వెలుగు నుంచి చీకటికి...

కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు.

Published : 09 Jul 2024 01:55 IST

ష్టసుఖాలు, సుఖదుఃఖాలు, చీకటివెలుగులన్నవి పడుగుపేకలు. అవి జీవితంలో సర్వసాధారణమని మాటవరసకు అంటాం కాని కష్టానికి, నష్టానికి, బాధకు వెరవని వారుండరు. మనిషి తాను జన్మించింది కేవలం ఆనందించడానికి, మధురానుభూతులు పొందడానికి అనుకోవడంతోనే వస్తుంది చిక్కంతా. 

వ్రతాల ఫలశ్రుతి, పెద్దలు అందించే ఆశీర్వచనం మనిషికి సుఖమయ జీవితాన్ని ఉద్దేశించినవై ఉంటాయి. ఆఖరికి చనిపోయిన తరవాతా స్వర్గలోక సౌఖ్యం పొందడం కోసం ఈ లోకంలో నానావిధ తాపత్రయాలు పడటం ఒక్క మనిషికే చెల్లింది.

సృష్టిలోని సమస్త జంతుజాలం ప్రకృతి పరంగా ఏది సంప్రాప్తించినా యథావిధిగా తీసుకుంటాయి తప్ప సుఖాల కోసం అర్రులుచాచవు. కష్టాలనుంచి తప్పుకొనే ప్రణాళికలు రచించవు. ఆలోచనల్లో పరిణతి సాధించిన మానవుడు కష్టాన్ని సవాలుగా తీసుకొని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవాలిగాని, అసలు సమస్యే రాకూడదనుకోవడం సరికాదు. 

స్థితప్రజ్ఞ అనేది పెద్ద వయసులో సాధనతో సాధించవలసిన మనో స్థిరత్వం కాదు. బాల్యావస్థలోనే మనసులో నాటుకోవలసిన విత్తనం. ఆ దిశగా ప్రయత్నం సాగాలి. తల్లిదండ్రులైనా, గురువులైనా పసితనంలో హృదయానికి హత్తుకునేట్టుగా విషయం విడమరచి చెప్పాలి. అప్పుడే ఆటల్లో గెలిచినా, ఓడినా ఒకే రకమైన మనస్తత్వంతో ప్రశాంతంగా ఉంటారు. భావోద్వేగాలకు చెదిరిపోరు.

చాలామంది సామాన్యులు చిన్న సమస్యకు సైతం చిగురుటాకులా వణుకుతూ, ఆనందానికి పొంగిపోతూ జీవనం సాగిస్తారు. కష్టాలు దరిచేరకుండా ఉండ టానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. 

కొంతమంది స్వభావసిద్ధంగా స్థిరచిత్తంతో ఉంటారు. మరికొంతమంది తగిన సాధనతో ఆ స్థితిని పొందుతారు. వారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చలించరు. జంకరు. అంతటి మనోపరిపక్వత సాధించినప్పుడే మానవజీవితానికి అర్థం. 

రేపటి రోజున జరగాల్సిన పట్టాభిషేకం అర్థాంతరంగా ఆగిపోయి అడవులవైపు సాగాల్సి వచ్చినప్పుడు చెక్కుచెదరని మనోస్థెర్యంతో ముందడుగేసిన రాముడి కన్నా ఆదర్శప్రాయుడెవ్వరు? మానవ జీవితంలోని సుఖదుఃఖాలకు అర్థం వెదుకుతూ సమస్త సౌకర్యాలతో అలరారే రాజభవనాన్ని విడిచి రాత్రికి రాత్రి జ్ఞానోదయం కోసం బయలుదేరిన గౌతముడి మనో స్థిరత్వం సాటిలేనిది. ఉత్తమ చదువులు చదివి దేశ స్వాతంత్య్ర సముపార్జన కోసం అన్నీ విడిచిపెట్టి కొల్లాయి కట్టి అతి సాధారణ జీవితం గడుపుతూ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జనాలందరిని ఒక తాటిపైకి తెచ్చి అనుకున్నది సాధించిన మహాత్ముడు నిత్య మాననీయుడే కదా! వీళ్లందరు సుఖాలను విడిచి పదుగురికి మంచి చేయాలన్న తపనతో కష్టాలను కోరి ఆశ్రయించారు. వెలుగు నుంచి చీకటివైపు సాగారు. వెలుగై నిలిచారు. చిన్న చిన్న వ్యక్తిగత సమస్యలను భూతద్దంలో చూసి భయపడిపోతూ జీవితాలను అంతం చేసుకోవాలనుకునేవారు ఏమి చేయాలి? సమర్థ నాయకులు సంఘం, దేశం కోసం సుఖమయ జీవితాలను వదిలి ఎన్ని సమస్యలను మనస్ఫూర్తిగా ఆహ్వానించారో, ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ల ముందున్న సమస్య ఎంతటి అల్పమైందో తెలిసివస్తుంది. అరుదైన వరంగా పొందిన జీవితం విలువ గ్రహించే తెలివొస్తుంది. సుఖం కన్నా కష్టం మనిషిని రాటుదేలుస్తుందన్న విషయం పరిపూర్ణంగా అవగతమవుతుంది. 

ప్రతాప వెంకట సుబ్బారాయుడు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని