మనశ్శాంతికి మార్గం!

మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఆహారం, ఆహార్యం, నిద్రించే సమయం, శారీరక శ్రమలలో వినూత్నమైన మార్పులు ఏర్పడుతున్నాయి. కాలంతో పోటీపడుతూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం.

Published : 06 Jul 2024 01:06 IST

మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఆహారం, ఆహార్యం, నిద్రించే సమయం, శారీరక శ్రమలలో వినూత్నమైన మార్పులు ఏర్పడుతున్నాయి. కాలంతో పోటీపడుతూ ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం. నేడు మానసిక ఒత్తిడి లేని మనిషి అంటూ లేడంటున్నారు మనోతత్వ నిపుణులు. ధనం కంటే విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవరూ అమ్మలేరు. ఎవరూ కొనలేరు.

మనిషి మానసిక జీవనానికి అత్యంత ప్రధానమైనది మనశ్శాంతే. అది మనస్సాక్షికి దిక్సూచి వంటిది. విజయానికి ఇంధనం వంటిది. నమ్మిన విలువలకు కట్టుబడి ఉన్నప్పుడు, జీవితం సమతుల్యతతో సాగినప్పుడు  నిజమైన మనశ్శాంతికి నిర్వచనం అవగతమవుతుంది.

మనశ్శాంతి మనిషికున్న సహజ లక్షణం. అది అదృష్టం వల్ల వచ్చేది కాదు. దురదృష్టం వల్ల కోల్పోయేది కాదు. అది మానసిక ప్రశాంతతకు మూల కేంద్రం. దాన్ని కాపాడుకోవడం తెలిస్తే అడ్డుపడే క్లేశాలు వాటంతటవే తొలగిపోతాయి. వాటి స్థానంలో స్థితప్రజ్ఞ చిగుళ్లేస్తుంది. పాపకృత్యాలు చేయకుండా సత్కార్యాలు చేయడం వల్ల మనసు ఎప్పటికప్పుడు ప్రక్షాళనమవుతుంది. మనశ్శాంతికి దగ్గర చేస్తుంది అన్నాడు బుద్ధుడు.

మనిషి అరిషడ్వర్గాలకు దూరంగా ఉన్నప్పుడే ప్రశాంతతకు దగ్గరగా ఉండగలడు. ప్రతికూల భావాలు ఉన్నప్పుడు సహజంగానే మనశ్శాంతి మన వద్ద ఉండదు. వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం, ఉంచడం మనశ్శాంతి కోసం చేసే సాధనలో కీలకమైన ప్రక్రియ. ముందుగా మనలోని అశాంతికి కారణమేమిటో తెలుసుకోవాలి.

మనిషి తనకు తానే మానసిక ఒత్తిడికి కారణమవుతున్నానని తెలుసుకోవాలి. నేడు మనశ్శాంతి లేదంటూ ఎంతోమంది యువత దారి తప్పుతున్నారు. దాన్ని వెతుక్కుంటూ వేటి వేటి వెనకో పరుగులు తీస్తూ ఉన్న ప్రశాంతతను కోల్పోతున్నారు. శరీరానికి మరణం ఒక్కసారే వస్తుంది. కానీ, మనశ్శాంతిని కోల్పోయినవారికి అది అనుక్షణం వెన్నంటే ఉంటుంది. మనిషి ఎప్పుడూ వర్తమానంలో  నిలబడే గతాన్ని, భవిష్యత్తును సందర్శిస్తూ వర్తమానాన్ని కోల్పోతుంటాడు. వాస్తవానికి మనిషి ఉండేది ఎల్లప్పుడూ వర్తమానంలోనే అన్నారు రమణ మహర్షి.

కాబట్టి గతం గురించి చింత, భవిష్యత్తు గురించి బెంగ వదిలేసి- అనుక్షణం వర్తమానంలో జీవించాలి. గడచిన క్షణం మృత సమానం. రానున్న క్షణం కళ్లు తెరవని పసికందు. రెండూ నీవి కావు. ఈ క్షణం మాత్రమే నీది. వర్తమానంలో జీవించే వ్యక్తి అరిషడ్వర్గాలకు అతీతంగా మనశ్శాంతితో అలౌకిక ఆనందంలో జీవిస్తాడు.

 ఎం.వెంకటేశ్వరరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని