అన్నమహిమ

అసంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు.

Published : 08 Jul 2024 01:33 IST

సంఖ్యాక ప్రాణికోటికి ఆహారం ‘అన్నం’. జఠరాగ్ని మండిపోతున్నప్పుడు ఆకలివేస్తుంది. ఆకలిని చల్లార్చడానికి అన్నం కావాలి. భోజన పదార్థాలన్నీ అన్నాలే. అన్నాన్ని తింటేనే ఆకలి చల్లారుతుంది. ఆత్మారాముడు సంతోషిస్తాడు. అందుకే ఆకలి వేసినప్పుడు వంద పనులున్నా సరే, వాటిని పక్కనపెట్టి ముందు భోజనం చేయాలని ‘శతం విహాయ భోక్తవ్యమ్‌’ అనే ప్రాచీనసూక్తి చెబుతోంది. అన్నంలో నుంచి సకల ప్రాణులూ పుట్టాయని, అన్నం తినడం వల్లనే బతికి బట్టకడుతున్నాయని, చివరికి అన్నంలోనే లయమవుతున్నాయని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. అన్నాన్ని నిందించకూడదని, తూలనాడకూడదని వేదం చెబుతోంది. అన్నాన్ని పుష్కలం చేసేందుకు కృషి చేయాలని, అలా చేయడాన్ని నియమంగా పెట్టుకోవాలని చెప్పింది. అన్నాన్ని వ్యర్థంగా పారవేయరాదని, అన్నార్తుల ఆకలి తీర్చడానికి అన్నాన్ని రక్షించాలని సూచించింది. అన్నాన్ని సృష్టించడానికి యజ్ఞం చేయాలని, యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయని, వర్షజలాలతో పంటలు పండుతాయని, పంటల వల్ల అన్నం లభిస్తుందని, అన్నం నుంచే సకల ప్రాణులూ ఉద్భవిస్తాయనీ భగవద్గీత పలికింది.

దేవతలకు అమృతమే ఆహారం. అందుకే వారికి ‘అమృతాంధసులు’ అని పేరు వారు మానవుల్లాగా అన్నం తినరు. కనుక వారికి అన్నంతో పని లేదు. కానీ మానవులు అన్నగత ప్రాణులు అంటే అన్నం లేనిదే బతకలేరు. అందుకే మానవులకు అన్నంతో నిత్య సంబంధం ఉంటుంది. పూర్వకాలంలో తీర్థక్షేత్రాలను సందర్శించే యాత్రికుల కోసం అన్నసత్రాలుండేవి. రాజులు, ధనవంతులూ ఈ అన్నసత్రాలను కట్టించి ఉచితంగా అన్నం పెట్టేవారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పదని పెద్దల మాట. నేడూ అలాంటి అన్నదాన సత్రాలు పుణ్యక్షేత్రాలలో ఉన్నాయి. అన్నార్తుని ఆకలి తీర్చడం కంటే మించిన ధర్మం ఏదీ లేదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అన్నాన్ని బ్రహ్మదేవుడు సృష్టించిన పూజ్యపదార్థంగా భావించడం వల్లనే భోజనం చేసే సమయంలో అన్నదేవతలను స్తుతించే అన్నసూక్తాలు వేదంలో కనబడతాయి. నేటికీ భోజన సమయంలో అన్నాన్ని స్వీకరించే సమయంలో భోజన పదార్థాలకు ఒక్కసారి నమస్కరించి భుజించేవాళ్లెందరో ఉన్నారు. అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ భోజనం చేసేవాళ్లు కనిపిస్తారు. ఇదొక పవిత్ర సంస్కృతి. భోజన పదార్థాలు పవిత్రంగా, స్వచ్ఛంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. కర్షకులు ఎంతో కష్టపడి పండించిన పంటల వల్ల లభించే భోజనం ఎంతో విలువైంది. ‘ఈ ప్రపంచంలోని భోజ్య సంపద అంతా పరమేశ్వరుడు ప్రసాదించిన అమూల్యవరం. దాన్ని కడుపునిండేంత వరకే భుజించాలి. మిగిలిన దానిని ఇతరుల ఆకలి తీర్చడానికి వదిలివేయాలి’ అని ఈశావాస్యోపనిషత్తు ప్రబోధించింది.

‘నా దేశంలో ఒక్కపూట అయినా భోజనానికి నోచుకోని అన్నార్తులుండగా, నేను రెండు పూటలు భోజనం చేయడం నేరం అవుతుంది కనుక నేను ఒక పూట భోజనం మానేసి, అన్నార్తుల కడుపు నింపుతాను’ అనే మహానీయులు ప్రభవించిన పుణ్యభూమి ఇది! వారి స్ఫూర్తిని తోటి మానవులు పుణికి పుచ్చుకోవాలి. అన్నార్తుల కడుపు నింపాలి. ఇదే కదా మానవత్వం! ‘అన్నమో రామచంద్ర!’ అనే దుస్థితిని దూరం చేయడానికి ప్రతి మనిషీ పూనుకోవాలి. ఈ ప్రపంచంలోని సంపద కేవలం కొందరి సొత్తు కాదు. అందరూ సమిష్టిగా అనుభవించవలసిందనే ఇంగితజ్ఞానం అందరిలో ఉదయించాలి. అన్నార్తులు లేని భూమండలాన్ని సృష్టించాలి. అప్పుడే మనిషి జన్మ సార్థకమవుతుంది!

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని