Updated : 11/11/2021 05:22 IST

House arrests: చిత్తూరులో తెదేపా నేతల గృహ నిర్బంధం

పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట.. పలువురి అరెస్టు

చిత్తూరులో నాని నివాసం వద్ద డీఎస్పీ సుధాకర్‌రెడ్డితో మాట్లాడుతున్న నాని, రామానాయుడు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, కుప్పం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లాలో బుధవారం తెదేపా నాయకులు, పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం తోపులాటకు దారితీసి చివరకు గృహనిర్బంధం వరకు వెళ్లింది. తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నానిని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకు కుప్పం నుంచి చిత్తూరులోని అతని ఇంటికి తీసుకొచ్చారు. బయటకు రాకుండా ఉదయాన్నే పోలీసులు భారీగా మోహరించారు. నాని నివాసంలో అప్పటికే విలేకరుల సమావేశం పూర్తిచేసుకొని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, నాని, ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు ‘ప్రజాపరిరక్షణ యాత్ర’ పేరిట కుప్పం వెళ్లేందుకు బయల్దేరారు. వారు ఇంటి నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగాయి. మహిళా కార్యకర్తల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కించారు. దీంతో నాయకులు నాని నివాసంలోకి వెళ్లిపోయారు. వివాదం పెద్దదవుతుండటంతో డీఎస్పీ సుధాకర్‌రెడ్డి వారితో చర్చించారు.

నిర్బంధాన్ని ఛేదించుకుని ప్రచారం

మాజీ మంత్రి అమరనాథరెడ్డి, దొరబాబు, పులివర్తి నానిని మంగళవారం రాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు తెల్లవారుజామున వారి స్వస్థలాలకు చేర్చారు. పలమనేరులో స్వగృహానికి చేరిన అమరనాథరెడ్డి వేకువజామునే స్వెట్టర్‌, తలపాగా చుట్టుకొని బయటకు వచ్చారు. ఇంటి వెనుక గోడ దూకగా చేతికి గాయమైంది. అక్కడే పాఠశాలలోకి వెళ్లి కారు తెప్పించుకున్నారు. రహస్యంగా బయల్దేరి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా కుప్పంలోని తెదేపా కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి 16వ వార్డులో ప్రచారం చేశారు.

తెదేపా కార్యకర్తల్ని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు

అర్ధరాత్రి తరలింపు

మంగళవారం అర్ధరాత్రి దాటాక కుప్పం నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం ఇంట్లో ఉన్న రామానాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 6 గంటలకే తాను స్టేషన్‌కు వస్తానని, అప్పటికీ రాకుంటే అరెస్టు చేయాలని ఆయన కోరారు. పోలీసులు ససేమిరా అనడంతో అర్ధరాత్రి 1.40 గంటలకు ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి పోలీసుల కారు ఎక్కారు. కుప్పం అర్బన్‌ స్టేషన్‌లో కొంతసేపు ఉంచిన తర్వాత చిత్తూరులోని నాని ఇంటికి తరలించారు.

28 మంది ఎమ్మెల్యేలు తిష్ఠ వేశారు: రామానాయుడు

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. చిత్తూరులో నాని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వందల వాహనాలతో కుప్పంలో కలియదిరుగుతూ ప్రజల్ని బెదిరిస్తున్నారు. దాదాపు 28 మంది వైకాపా ఎమ్మెల్యేలు కుప్పంలోనే ఉన్నారు. వారిని తక్షణం అక్కడి నుంచి పంపించాలి. లేదంటే ప్రజాపరిరక్షణ యాత్ర పేరుతో తెదేపా నాయకులు, కార్యకర్తలతో కుప్పం బయలుదేరుతామ’ని ప్రకటించారు.


మేం ఉగ్రవాదులమా?
అమరనాథరెడ్డి

తమను నిర్బంధించి, అర్ధరాత్రి కుప్పం నుంచి తరలించాల్సిన అవసరమేంటని మాజీ మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. కుప్పం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాత్రి మమ్మల్ని కర్ణాటక ప్రాంతంలో తిప్పి తెల్లవారుజామున ఇళ్లకు చేర్చి గృహనిర్బంధంలో ఉంచారు. ఉగ్రవాదులకు కాపలా కాసినట్లుగా వందల మంది మా ఇళ్ల చుట్టూ మోహరించారు. కుప్పంతో నాకూ, నానీకి సంబంధం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వైకాపా స్థానికేతరులు ప్రచారం చేయొచ్చు కాని, మేం చేయకూడదా? సొంత జిల్లా నాయకులు కూడా కుప్పం వెళ్లొద్దంటున్న పోలీసుల ఏకపక్ష ధోరణి తగద’ని హెచ్చరించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని