Updated : 31/10/2021 09:35 IST

PM Modi: ప్రపంచానికి 500 కోట్ల టీకా డోసులు

2022 చివరి నాటికి సరఫరా చేస్తాం
జి-20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ హామీ

రోమ్‌: కొవిడ్‌ మహమ్మారితో ఇబ్బంది పడుతున్న అంతర్జాతీయ సమాజానికి 2022 చివరినాటికి తమ వంతుగా 500 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేయడానికి సిద్ధమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు హామీ ఇచ్చారు. ఆ స్థాయిలో టీకాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని పేర్కొన్నారు. శనివారం ఆరంభమైన జి-20 శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఔషధాలను సరఫరా చేసి ప్రపంచంలో 150కి పైగా దేశాలను ఆదుకున్నామని మోదీ తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా సభ్యదేశాల దృష్టికి తీసుకువస్తూ.. వీటిని సులభతరం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. టీకా ధ్రువీకరణను పరస్పరం గుర్తించే యంత్రాంగాన్ని ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు. కొవాగ్జిన్‌ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చడం కోసం చేసుకున్న దరఖాస్తు.. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వద్ద పెండింగులో ఉన్న నేపథ్యంలో ఆయన ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇటీవల భారత్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించారు. సదస్సును ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ప్రారంభించారు. వ్యాక్సిన్‌ కొరతతో ఇబ్బంది పడుతున్న పేద దేశాలను ధనిక దేశాలు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అత్యంత పేద దేశాల్లో 3% మాత్రమే టీకా వేయించుకున్నారని, ధనిక దేశాల్లో అది 70% ఉందని పేర్కొన్నారు. ఈ అంతరం నైతికంగా ఆమోదయోగ్యం కాదన్నారు. బహుళజాతి సంస్థలపై కనీస పన్ను విధించాలన్న విషయంలో సభ్యదేశాల మధ్య తొలిరోజు సదస్సులో అంగీకారం కుదిరింది. చాలా సాంకేతిక దిగ్గజ సంస్థలు తాము లావాదేవీలు నిర్వహిస్తున్న దేశాల్లో పన్ను చెల్లించడం లేదు. కొత్తపన్ను అమల్లోకి వస్తే చాలా దేశాలకు లబ్ధి చేకూరనుంది.

ఉల్లాసంగా పలకరింపులు  
జి-20 సదస్సు ప్రారంభానికి ముందు దేశాధినేతలు గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ సందర్భంగా మోదీ.. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తో మాట్లాడుతూ కనిపించారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోదీ ముచ్చటిస్తున్న ఫొటోలను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఇందులో మోదీ భుజంపై ఆప్యాయంగా చేయివేసి నవ్వుతూ బైడెన్‌ కనిపించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌ను మోదీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. కొవిడ్‌ మహమ్మారి ఆరంభమైన తర్వాత జి-20 దేశాధినేతలు ముఖాముఖి కలుసుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు, వాతావరణ మార్పులపై ప్రభుత్వ నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకారులు సదస్సు వేదిక సమీపంలో ప్రదర్శన నిర్వహించారు.

జీ-20 సదస్సు వేదిక వద్ద  ప్రపంచ దేశాల ఏతలు. చిత్రంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయెల్‌ మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ తదితరులు
 


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని