తొలగించి, మనసును ఖాళీగా ఉంచుకుంటారో వారు సర్వాంతర్యామికి సమస్థితిలో ఉండగలుగుతారు.

ఎం.వెంకటేశ్వరరావు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని