సంగీత విపంచి

వల్లకి, వీణె, వీణియ, విపంచి అనేవి వీణకు పర్యాయపదాలు. భారతీయ సంస్కృతి వీణను దేవతల వాయిద్యంగా అభివర్ణించింది. అందుకే ‘దైవిక వాయిద్యం’ అంటారు. కళలు, విద్యలకు అధిదేవతగా కొలిచే సరస్వతితో పాటు అనేక దేవతలకు వీణ ఇష్టమైన వాయిద్యం. సరస్వతి వీణను ‘కచ్ఛపి’ అంటారు. ఇతర వీణల లాగా నాదాలను కాక అక్షరాలను స్ఫురింపజేయడం దీని ప్రత్యేకత.

Published : 29 Jun 2024 01:37 IST

ల్లకి, వీణె, వీణియ, విపంచి అనేవి వీణకు పర్యాయపదాలు. భారతీయ సంస్కృతి వీణను దేవతల వాయిద్యంగా అభివర్ణించింది. అందుకే ‘దైవిక వాయిద్యం’ అంటారు. కళలు, విద్యలకు అధిదేవతగా కొలిచే సరస్వతితో పాటు అనేక దేవతలకు వీణ ఇష్టమైన వాయిద్యం. సరస్వతి వీణను ‘కచ్ఛపి’ అంటారు. ఇతర వీణల లాగా నాదాలను కాక అక్షరాలను స్ఫురింపజేయడం దీని ప్రత్యేకత. బ్రహ్మదేవుడు సైతం వీణలో ప్రవీణుడని, అతడి వీణ పేరు బ్రహ్మవీణ అనీ పురాణాలు చెబుతున్నాయి. 

ఆది శంకరాచార్యులు తన సౌందర్యలహరి పదిహేనో శ్లోకంలో సరస్వతి విపంచి మీటుతున్నట్లుగా వర్ణించారు. దాన్ని చదువుతుంటే సాక్షాత్తు ఆ దేవి రూపమే గోచరమవుతుందని అనుభూతి చెందిన వారంటారు.  ఆది పరాశక్తి చేతిలోనూ వీణ ఉంటుందని కాళిదాసు విరచిత శ్యామలా దండకం ప్రారంభం (మాణిక్యావీణా ముపలాలయంతి...) వల్ల తెలుస్తోంది. ‘నవరత్నమాల స్తోత్రం’ అనే మరో రచనలోనూ సప్తస్వరాలు మేళవించిన ఆమె సంగీత వైభవంలో లోకం ఓలలాడుతుందని వర్ణించాడాయన. శివుడి శాంత స్వరూపానికి ప్రతీక దక్షిణామూర్తి రూపం. ఈయనను జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడిగా పిలుస్తారు. ఆయన చేతిలోనిది- రుద్రవీణ. సనకాది మునులకు, జ్ఞానులకు బోధన చేయడానికి ఆయన వీణను పట్టుకున్నట్టు చెబుతారు పౌరాణికులు.

విశ్వావసుడు ఒక గంధర్వరాజు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. అతడి వీణకు బృహతి అని పేరు. గంధర్వుల్లో తుంబురుడు వాయించే వీణకు కళావతి అని పేరు. అతడి పేరు మీద దానికి తుంబురా లేదా తంబురా అని పేరు వచ్చింది. వివిధ శ్రుతులను పలికించడం దీని ప్రత్యేకత. అందుకే ఇది సంగీతానికి వెన్నెముక లాంటిది అంటారు సంగీతకారులు. నారదుడి వీణ మహతి. త్యాగరాజు తన కృతి ‘శ్రీ నారద’(కానడ రాగం)లో నారదుడు ‘వీణా వాదన’ రహస్యాలు తెలిసిన గొప్ప మహర్షి అని వర్ణించాడు.

వివిధ వీణల్లో తంత్రులు భిన్నంగా ఉంటాయని సంగీతజ్ఞులు చెబుతారు. వీరి కథనం ప్రకారం తంబురాలో నాలుగు, కచ్ఛపి, మహతి వీణల్లో ఏడు, బృహతి(సితార)లో పదిహేను తంత్రులుంటాయి.

ఎందరో రుషులు వీణా వాద్యకారులుగా  ప్రసిద్ధులయ్యారు. అగస్త్య మహర్షి గొప్ప వీణావాదకుడు. ఇతడు వీణలో రావణుడితో పోటీపడ్డాడని పౌరాణిక కథనం. రావణుడు సైతం వీణావాదనంలో నిష్ణాతుడని రామాయణం చెబుతోంది. మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి వీణ వాయిస్తూ ఆత్మచింతనలో నిమగ్నమై బృందావనంలో ప్రవేశించారని ఆయన చరిత్ర వెల్లడిస్తోంది. భాసుడు రాసిన ‘స్వప్న వాసవదత్త’ సంస్కృతంలో ప్రసిద్ధి చెందిన నాటకం. ఇందులో నాయకుడి వీణ అయిన ‘ఘోషావతి’ చుట్టూనే కథంతా నడుస్తుంది.

వీణలోని వివిధ భాగాల్లో వేర్వేరు దేవుళ్లు కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే దీన్ని చాలా పవిత్రమైన వాయిద్యంగా చెబుతారు. వీణా వాదన ధ్వని ప్రసరించినంత మేర ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం, మానసిక ప్రశాంతత లాంటి అనేక లాభాలు చేకూరతాయని చెబుతారు.

అయ్యగారి శ్రీనివాసరావు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని