Mamata Banerjee: భవానీపుర్‌ మమతదే

ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సత్తా చాటుకున్నారు. ఆదివారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో భవానీపుర్‌ నియోజకవర్గం నుంచి ఆమె తన

Updated : 04 Oct 2021 09:23 IST

భవానీపుర్‌లో పశ్చిమ బెంగాల్‌ సీఎం సరికొత్త రికార్డు

మొత్తం మూడుచోట్లా తృణమూల్‌ విజయభేరి

కోల్‌కతా: ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సత్తా చాటుకున్నారు. ఆదివారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో భవానీపుర్‌ నియోజకవర్గం నుంచి ఆమె తన సమీప ప్రత్యర్థి ప్రియాంక టిబ్రెవాల్‌ (భాజపా)పై రికార్డు స్థాయిలో 58,835 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. బెంగాల్‌లోని సంసేర్‌గంజ్‌ (ఆధిక్యం: 26,379 ఓట్లు), జంగీపుర్‌ (ఆధిక్యం: 92,480 ఓట్లు) నియోజకవర్గాల్లోనూ తృణమూల్‌ అభ్యర్థులే విజయం సాధించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన పార్టీని విజయతీరానికి చేర్చగలిగిన మమత.. నందిగ్రామ్‌లో మాత్రం చతికిలపడిన విషయం తెలిసిందే. ఉప సమరంలో భవానీపుర్‌ బరిలో దిగిన ఆమె విజయంపై రాజకీయ వర్గాలు మొదటి నుంచీ ధీమాగానే ఉన్నాయి. అందుకే గెలుపుపై కంటే ఆధిక్యంపైనే అవి అంచనాలు వేశాయి.

కంచుకోట.. రికార్డు మోత..

కోల్‌కతా నడిబొడ్డున ఉన్న భవానీపుర్‌లో ఇంతవరకు ఏ అభ్యర్థీ సాధించని ఆధిక్యాన్ని మమత నమోదు చేయడంతో తృణమూల్‌ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మమతకు 85,263 ఓట్లు రాగా, టిబ్రెవాల్‌కు 26,428 ఓట్లు లభించాయి. ఏప్రిల్‌-మే మధ్య జరిగిన ఎన్నికల్లో భవానీపుర్‌ నుంచి తృణమూల్‌ అభ్యర్థి సోవన్‌దేవ్‌ ఛటోపాధ్యాయ 28 వేల ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. ఈసారి అది రెట్టింపునకు పైగా పెరిగింది. ఈ నియోజకవర్గం 2011 నుంచి తృణమూల్‌కి కంచుకోట. మమత సొంత ఇల్లు ఇక్కడే ఉంది. మరోవైపు.. భాజపా నుంచి ఇంకో నలుగురు శాసనసభ్యులు తృణమూల్‌లోకి వెళ్లబోతున్నారనే సమాచారం కమలనాథులను కలవరపెడుతోంది. మరోవైపు, మమత ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని ప్రచారం మొదలైంది.

కుట్రను తిప్పికొట్టారు: మమత

భవానీపుర్‌ ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు. ‘నందిగ్రామ్‌లో ఓడించినట్లే ఇక్కడా చేయాలని కుట్ర పన్నినవారికి ప్రజలు ధీటుగా సమాధానమిచ్చారు’ అని వ్యాఖ్యానించారు.

ఒడిశాలోని పిపిలిలో బిజద విజయం

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని పూరీ జిల్లా పిపిలి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ (బిజద) అభ్యర్థి రుద్రప్రతాప్‌ మహారథి 20,916 ఓట్ల తేడాతో భాజపాపై విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ధరావతు కోల్పోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని