అదృష్టం - దురదృష్టం

మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం.

Published : 11 Jul 2024 01:44 IST

మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటుంటాం. దృష్టమంటే కంటికి కనిపించేది. దురదృష్టం దానికి వ్యతిరేకమైనది. కనబడనిది మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టమనుకుంటాం. అనుకోకుండా ఆపదలు కలిగితే అనర్థాలు ఎదురైతే దాన్ని దురదృష్టమని భావిస్తాం. లోకంలో చాలామంది తాము దురదృష్టవంతులం అనుకుంటారు. తమకన్నా మంచి స్థితిలో ఉన్నవారిని చూసి వారు అదృష్టవంతులని ఈర్ష్య చెందుతారు. తమకు లభించినవాటిని గుర్తించి తృప్తి చెందకుండా తమకు అందుబాటులో లేనివాటి గురించి వెంపర్లాడుతూ అవి లభ్యం కాకపోయేసరికి తమ దురదృష్టాన్ని నిందించుకుంటారు.

ప్రయత్నశీలురైనవారిని జయలక్ష్మి వరిస్తుంది. అంతా దైవమే ఇస్తుందని ఏమీ చేయకుండా ఉండటం కాపురుష లక్షణం. ఆత్మశక్తితో పౌరుషంతో మానవ ధర్మాన్ని ఆచరించాలి. ప్రయత్నం చేసినా ఫలం దక్కకపోతే అక్కడ మన దోషం ఏమీ ఉండదు. దైవం అనే మాటకు అదృష్టమని కూడా అర్థం చెబుతారు పండితులు. ఉత్సాహం, క్రియాశీలత లేనివారు దాన్ని అడ్డం పెట్టుకుని ఏమీ సాధించలేకపోతున్నామని వాపోతుంటారు. దైవం అనుకూలంగా ఉంటే దానంతట అదే ఏ పనైనా జరుగుతుందని కుతర్కాలు చేయడం వ్యర్థం. అది మందబుద్ధుల పని అని వినాశమార్గం అని వసిష్ఠులవారు శ్రీరామచంద్రుడికి బోధించినట్లుగా యోగవాసిష్ఠం పేర్కొంటోంది.

మానవ ప్రయత్నం తరవాత అదృష్టాన్ని అంటే దైవాన్ని నమ్ముకోవాలి. దేవుడి దృష్టిలో అందరూ సమానులే. ఒకరు ఇష్టుడు మరొకరు అయిష్టులంటూ ఉండరు. భగవంతుడు జీవులతో వ్యవహరించే తీరు, అవసరాలను సమకూర్చే విధానం విభిన్నంగా ఉంటుంది. ఎవరి అవసరాలు వారివి. తల్లికి బిడ్డలందరిపై ఒక్కలాగే ప్రేమ ఉన్నా- వారి అవసరాలు తీర్చేటప్పుడు అందరికీ ఒక్కలాగే ఇవ్వలేదు. వారి శరీర పరిస్థితి, ప్రవృత్తి, అలవాట్లు, అవసరాలు గమనించి ఎప్పుడు ఎవరికి ఏది ఎంతవరకూ ఇవ్వాలో అదే ఇస్తుంది. భగవంతుడి విధానమూ అదే. సృష్టినంతటినీ భగవంతుడు ఒకే రీతిలో ప్రేమించినా సృష్టిలోని జీవులతో వ్యవహరించే తీరు ప్రత్యేకం. నాటకంలో ఏ పాత్ర పరిధి, ప్రత్యేకత ఆ పాత్రది. అలాగే జీవిత రంగస్థలం మీద ఎవరి పాత్రా వ్యర్థం కాదు. చీమ, ఏనుగు, ఆవు, మనిషి- ఇలా జీవుల్లో ఎవరి శక్తులు వారివి. ఎవరి పని వారిది. తన ప్రకృతి, శక్తి స్వభావాలకు అనుగుణంగా కార్యాలు చేయడం, సర్వశక్తులు వినియోగించి చిత్తశుద్ధితో పనిచేయడం మంచి జీవన విధానం. ఎదురైన ప్రతి అనర్థానికీ భయపడి దురదృష్టం అని పేరు పెట్టి దేవుడినో, గ్రహాలనో దూషించడం మనిషికి పరిపాటి అయిపోయింది. ఎదుటివాడు శ్రమించి సాధించిన విజయాన్ని అదృష్టంగా కొట్టిపారేయడం అజ్ఞానం. మన జీవితంలోని అనుభవాలు, సంఘటనలు అన్నీ భగవంతుడి నిర్దేశాలే. మంచి జరిగినప్పుడు దేవుడున్నాడని భావించడం, ప్రతికూలంగా ఉన్నప్పుడు దైవాన్ని నిందించడం తగదు. భగవంతుడి పట్ల విశ్వాసంతో మనుగడ సాగిస్తూ ఆయన అనుగ్రహం అనుభవించాలి. అది మంచి అయినా, చెడైనా స్వీకరించాలి. అప్పుడు జీవితంలో ఏదైనా అదృష్టమే. ఆత్మశుద్ధి లేకుండా భగవంతుణ్ని పూజిస్తూ, స్వప్రయత్నాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవుణ్నో, గ్రహాలనో నమ్ముకొనేవాడు దురదృష్టవంతుడు.

డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని