జ్ఞాపకాల మాధుర్యం

మనిషి నిద్ర లేచింది మొదలు చేసే సంకల్పిత, అసంకల్పిత కర్మలు అనుభవాల రూపం సంతరించుకుంటాయి. కొన్ని ఆనందభరితంగా మనసును రంజిల్లజేస్తాయి. కొన్ని మనసును కష్టపెడతాయి. మంచి కార్యక్రమాలు చక్కటి అనుభూతిని ఇస్తాయి. అన్ని అనుభవాలనూ మనసు గుర్తుంచుకోదు. మనసును హత్తుకునే అనుభవాలే సజీవంగా ఉంటాయి.

Published : 01 Jul 2024 01:26 IST

నిషి నిద్ర లేచింది మొదలు చేసే సంకల్పిత, అసంకల్పిత కర్మలు అనుభవాల రూపం సంతరించుకుంటాయి. కొన్ని ఆనందభరితంగా మనసును రంజిల్లజేస్తాయి. కొన్ని మనసును కష్టపెడతాయి. మంచి కార్యక్రమాలు చక్కటి అనుభూతిని ఇస్తాయి. అన్ని అనుభవాలనూ మనసు గుర్తుంచుకోదు. మనసును హత్తుకునే అనుభవాలే సజీవంగా ఉంటాయి. ఆనంద పరిమళంతో నవనాడులను రంజిల్లజేసే జ్ఞాపకాల మాధుర్యం ప్రతివారికీ అనుభవమే. మంచివి గానీ చెడువి గానీ ముఖ్య అనుభవాలు జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. బహుకాలానంతర మిత్రసమాగమం, పెళ్ళిరోజు, జన్మదినం వంటి వేడుకలు జీవితకాలం తీపి జ్ఞాపకాలుగా నిలుస్తాయి.

మనసుపై ముద్ర వేసి నిలిచిపోయే అనుభవాలే జ్ఞాపకాలు. బాల్య క్రీడల్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి గడిపిన తీపి క్షణాలు మాధుర్యపు తునకలుగా వ్యక్తి జీవితంలో భాసిస్తాయి. అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలతో చిన్ననాటి ముచ్చట్ల మాధుర్యపు జల్లుల్ని స్మరించి మురిసిపోతాడు మనిషి. జ్ఞాపకాల మాధుర్యానికి ఆంగ్లభాషలో మనోజ్ఞమైన పేరు- నోస్టాల్జియా! జ్ఞాపకాల గుబాళింపు మంచి అనుభూతులకే కాదు, కష్టాలఅనుభవాలను సైతం మనిషి నెమరు వేసుకుంటాడు. వాటిని తాను అధిగమించిన ఎత్తుపల్లాలుగా భావించి తృప్తిని అనుభవిస్తాడు. కారణం, ఆ ప్రతికూల క్షణాలను దాటి వర్తమానంలో మంచి స్థితిలో ఉండటమే! ప్రతికూల అనుభవాలు వర్తమానంలోనూ కొనసాగితే అవి నవనాడులను కుంగదీసే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

వివాహం వ్యక్తి జీవితంలో ఓ మధురమైన శుభఘడియ. కమనీయ, రమణీయ అనుబంధం అది! యువతీ యువకులు యౌవన ప్రాయంలో కలలు గనే విశేష ప్రాధాన్య ఘట్టం వివాహం! పెళ్ళిరోజును ప్రతివారూ గుర్తుంచుకుంటారు... మురిసిపోతారు... వేడుకలు జరుపుకొంటారు. జంటలు వృద్ధాప్యంలో అడుగు పెట్టినప్పుడు వారి పిల్లలు అమ్మానాన్నల వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంటే అది ఓ విశిష్టమైన వేడుకగా భాసిస్తుంది. భార్యాభర్తల ప్రథమ సమాగమ దినాలు వారికి గుర్తొచ్చినప్పుడల్లా జ్ఞాపకాల పందిరికి అందమైన సుగంధాల మల్లెతీగ అల్లుకుంటుంది. 

ప్రకృతి సిద్ధంగా మనిషి సదా కొత్తదనాన్ని కోరుకుంటాడు. ప్రతిరోజూ సరికొత్త అందాలతో మమేకమై మెరిసిపోయే ప్రకృతితో గడిపే కాలం మనిషికి మధురమైన జ్ఞాపకాలను అందిస్తుంది. ప్రచండ వేసవిలో శీతల ప్రదేశాల సందర్శన మనసుపై ఎన్నాళ్లైనా చెరగని ఆనంద ముద్ర వేస్తుంది. కొండ కోనలు, అరణ్యాలు, సముద్రాల వంటి ప్రకృతి సంపద సానుకూల శక్తిని ప్రసారం చేసి నిత్య నూతన అనుభవాలకు వేదిక అవుతుంది. తీర్థయాత్రా స్థలాలైతే అలౌకిక పారమార్థిక పరిమళాలు విరబూసి భక్తుల ఆనందాన్ని ఇనుమడింపజేస్తాయి. కొన్ని పవిత్ర తీర్థ యాత్రలు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నప్పుడే చేయగలుగుతాం. అటువంటి పవిత్ర ప్రదేశాలు భరతఖండంలో వేలాదిగా ఉన్నాయి. వాటిని సందర్శించిన యాత్రానుభవం కొన ఊపిరి ఉండేదాకా సాధకుల మస్తిష్కంలో జ్ఞాపకాల పందిరి వేస్తుంది. ఆనందంతో నవనాడులను రంజిల్లజేస్తుంది. సూర్యభగవానుడు తూర్పున ఉదయించే ప్రతిరోజూ ఓ నవ శకానికి నాంది! మార్పునకు మూలమైన పగలు రేయి జీవుల ప్రాణాలను పోషించి, నిలుపుతాయి. లయ కార్యమూ నిర్వహిస్తాయి. పగలు సంచరించే జీవులు, రాత్రి చరించే ప్రాణుల ఉనికికి సూర్యోదయ, అస్తమయాలు ఆధారభూతమవుతాయి. ప్రాణదాత అయిన సూర్యభగవానుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనుభవాలు ఇస్తూనే ఉంటాడు. సుందరమైన ఆ అనుభవాలు మానవుల జీవితాల్లో అమృత తుల్యమైన జ్ఞాపకాల మాధుర్యాన్ని పంచుతూనే ఉంటాయి.

గోపాలుని రఘుపతిరావు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని