Navjot Singh Sidhu: సిద్ధూ రిటైర్డ్‌హర్ట్

వరుస సంక్షోభాలతో కుదేలవుతున్న పంజాబ్‌ కాంగ్రెస్‌లో మరో ముసలం పుట్టింది! దాదాపు రెండు నెలల క్రితమే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ

Updated : 29 Sep 2021 09:06 IST

పంజాబ్‌ కాంగ్రెస్‌లో మరో సంక్షోభం
పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా
పగ్గాలు చేపట్టిన 2 నెలలకే..
భాజపాలోకి అమరీందర్‌ సింగ్‌?

చండీగఢ్‌, దిల్లీ: వరుస సంక్షోభాలతో కుదేలవుతున్న పంజాబ్‌ కాంగ్రెస్‌లో మరో ముసలం పుట్టింది! దాదాపు రెండు నెలల క్రితమే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్‌, సీనియర్‌ నేత నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ తన పదవికి మంగళవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. మరికొన్ని నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం.. పార్టీని కొత్త సంక్షోభంలోకి నెట్టినట్లయింది. రాజీనామాకు కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ తన కేబినెట్‌లోని సభ్యులకు మంత్రిత్వ శాఖలు కేటాయించిన కొద్దిసేపటికే పీసీసీ అధ్యక్షుడు పదవి నుంచి వైదొలగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

రాజీనామా నిర్ణయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సిద్ధూ లేఖ రాశారు. ‘‘ఒక మనిషి వ్యక్తిత్వ పతనం అనేది రాజీపడటం నుంచే మొదలవుతుంది. పంజాబ్‌ భవిష్యత్తుపై, రాష్ట్ర సంక్షేమ ఎజెండాపై నేను ఎప్పటికీ రాజీ పడలేను. అందుకే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. పార్టీలో మాత్రం కొనసాగుతా’’ అని అందులో పేర్కొన్నారు. ఈ ఏడాది జులైలోనే ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టిన సంగతి గమనార్హం. సిద్ధూ రాజీనామా గురించి తనకు తెలియదని సీఎం చన్నీ అన్నారు. డిప్యూటీ సీఎం రంధావాకు హోంశాఖ కేటాయించడంతోపాటు ఇతర నియామకాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారా అన్న ప్రశ్నకు.. ‘‘మేం సిద్ధూ సాబ్‌తో కూర్చొని మాట్లాడతాం. ఆయన మా అధ్యక్షుడు. మంచి నేత’’ అని చన్నీ బదులిచ్చారు.

హోంమంత్రిగా రంధావా

నూతన మంత్రివర్గంలోని సభ్యులకు పంజాబ్‌ సీఎం చన్నీ మంగళవారం శాఖలు కేటాయించారు. హోంశాఖ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌సింగ్‌ రంధావాకు అప్పగించారు. మరో డిప్యూటీ సీఎం ఒ.పి.సోనీకి ఆరోగ్య శాఖను కేటాయించారు.

సంఘీభావంగా మంత్రి రాజీనామా

సిద్ధూకు సంఘీభావం ప్రకటిస్తూ పంజాబ్‌ మంత్రి రజియా సుల్తానా తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి యోగేంద్ర ధింగ్రా, కోశాధికారి గుల్జార్‌ ఇందర్‌సింగ్‌ చహల్‌ కూడా సిద్ధూకు మద్దతుగా రాజీనామా చేశారు. మరోవైపు, సిద్ధూ రాజీనామా ఓ నాటకమని పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ స్పందించారు.


భాజపాలో చేరనున్న అమరీందర్‌?

పంజాబ్‌ సీఎం పదవి నుంచి తప్పుకొన్న అమరీందర్‌ భాజపాలో చేరనున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఆయన దిల్లీ పర్యటనకు వెళ్లడంతో అవి మరింత జోరందుకున్నాయి. పలువురు భాజపా అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నారంటూ మీడియాలో వార్తలొస్తున్నాయి. అమరీందర్‌ వాటిని తోసిపుచ్చారు. తనది వ్యక్తిగత పర్యటనగా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డాలతో భేటీ అయ్యేందుకే అమరీందర్‌ దిల్లీ వెళ్లారని కమలదళం రాజ్యసభ ఎంపీ శ్వేత్‌ మాలిక్‌ విలేకర్ల సమావేశంలో చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని