చిత్రమైన మనసు

భగవంతుడు మనిషిని వాక్కుతో మనసును మేళవించి తయారు చేసినట్లు దర్శన గ్రంథాలు చెబుతాయి. ఈ మనసు త్రికరణాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది చంచలమైంది. ఒకసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Published : 02 Jul 2024 01:50 IST

గవంతుడు మనిషిని వాక్కుతో మనసును మేళవించి తయారు చేసినట్లు దర్శన గ్రంథాలు చెబుతాయి. ఈ మనసు త్రికరణాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇది చంచలమైంది. ఒకసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరొకసారి రాగద్వేషాలకు లోనవుతుంది. ఇంకోసారి అజ్ఞానంలో పడిపోతుంది. ఒకసారి నిరుపేదననే భావాన్ని కలిగిస్తుంది. వేరొకసారి అధికారిననే అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. ఒక్క క్షణం సంతోష సాగరంలో మునకలు వేసే మనసు మరుక్షణం దుఃఖ జలధిలో పడిపోతుంది. కరుణామృతాన్ని వర్షించే మనసు క్రోధాగ్నికి కారణభూతమవుతుంది. దాతగా నిలబెట్టేది అదే మనసు. లోభిగా అపకీర్తిపాలు చేసేది కూడా మనసే.

పూర్వం ఒక వ్యక్తి దారిలో ప్రయాణిస్తూ ఒక చెట్టు దగ్గర ఆగాడు. అతనికక్కడ ఒక డబ్బు మూట కనిపించింది. బహుశా ఎవరో బాటసారులు దాన్ని మరచిపోయారని భావించిన ఆ వ్యక్తి కొంతసేపాగాడు. అంతలో ఆ మూటను పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి రాగా, అతడికా మూటనిచ్చి తన సద్బుద్ధిని ప్రకటించుకున్నాడు. అదే వ్యక్తి తిరుగు ప్రయాణంలో ఒక పూటకూళ్లమ్మ ఇంట్లో భోజనం చేస్తుండగా, అతడి మనసు తాను తింటున్న వెండిపళ్లెం మీదికి పోయింది. ఎవరికీ తెలియకుండా వెండిపళ్లాన్ని తస్కరించి ఇంటిముఖం పట్టాడు. చూశారా! ఒకసారి తప్పు చేయని మనసు మరొకసారి తప్పు చేయడానికి సాహసించింది. కనుకనే మనసు తమ అధీనంలో ఉంచడానికి యోగులు ప్రయత్నిస్తారు. 

మన అన్ని సంకల్పాలకు మూలం మనసే. మనసు చేతనే కలలు కంటాం, కర్తవ్య పారాయణులమవుతాం. జాగ్రదవస్థలో ఈ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కాని నిద్రావస్థలో దాని ఆచూకీ ఉండదు. అది మనల్ని అన్నివేళలా అంటిపెట్టుకొనే ఉంటుంది. జాగ్రదవస్థలో మనం చేసే పనులకు ఆధారమైన మనసు నిద్రావస్థలో సేదతీరుతుంది. మనిషి ప్రశాంతతకు, విచారానికి కారణభూతమైన మనసు నిద్రావస్థలో పనిలేకుండా ఉండటం చిత్రమే. ఈశ్వరుడి సన్నిధానం వల్ల జీవాత్మ అనిర్వచనీయమైన ఆనందానుభూతికి లోనుకావడం వల్ల నిద్రావస్థలో మనసు పనిలేకుండా ఉండిపోతుందని యోగసాధకుల మాట.

ఇలాంటి మనసును నిగ్రహించుకోవడానికి యోగశాస్త్రం ఎన్నో సూచనలను తెలియజేసింది. శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచ విషయాల పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఆయా విషయాల్లో మనసు ప్రవర్తించకుండా మన శరీరంలో నాభి, భృకుటి, హృదయం మొదలైన స్థలాల్లో మాత్రమే నిలపాలి. ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానం మనకవసరమో, ఆ జ్ఞానంలోనే మనసును లగ్నంచేయాలి. ఎన్నుకున్న వస్తువు తప్ప, ఇతర వస్తువులు జ్ఞానం మనసులోకి రాకుండా చూసుకోవాలి. క్రమంగా మనసును ఒక విషయం మీదనే ఏకాగ్రం చేయాలి. అలా సాధన చేయడం వల్ల ధ్యానం సిద్ధిస్తుంది. 

భగవంతుణ్ని వెదకడానికి ఉపయోగపడేది ధ్యానం. మనసు మన వశంలో ఉన్నప్పుడే ధ్యానం పరిపక్వమవుతుంది. ధ్యానసిద్ధి పొందినప్పుడే భగవంతుడు మన అనుభవంలోకి వస్తాడు. అప్పుడు మనసు ప్రమేయం ఉండదు. నిద్రలో లేనట్లే, ఆత్మానుభవంలో మనసు లేనిదవుతుంది. ఆత్మను, పరమాత్మనూ తెలుసుకోవడంలో ఒక సాధనంగా ఉన్న మనసు పరమాత్మతో కలిసి ఆనందాన్ని పంచుకున్నప్పుడు తన ఉనికిని కోల్పోవడమే చిత్రం!

ఆచార్య మసన చెన్నప్ప 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని