మంచిని పంచే గుణం

కొంతమంది సత్పురుషులు సమాజంలో ఉన్న మంచిని మాత్రమే దర్శించడం అలవరచుకుంటారు. హంస పాలనుంచి నీటిని వేరుచేసినట్లు మనుషుల్లో ఉన్న చెడును పరిహరించడం వారికి చిటికెలో పని. కాలానుగుణంగా ఆధునిక జీవనం గడుపుతున్న మహర్షులు వాళ్లు. ఏ పూర్వ పుణ్యమో ఆ మహనీయుల పరిచయ భాగ్యం.

Published : 05 Jul 2024 01:21 IST

కొంతమంది సత్పురుషులు సమాజంలో ఉన్న మంచిని మాత్రమే దర్శించడం అలవరచుకుంటారు. హంస పాలనుంచి నీటిని వేరుచేసినట్లు మనుషుల్లో ఉన్న చెడును పరిహరించడం వారికి చిటికెలో పని. కాలానుగుణంగా ఆధునిక జీవనం గడుపుతున్న మహర్షులు వాళ్లు. ఏ పూర్వ పుణ్యమో ఆ మహనీయుల పరిచయ భాగ్యం. దైవం మానవ రూపంలో జన్మిస్తాడని పెద్దలు చెబుతారు. అందుకు సాక్ష్యం- అటువంటి మహానుభావులు. అందరిలో మంచిని దర్శించడమే కాకుండా ప్రతి ప్రాణికీ తాము చేయగలిగిన మంచిని ఆచరించి చూపి మానవాళికి ఆదర్శంగా నిలుస్తారు.

సృష్టి నిర్మాణం గురించి తెలియజేస్తూ పౌరాణికులు ఈ జగత్తు సర్వం మాయామోహాలతో నిండి ఉందని చెబుతారు. సాధారణ మనుషులు బలహీన మనస్కులు కావడం వల్ల సత్యాన్ని తెలుసుకోలేరు. ధనానికి వశులవుతారు. దురలవాట్లకు లోనవుతారు. అలాంటి సమయంలో ఆదర్శప్రాయ వ్యక్తిత్వం కలిగిన మహాపురుషులు తెరపైకి వస్తారు. వారిని సరిదిద్దేందుకు ఉపన్యాసాలు ఇవ్వరు. ఆచరణ ద్వారా మాత్రమే సమాజానికి ఆదర్శమవుతారు.

వేదాలు మొదలుకొని సకల శాస్త్రాలు మనిషిని సన్మార్గవర్తిని చేయడానికే ప్రాధాన్యమిచ్చాయి. శత్రువు పట్లా దయను ప్రదర్శించమని చెప్పడమే కాకుండా ఆచరించి చూపిన మహనీయ మహీతలం భారతావని. మంచితనం శాఖలుగా ప్రపంచమంతా విస్తరించాలని, మానవీయతా లతలు ప్రజల హృదయాల్లో అల్లుకోవాలని అందరూ అభిలషిస్తారు. చిన్నారుల మనస్తత్వానికి దగ్గరగా ఉండటం ఆ స్వప్నాన్ని సాక్షాత్కరింపజేస్తుంది. కల్మషమెరుగని బాల్యంలో అందరినీ మంచివారిగానే భావిస్తాం. అపరిచితులు బుగ్గ గిల్లినా అందంగా నవ్వి సంతోషాన్ని పంచిపెడతాం. ఎవరెవరో అపకారం చేస్తారన్న అనవసర భయాలు ఉండవు. అందరినీ సమానంగానే చూస్తాం. నిర్మలమైన అలాంటి మనసు భగవంతుడికి నెలవవుతుంది.

పరోపకారమే పరమావధిగా ఈ సృష్టి జీవం పోసుకుంది. పంచభూతాలు వివిధ రూపాల్లో ప్రాణికోటి హితానికి కారణమవుతున్నాయి. మంచిని పంచడమే ప్రకృతి సహజ గుణం. అదీ నిశ్శబ్దంగానే జరుగుతుంది. అనేక పరిశ్రమల వ్యర్థాల కారణంగా గంగాజలం కలుషితమవుతోంది. అయినప్పటికీ పావన గంగ మనిషిపై అలక పూనడం లేదు. ఆవిరిగా గగనానికి ఎగసి అమృతతుల్యమైన మంచినీరుగా భూమిని చేరుతోంది. ఇతరులు చెడు చేస్తున్నప్పటికీ మంచిని పంచే ఈ గుణం కటిక అమావాస్యలో కాంతి కిరణం లాంటిది. మానవజాతిని ముందుకు నడిపేది అత్యంత అరుదుగా ఈ గుణం కలిగిన మహనీయులే.

మానవ జన్మ ప్రేమను పంచడంతో పునీతమవుతుంది. అందుకు సర్వత్రా సత్‌- మంచిని మాత్రమే దర్శించాలి. పదవీ అధికారాలను పక్కన పెడితే ప్రాథమికంగా మనందరం మనుషులం. ఎంతోమందికి సహాయ సహకారాలను అందించడానికి జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. ఆహార పాత్రలో మిగిలిపోయే నాలుగు మెతుకులు సైతం అల్ప ప్రాణులకు ప్రాణాధారమవుతాయి. సంతోషం జనించడానికి ఆ కారణం సరిపోతుంది కదా! ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను పెంచుకుంటూ వెళితే... మంచిని పంచుకుంటూ వెళితే అందరూ కోరుకునేది అదే- భగవంతుడితో సహా.

గోలి రామచంద్రరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని