కార్యసాధకులు

జీవితంలో ఒడుదొడుకులు, గెలుపు ఓటములు, చీకటి వెలుగులు, కష్ట సుఖాలు... అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ సమదృష్టితో చూడాలి. అలాగైతేనే జీవనగమనం సరైన తీరున సాగుతుంది. అంతేగాని కష్టాలకు కుంగిపోవడం, సుఖానికి పొంగిపోవడం అనేవి స్థిరచిత్తుల లక్షణం కాదు. ఒక్కొక్కసారి మనం తలపెట్టిన పని ఎంత ప్రయత్నించినా నెరవేరదు.

Published : 28 Jun 2024 01:09 IST

జీవితంలో ఒడుదొడుకులు, గెలుపు ఓటములు, చీకటి వెలుగులు, కష్ట సుఖాలు... అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ సమదృష్టితో చూడాలి. అలాగైతేనే జీవనగమనం సరైన తీరున సాగుతుంది. అంతేగాని కష్టాలకు కుంగిపోవడం, సుఖానికి పొంగిపోవడం అనేవి స్థిరచిత్తుల లక్షణం కాదు. ఒక్కొక్కసారి మనం తలపెట్టిన పని ఎంత ప్రయత్నించినా నెరవేరదు. అయినా నిరాశతో కుంగిపోకూడదు. మళ్ళీమళ్ళీ ప్రయత్నం చేయాలి. పట్టు విడవకూడదు. ఎవరైతే ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా తన శక్తినంతా వినియోగిస్తారో వారికి భగవంతుడి సహాయం తప్పకుండా లభిస్తుంది అనేవారు వివేకానందులు.
ఏదైనా కార్యం చేయాలని సంక ల్పించినప్పుడు ఎటువంటి అవరోధాలు, ఆపదలు, అనర్థాలు ఎదురైనా వాటిని అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ఇదే విషయాన్ని ఏనుగు లక్ష్మణ కవి తన సుభాషితాలులో ఇలా చెప్పారు... ‘ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవకుండా తుదకంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలా చేసేవారు ఉత్తములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదు రవగానే వదిలేసేవారు మధ్యములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనీ చేపట్టనివారు అధములు’.
‘వైఫల్యాలు విజయాలకు సోపానాలు’ అని అనుభవాలు నేర్పిన సంఘటనలను జాగ్రత్తగా గమనించాలి. వాటినుంచి కీలక విషయాలను, లోపాలను గ్రహించాలి. తన రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించే శత్రురాజుతో పోరాడుతున్నాడు ఒక రాజు. అతని ధాటికి తట్టుకోలేక తప్పించుకుని ఒక గుహలో దాగున్నాడు. ఆ సమయంలో అతడి దృష్టి గూడు కడుతున్న సాలీడు మీద పడింది. అల్లుతున్న ఆ గూటికి ఎన్నో అడ్డంకులు కలిగి గూడు చెదిరిపోతోంది. ఎన్నిసార్లు చెదిరినా విసిగిపోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఉంది. చివరకు విజయం సాధించింది.ఆ దృశ్యం చూసిన రాజు అదే స్ఫూర్తితో శత్రురాజు మీద తిరగబడి ధైర్యంగా ఎదుర్కొని ఓడించి తన రాజ్యాన్ని రక్షించుకున్నాడు.

సీతమ్మ జాడ తెలుసుకునే ప్రయత్నంలో హనుమంతుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా వెనుతిరిగి పోలేదు. రావణ సేనమీద ఎదురు తిరిగి రెట్టించిన ఉత్సాహంతో అనుకున్న కార్యాన్ని సాధించి విజయాన్ని చేజిక్కించుకున్నాడు.

సవతి తల్లి నిరాదరణ, తండ్రి నిర్లక్ష్యాలకు గురైన ధ్రువుడు తల్లి సలహాను అనుసరించి తపస్సుకు బయలుదేరాడు. అరణ్య మార్గం గుండా పోతూండగా నారదుడు కనిపించి వివరాలడిగాడు. ఆ చిన్నవాడి పట్టుదలకు సంతోషించి ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రబలంతో తపస్సులోకి ప్రవేశించాడు. ఎన్ని అవాంతరాలు ఆటంకాలు చుట్టుముట్టినా చెక్కుచెదరకుండా తపస్సు చేసి భగవంతుణ్ని ప్రసన్నం చేసుకున్నాడు. ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి నిరాకరించాడు ద్రోణుడు. అయినా నిరాశ చెందక అతడి మూర్తిని తయారు చేసి దాన్నే గురువుగా భావించి భక్తిశ్రద్ధలతో విద్య నేర్చుకుని ప్రతిభావంతుడయ్యాడు.

మన ఆలోచనలే మనకు మార్గాన్ని నిర్దేశిస్తాయి. నిరాశ, నిస్పృహలను పక్కన పెట్టి నమ్మకంతో ముందడుగు వేస్తే జయం మనదే. జీవితం విజయపథంలో పయనించేందుకు ఆత్మ స్థైర్యం ప్రధాన పాత్ర వహిస్తుంది. అది ఉన్నవారికి అసాధ్యమైనది ఏదీ ఉండదు.

వి.ఎస్‌.రాజమౌళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని