Rahul Gandhi: చనిపోతానని నానమ్మకు తెలుసు

తాను హత్యకు గురవుతానన్న విషయం మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి  ముందే తెలుసని కాంగ్రెస్‌ అగ్రనేత, ఆమె మనవడు రాహుల్‌ గాంధీ చెప్పారు. తనకేమైనా జరిగితే ఏడవొద్దని...

Updated : 01 Nov 2021 16:18 IST

హత్య జరిగిన రోజు ఉదయమే చెప్పారు
ఏడవొద్దని కూడా అన్నారు
ఇందిర వర్ధంతి సందర్భంగా విడుదల చేసిన వీడియోలో రాహుల్‌ గాంధీ

ఇందిరకు నివాళులు అర్పిస్తున్న రాహుల్‌

దిల్లీ: తాను హత్యకు గురవుతానన్న విషయం మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి  ముందే తెలుసని కాంగ్రెస్‌ అగ్రనేత, ఆమె మనవడు రాహుల్‌ గాంధీ చెప్పారు. తనకేమైనా జరిగితే ఏడవొద్దని మరణానికి కొన్ని గంటల ముందే ఆమె తనతో చెప్పారని పేర్కొన్నారు. నానమ్మ మరణం.. తన జీవితంలో రెండో అత్యంత దురదృష్టకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ 37వ వర్ధంతి సందర్భంగా రాహుల్‌ ఆదివారం యూట్యూబ్‌లో వీడియో విడుదల చేశారు. అందులో.. ఇందిర హత్య, అంత్యక్రియల సందర్భంగా తాను ఎదుర్కొన్న మనోవేదనను వివరించారు. నానమ్మ తనకు అమ్మ తర్వాత అమ్మ అని గద్గద స్వరంతో తెలిపారు. ‘‘తనకేమైనా జరిగితే ఏడవొద్దని హత్య జరిగిన రోజు ఉదయమే నానమ్మ నాకు చెప్పారు. ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. రెండు మూడు గంటల తర్వాత ఆమె హత్యకు గురయ్యారు. బహుశా..హత్యకు గురవుతానని ఆమెకు తెలుసేమో. ఇంట్లో వాళ్లకూ ఆ భయం ఉంది. జబ్బు పడి చనిపోతే అంత కంటే పెద్ద శాపం ఉండదని ఓసారి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర అందరికి చెప్పారు. దేశం కోసం, తన భావాల కోసం మరణించడమే ఉత్తమ మార్గమని ఆమె అనుకున్నారేమో’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కూడా ఇందిరాగాంధీని తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. నానమ్మకు తనను హత్య చేస్తారన్న విషయం తెలుసునని, అయినా ఏనాడూ ఆమె వెనక్కి తగ్గలేదని అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని