పూరీ రథయాత్ర

పురాణాలలో ‘పురుషోత్తమక్షేత్రం’ అని వ్యవహరించే ‘పూరీ’ మహాక్షేత్రం అనేక ప్రత్యేకతలకు ఆలవాలం. ఆలయం, మూర్తుల రథయాత్ర... అన్నీ విశేషాలే. ప్రతి ప్రసిద్ధాలయంలో రథోత్సవాలు జరుగుతాయి. పూరీ క్షేత్రంలోని రథయాత్ర మాత్రం ప్రత్యేకం. ఏ ఏడాదికా ఏడాది దారువులతో (కర్రతో) రథాలను తయారు చేస్తారు.

Published : 07 Jul 2024 00:47 IST

పురాణాలలో ‘పురుషోత్తమక్షేత్రం’ అని వ్యవహరించే ‘పూరీ’ మహాక్షేత్రం అనేక ప్రత్యేకతలకు ఆలవాలం. ఆలయం, మూర్తుల రథయాత్ర... అన్నీ విశేషాలే. ప్రతి ప్రసిద్ధాలయంలో రథోత్సవాలు జరుగుతాయి. పూరీ క్షేత్రంలోని రథయాత్ర మాత్రం ప్రత్యేకం. ఏ ఏడాదికా ఏడాది దారువులతో (కర్రతో) రథాలను తయారు చేస్తారు. ఆలయంలోని ప్రధాన మూలవిరాట్టులే కదలివచ్చి రథాలను అధిరోహిస్తారు.

మూడు రథాలలో ఒక్కొక్కరథం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇందులో జగన్నాథుడు కొలువుతీరిన రథం అన్నిటికంటే ఎత్తయినది. సుమారు 44 అడుగులు. అంతకంటే కొంచెం చిన్నది బలభద్రుడి రథం, 43 అడుగులు. సుభద్రామాత రథం 42 అడుగులు. వెడల్పులో కూడా జగన్నాథ రథం కంటే మిగిలినవి ఒకదానికంటే ఒకటి చిన్నవి. వీటికి వేసే రంగు వస్త్రాలూ వైవిధ్య భరితమే. రథాల పీఠాలు, స్తంభాలు, పూన్చిన చెక్క గుర్రాలు, పరివార దేవతలు ఆశ్చర్యకర పద్ధతులలో ఉంటాయి. అవి విభిన్న దేవతాశక్తులను మంత్రాలతో, ఉపచారాలతో ఆవహింపజేసి, ఆరాధిస్తారు కనుక విశిష్ట దివ్యమహిమలతో ఉంటాయంటారు.

జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం. అతడి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర. వారు ఆయనతో కలిసి ఒకే పీఠంపై పూజలందుకొనే క్షేత్రమిది. ఇలా సోదరీ సోదరులున్న క్షేత్రం ఇది ఒక్కటే. అయితే అనేక పురాణాలలో ఈ మూర్తుల వైశిష్ట్యాన్ని వివిధ కోణాల్లో వర్ణించారు. ఇంద్రద్యుమ్నుడనే చక్రవర్తి నారాయణుడి అనుగ్రహంతో, ఆజ్ఞతో- నారదుడి  పర్యవేక్షణలో గొప్ప క్రతువును నిర్వహించగా- సాక్షాన్నారాయణుడే దారువుగా (గొప్ప కర్రదుంగగా) సముద్ర జలాలలో నుంచి తేలివచ్చాడని పురాణగాథ. ఆ కర్రను బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ మూర్తులుగా మలచాడు. అవి విభిన్న వర్ణాలతో అలంకృతమై- తెల్లని వన్నె బలభద్రుడు, పసుపురంగు సుభద్ర, నల్లనివర్ణంతో జగన్నాథుడుగా రూపుదాల్చి, స్తంభంపై చక్రాకృతిలో సుదర్శనదేవుడు ఏర్పడ్డాడని కథనం. జగన్నాథుడి చెంతనే సుదర్శన దేవుడు- మందిరంలోను, రథంలోను ఉంటాడు. ఈ నాలుగు మూర్తులు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేద స్వరూపాలని పురాణ వర్ణన. యజ్ఞానంతరం యజ్ఞశాలలోనే ఈ మూర్తుల్ని మలచారని, అనంతరం రాజు నిర్మించిన భవ్య మందిరంలో ఏకపీఠంపై బ్రహ్మ సమంత్రకంగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ప్రతి ఏడాది ఒకసారి తిరిగి మందిరం నుంచి యజ్ఞస్థలానికి వచ్చి, పది రోజులు అక్కడ పూజలందుకొని తిరిగి  ప్రధానాలయానికి చేరుకుంటారు. అదే రథయాత్ర! ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియనాడు ఆలయం నుంచి, ప్రధాన రాచమార్గం (బొడొ దండొ)పై మహావైభవంగా మూడు రథాలలో బయలుదేరి- ప్రాచీన యజ్ఞవాటికా భవనానికి విచ్చేసే ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధిచెంది లక్షలాది ప్రజలు ప్రత్యక్షంగా, కోట్ల మంది పరోక్షంగా పరవశించే రీతిలో జరుగుతుంది. ఆ యజ్ఞవాటిక పేరే ‘గుండిచా’ మందిరం. మళ్ళీ ఆషాడ శుద్ధ ఏకాదశికి ప్రధాన మందిరానికి తిరుగు రథయాత్ర. జగన్నాథ మందిరమున్నచోటు ‘నీలాచల’మని ప్రసిద్ధి. స్వామిని ‘నీలమాధవుడ’నీ అంటారు. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్ర, మందిరాలకు అపారమైన చారిత్రక నేపథ్యం ఉంది. ఒడిశా జీవనరీతిలో, కళలలో, సంస్కృతిలో జగన్నాథుడు అవిభాజ్యమైన తత్త్వం. ‘మహాదధి’ అని పిలిచే సముద్రతీరంలో, ఎన్నో పుణ్యతీర్థాలు, దేవతామందిరాలున్నచోట ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. జగన్నాథుని రథం పేరు ‘నందిఘోష’, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్రాదేవి రథం ‘దర్పదళన’. వరసగా ఈ రథాలు గరుడధ్వజం, లాంగల (నాగలి) ధ్వజం, పద్మధ్వజాలతో భాసిల్లుతుంటాయి.

సామవేదం షణ్ముఖశర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని