పంచరత్నాలు

కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసిన సుప్రసిద్ధ వాగ్గేయకారులు ముగ్గురు. వారు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు. వీరిని కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా అభివర్ణిస్తారు. వారిలో త్యాగయ్య రత్నాల వంటి అయిదు కీర్తనలు రచించాడు. ఇవి పంచరత్నాలు లేదా పంచరత్న కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి.

Published : 30 Jun 2024 02:21 IST

కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవ చేసిన సుప్రసిద్ధ వాగ్గేయకారులు ముగ్గురు. వారు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు. వీరిని కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా అభివర్ణిస్తారు. వారిలో త్యాగయ్య రత్నాల వంటి అయిదు కీర్తనలు రచించాడు. ఇవి పంచరత్నాలు లేదా పంచరత్న కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి.

ఈ కీర్తనల్లో ఎన్నో సంగతులు విస్తరించి, ఇమిడ్చి, వివరంగా పొదగడంవల్ల ఇవి విద్వాం సులు పాడటానికి యోగ్యంగా ఉంటాయి. వీటిలో కొన్ని కీర్తనలు సంస్కృత భాషలో, కొన్ని జానుతెలుగులో ఉన్నాయి. యమక, అనుప్రాసాది శబ్దాలంకార మాధుర్యం ఈ కీర్తనల్లో కనిపిస్తుంది. నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీ రాగాల్లో ఆదితాళంలో ఈ కీర్తనల కూర్పు జరిగింది.

వీటిలో మొదటి కీర్తన ఏదనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు పండితులు నాటరాగ ‘జగదానందకారక’ కీర్తన మొదటిదంటారు. మరి కొందరు ఆరభిలోని ‘సాధించెనే ఓ మనసా’ మొదటి కీర్తన అంటారు. ఈ పంచరత్న కీర్తనల రాగాలను ఘనరాగాలుగా చెబుతారు. త్యాగయ్య రచించిన పంచరత్న కీర్తనలే నారద పంచరత్నాలు, తిరువత్తియుర్‌ పంచరత్నాలు, కోవూరు పంచరత్నాలు, నాగపుర పంచరత్నాలు, శ్రీరంగ పంచరత్నాలుగా ప్రసిద్ధి పొందాయి.

మొదటి పంచరత్న కీర్తనగా చెప్పే నాటరాగంలో కూర్చిన ‘జగదానందకారక’ అనే కీర్తన సారంగ దేవుని సంగీత రత్నాకర గ్రంథంలో పేర్కొన్న గొప్ప రాగాల్లో ఒకటి. ఈ కీర్తనలోని భాష సంస్కృతం. ధీరోదాత్తుడైన శ్రీరాముణ్ని అనేక విధాలుగా సంబోధిస్తూ సాగిన సంబోధనాత్మక కీర్తన ఇది. ‘గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక’ ఇలా సాగుతుందీ కీర్తన. రెండో కీర్తన గౌళ రాగంలోని ‘దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో’ అనేది. ‘దుడుకు చేష్టలు’ అన్న పదప్రయోగం, వెంటనే ‘ఏ దొర కొడుకు బ్రోచు’ అనే పదప్రయోగాలు ఆత్మవిమర్శనా జ్ఞానానికి సంబంధించినవి. త్యాగరాజు తన జీవితంలో చేసిన తప్పులన్నింటినీ జాబితా చేసి అలాంటి పాపిని రాముడు తప్ప ఎవరు క్షమించగలరని అడుగుతాడు ఈ కీర్తనలో. అంటే రాముడే అన్ని పాపాలనుంచి రక్షించేవాడని ఆయన భావం.

ఆరభి రాగంలో కూర్చిన ఉల్లాసవంతమైన కీర్తన, ‘సాధించనే ఓ మనసా’ అనేది. ‘సమయానికి తగు మాటలాడెనె’ అనే ఎత్తుగడ పల్లవితో కీర్తన ఉత్సాహభరితంగా సాగుతుంది. నాలుగోది వరాళి రాగంలో సాగిన ‘కన కన రుచిరా కనకవసన నిన్ను’ అనే కీర్తన. ‘కలకలమను ముఖ కళ కలిగిన సీత కులుకుచు నోరకన్నుల జూచే నిన్ను’... ఈ కీర్తన త్యాగరాజు చిరకాలం పూజించే శ్రీరాముడి దివ్య సౌందర్యాన్ని వివరిస్తూ సాగుతుంది. ఈ కీర్తన కచేరీలలో అరుదుగా వినిపిస్తుంది. పంచరత్న కీర్తనల్లో నాలుగింటినే గురువు ముఖతా నేర్పే సంప్రదాయం చాలాచోట్ల ఉంది. మిగిలిన ఒక్క కీర్తన విద్యార్థులు స్వయంకృషితో నేర్చుకోవాలంటారు. ఆ కీర్తన ఇదే.

ఇక చివరిదైన కీర్తన శ్రీ రాగంలో కూర్చిన ‘ఎందరో మహానుభావులు’. ఈ కీర్తనలో పూర్తిగా రాముడి గుణాలు, మహిమల గురించి త్యాగరాజు చెబుతాడు. రామభక్తిలో మునిగి తేలే భక్తుల గుణాలను వివరంగా పది చరణాల్లో వర్ణించాడు.

గంటి ఉషాబాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని