ఆసాంతం సందేశం

ఆ... తెలుగు వర్ణమాలలోని రెండో అక్షరం. నిత్యజీవితంలో నియంత్రించవలసిన మూడు మాటలతో అది గొప్ప సందేశాన్ని అందిస్తుంది. అవే- ఆరాటం, ఆందోళన, ఆవేశం. వ్యాసుడి కుమారుడైన శుకమహర్షికి ఆచరణతో జనకమహారాజు వాటిని ఉపదేశించాడని యోగవాసిష్ఠం వివరించింది.

Published : 03 Jul 2024 01:26 IST

ఆ... తెలుగు వర్ణమాలలోని రెండో అక్షరం. నిత్యజీవితంలో నియంత్రించవలసిన మూడు మాటలతో అది గొప్ప సందేశాన్ని అందిస్తుంది. అవే- ఆరాటం, ఆందోళన, ఆవేశం. వ్యాసుడి కుమారుడైన శుకమహర్షికి ఆచరణతో జనకమహారాజు వాటిని ఉపదేశించాడని యోగవాసిష్ఠం వివరించింది. తనకు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించమని శుకుడు  తండ్రి వేదవ్యాసుణ్ని కోరతాడు. జనకుడు గొప్ప జ్ఞాని. ఆయన దగ్గర నేర్చుకోవడం మంచిదని వ్యాసుడు కుమారుణ్ని పంపుతాడు. జనకుడి దర్శనం కోసం శుకుడు ఒక వారం నిలుచునే ఎదురు చూస్తాడు. రెండో వారం సౌకర్యాలు లేని వసతిలో ఉంటూ గడుపుతాడు. మూడో వారం రాజభోగాలను అనుభవిస్తూ రాజమందిరంలో ఎదురు చూస్తాడు. చివరకు జనకుడు వచ్చి- ‘ఇంతకన్నా జ్ఞానోపదేశం వేరే లేదు. పరిపూర్ణ జ్ఞానం సిద్ధించాలంటే వేచి ఉండే సహనం, అవసరమైతే కష్టనష్టాలను భరించడం, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరడం... కీలకం. విజయానికి, పరాజయానికి ఉండే అడ్డుగోడలు మూడు. అవి ఆరాటం, ఆందోళన, ఆవేశం’ అనే సందేశాన్ని అందించాడు.

మనిషి నిత్యజీవితం పరుగులమయం. ఉరుకులు, పరుగులతో రోజంతా తెలియకుండా గడిచిపోతుంది. చాలామంది అసలు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు అంటారు. తెల్లవారి లేస్తూనే మొదలయ్యే ఒత్తిడి రాత్రి పడుకున్నా వదలదు. మనిషి తప్ప ఇతర ప్రాణులన్నీ నిద్ర లేవగానే రెక్కలు ఆడించి, జూలు విదిలించి, మెడ సాగదీసి, అవయవాలు స్వాధీనం చేసుకుని తమ నిత్యకృత్యాలు ప్రారంభిస్తాయి. మనిషి మాత్రం పడకమీది నుంచి దూకి రోజును పరుగుతో మొదలుపెడతాడు. గుండె అనర్థాలకు అదీ ఒక కారణంగా వైద్యులు చెబుతారు.

మనిషి జీవితం ఆసాంతం ఆరాటాలతో పోరాటంగా సాగుతోంది. ప్రతిదానికీ తొందర, అనుకున్న వెంటనే ఏదైనా జరగాలి. వచ్చే ఆలోచనలు, వాటి అమలు,  దానికి తన అర్హత గురించి పట్టించుకోరు. ఎంతసేపూ విఫలం చెందాననే ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆందోళన ఆవేశానికి దారి తీస్తుంది. పూర్తి అవగాహన, సరైన ప్రణాళిక, సవ్యమైన ఆచరణ ఉంటే విజయం సాధ్యం. అందుకే ఆచి తూచి అడుగులు వేయాలి. శారీరక మానసిక ఆందోళనలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సమాజపరమైన ఆందోళనలు శాంతికి భంగం కలిగిస్తాయి. ఎటువంటి నిర్ణయమైనా ప్రశాంత వాతావరణంలో అందరితో చర్చించి తీసుకోవాలి. సమగ్రమైన, సముచితమైన నిర్ణయాలు మంచి ఫలితాలు సాధిస్తాయి.

ఆరాటపడి, ఆవేశం చెంది, ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా సాగించే ప్రయత్నం ఫలించడం తథ్యం. జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలంటే మనల్ని మనం ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడుకోవాలి. ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటే ‘ఆ’నందమనే మరో ‘ఆ’ చివరి వరకు మన వెన్నంటి ఉంటుంది!

రావులపాటి వెంకట రామారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని