పద్య నైవేద్యం

పద్యం తెలుగువారి సాంస్కృతిక సంపద. తెలుగు పద్యాన్ని రాయడమే కాదు, చదవడం సైతం గొప్ప కళ. పోతన భాగవతంలో శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు చెప్పిన పద్యం ‘త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప...’ సుప్రసిద్ధమైనది. పోతనకు ఎంతో పేరు తెచ్చింది. దాన్నిలా పొడిపొడిగా కాకుండా- దీపింప ఉద్దీపింప తనువుద్దీపింప కాంతి తనువు ఉద్దీపింప నీలకాంతి తనువు ఉద్దీపింప...

Updated : 25 Jun 2024 05:54 IST

ద్యం తెలుగువారి సాంస్కృతిక సంపద. తెలుగు పద్యాన్ని రాయడమే కాదు, చదవడం సైతం గొప్ప కళ. పోతన భాగవతంలో శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు చెప్పిన పద్యం ‘త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప...’ సుప్రసిద్ధమైనది. పోతనకు ఎంతో పేరు తెచ్చింది. దాన్నిలా పొడిపొడిగా కాకుండా- దీపింప ఉద్దీపింప తనువుద్దీపింప కాంతి తనువు ఉద్దీపింప నీలకాంతి తనువు ఉద్దీపింప... అని ఆ విశేషణాలను ఒక్కొక్కటిగా చేర్చుకొంటూ చదివితే అర్థమవుతుంది- దాని శబ్దమహిమ! గొప్పగా స్ఫురిస్తుంది- భీష్ముడి మదిని ఆవేశించిన ‘వన్నెకాడి’ దివ్య సౌందర్య గరిమ. కవిగా పోతన తొలుత దాన్ని ఉపాసించి అక్షర రూపంలో మనకు అందించాడు. ఆ సాక్షాత్కార అనుభూతి కారణంగా కవి కంఠం శంఖమై మోగింది. గానమై సాగింది. గగనమై ప్రతిధ్వనించింది. చిరాయువుగా నిలిచింది. అపురూపమైన ఒక భావం అక్షరంగా పురుడు పోసుకొనేవేళ కవికి అది ఏ తరహా దర్శనాన్ని, ఎంతటి ఆనందానుభూతిని అనుగ్రహిస్తుందో చెప్పడం కష్టం. అదే స్థాయి అనుభవం పాఠకుడికి కలగాలంటే సాహిత్యానికి సంబంధించిన రహస్య అధ్యయన నైపుణ్యం పట్టువడాలి. రసజ్ఞులు, భావుకులు ఆ కోవకు చెందినవారు. వారికి దక్కే వరం పేరు- రససిద్ధి.

నీళ్ళలో ఈదే చేప మనకు కనిపిస్తూనే ఉంటుంది. వాస్తవానికి మన కంటికి తోస్తున్న చోట అది ఉండదు. ఇంతలో ఓ లకుముకి పిట్ట రివ్వున వాలి, మనం నీటిలో చూస్తున్న చోటుకు కాస్త ఎడంగా ముక్కును జొనిపి అదే చేపను టక్కున పట్టుకొంటుంది. అప్పుడు మనకు చేప కనపడిన చోటు వేరు, యథార్థంగా అది ఉన్నది వేరు- అని తెలుస్తుంది. లకుముకి పిట్టకు గల ఆ నైపుణ్యాన్నే ‘లాఘవం’ అంటారు. పద్యవిద్యలోనూ అవసరమైన దినుసది. 

వామనమూర్తి విశ్వరూపాన్ని వర్ణిస్తూ పోతన ‘ఇంతింతై...’ పద్యంలో ఇంత చిన్న పిల్లవాడు ‘అదిగో అంతయ్యాడు, ఎంతో అయ్యాడు...’ అంటూ పాఠకుణ్ని ఆకాశంలోకి తీసుకుపోతాడు. తిరిగి ‘రవిబింబం...’ పద్యంలో అంతపై నుంచీ క్రమంగా కిందకు తీసుకొస్తాడు. మొదటి పద్యంలో ఇతివృత్తం (బ్యాక్‌ డ్రాప్‌) స్థిరంగా ఉంటుంది. వామనుడు (వస్తువు లేదా సబ్జెక్టు) పెరిగిపోతుంటాడు. ఆకాశాన్ని మేఘాలను సూర్యమండలాన్ని ధ్రువ మహర్లోకాలను, ఆఖరికి బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు. ‘రవిబింబం...’ పద్యంలో వస్తువు నిశ్చలంగా ఉండి, ఇతివృత్తం కదిలిపోతుంటుంది. అంటే వామనుడు స్థిరంగా ఉంటాడు. సూర్యబింబం తొలుత అతడి తలపై గొడుగులా తోస్తుంది. దరిమిలా శిరోమణిగా, కర్ణాభరణంగా, కంఠహారంగా, దండ కడియంగా, ముంజేతి కంకణంగా, కాలి అందెగా, చివరకు పదపీఠికగా మారిపోయిందంటాడు పోతన. వామనుడి నెత్తిమీద కనపడిన సూర్యుడు క్షణాల్లో పాదాల దగ్గర చేరాడంటే వామనుడి తల ఏ లోకాలను దాటిపోయిందో మనం ఊహించుకోవాలి. ఇది వ్యాస భాగవతంలో లేని వర్ణన. తెలుగుకవి పోతన చిత్రణ. సరస్వతికి నైవేద్యాలనదగ్గ పద్యాలివి. భావనామయ జగత్తులోంచి పరికించవలసిన దృశ్యాలవి. ఆ పద్యాలు కంటిలో కదులుతాయి. మనసులో ఎదుగుతాయి. చదివే పద్యాలు కావవి- దర్శించవలసిన వర్ణ చిత్రాలు. అద్భుత రసాన్ని దృశ్యంగా మార్చి, అనుభూతిగా తీర్చి, స్మృతిగా మిగిల్చిన ఈ చిత్రకళను పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే- మనిషికి పద్య విద్య పట్టువడాలి. రసజ్ఞుడు కావాలి. సాహిత్య అధ్యయనం మనిషికి చేసే మహోపకారాన్ని అందిపుచ్చుకొన్నవాడే ‘యోగవాసిష్ఠం’ దృష్టిలో సజీవుడు! 

ఎర్రాప్రగడ రామకృష్ణ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని