జీవిత పాఠాలు

దత్తాత్రేయుడు తనకు 24మంది గురువులు అని, వారినుంచి ఎన్నో పాఠాలు నేర్చానని చెప్పారు. నీటిలోని చేప, నేలమీది తాబేలు, ఆకాశంలో ఎగిరే పక్షి  ఎలా జీవించాలో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. చేప నీటిలో ఉన్నప్పటికీ దాని చూపు ఒడ్డుపైనే ఉంటుంది. ఎందుకంటే దాని గుడ్లు గట్టుమీదే ఉన్నాయి.

Updated : 24 Jun 2024 06:36 IST

త్తాత్రేయుడు తనకు 24మంది గురువులు అని, వారినుంచి ఎన్నో పాఠాలు నేర్చానని చెప్పారు. నీటిలోని చేప, నేలమీది తాబేలు, ఆకాశంలో ఎగిరే పక్షి  ఎలా జీవించాలో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. చేప నీటిలో ఉన్నప్పటికీ దాని చూపు ఒడ్డుపైనే ఉంటుంది. ఎందుకంటే దాని గుడ్లు గట్టుమీదే ఉన్నాయి. అవి పిల్లలై తనతో పాటు నీళ్లలో ఈదే దాకా, చేపకు నిలకడ ఉండదు. తాబేలు నీటిలో, నేలమీద సంచరిస్తుంది. దాని దృష్టి కూడా సంతానం మీదే లగ్నం అయివుంటుంది. పంజరం నుంచి బయటపడిన పక్షి ఆకాశంలో స్వేచ్ఛగా రెక్కలు పరుచుకుని, హాయిగా విహరిస్తుంది. సృష్టిలో ప్రతి జీవికి ఒక దృష్టి కోణం ఉంటుంది. జీవితం అశాశ్వతం. ఇక్కడ అనుభవించే సుఖభోగాలు తాత్కాలికంగా శరీరానికి, మనసుకు, ఉపశమనం కలిగిస్తాయి. సుఖం తరవాత దుఃఖం, భోగం తరవాత రోగం వెంటాడతాయి. శరీర ధ్యాస నుంచి మెల్లమెల్లగా మనసును దారి మళ్ళిస్తే, అది ఏకాంతంలో ఉన్న శాశ్వతమైన సుఖశాంతులకు అలవాటుపడుతుంది.

నేర్పు, ఓర్పు, కూర్పు- మూడూ జీవితానికి అన్వయించుకోవాలి. పరిస్థితి ఎదురుతిరిగినప్పుడు, ఆపదలు చుట్టుముట్టినప్పుడు, దారీతెన్నూ కానరానప్పుడు, కనువిప్పు కలిగించే సూత్రాలను జ్ఞప్తి చేసుకుంటే- ధైర్యం, సాహసం తోడై కార్యాచరణకు ప్రోత్సాహకాలు అవుతాయి.

నీటిలో ఒడ్డును ఒరుసుకుని, తుంగ అడ్డదిడ్డంగా పెరుగుతుంది. నీళ్లలో దిగేవాడికి చీకాగ్గా అనిపిస్తుంది. కాలుజారి నీటిలో పడి కొట్టుకుపోకుండా ఆపడానికి అదే ఉపయోగపడుతుంది. ప్రవాహంలో ఆ గడ్డిపోచలే గునపాలుగా మునిగిపోయేవాటిని ఆదుకుంటాయి. చీకటిపోగానే వెలుగు కనిపిస్తుంది. కష్టాలు తీరగానే తప్పకుండా సుఖపడతామన్న ధీమా ఉన్నవారినే ‘నేర్పరి’ అంటారు. ఓర్పు నేర్పరితనంలోని భాగం. అనవసరమైన వాటిని గురించి ఆలోచించి, బుర్ర బద్దలు కొట్టుకునే జనాభా చాలానే ఉంది. ఏది అవసరమో, ఎలా సాధించాలో, ముందుగా కూడిక తీసివేతలు చేసుకుంటే, మనసు ఏకాగ్రమవుతుంది.

కార్యసాధనలో హనుమంతులవారిదే పైచేయి. తన బలం ఏమిటో తెలిశాక, కృతనిశ్చయంతో లంకానగరానికి పయనమయ్యాడు. మహేంద్రగిరి శిఖరాగ్రాన కాలూనగానే ప్రకంపనలు బయలుదేరాయి. పావని తన తండ్రి వాయుదేవుణ్ని స్మరించి ఒక్క ఉదుటున సముద్రం లంఘించాడు. ఆవలి తీరం చేరేదాకా ఎక్కడా ఆగలేదు. ఛాయాగ్రహమైన సింహికను లాఘవంగా సంహరించాడు. మైనాకుడి ఆతిథ్యం తిరస్కరించాడు. లంకను గాలించి అశోకవనంలో సీతమ్మ దర్శనం చేసుకున్నాడు. రాముడి సందేశం వినిపించి, లంకను దహించి, విజయుడై కిష్కింధకు తిరిగి వచ్చాడు.

ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని