Updated : 15/11/2021 05:18 IST

Amithsha: మాదక ద్రవ్యాలను కట్టడి చేయండి

పోక్సో నేరాలను ఉపేక్షించొద్దు

రాష్ట్రానికో ఫోరెన్సిక్‌ కళాశాల తప్పనిసరి

ముఖ్యమంత్రులకు అమిత్‌ షా సూచన

ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాధార చట్టాల సవరణ ప్రక్రియ ప్రారంభం

భవిష్యత్‌ సమావేశాల్లో సొంత భాషలో మాట్లాడే అవకాశం

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి భేటీ

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో
లక్షద్వీప్‌ పరిపాలనాధికారి ప్రఫుల్‌ పటేల్‌, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, ఏపీ సీఎం జగన్‌, కర్ణాటక సీఎం
బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌గవర్నర్‌ తమిళిసై, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌
గవర్నరు జోషి తదితరులు

ఈనాడు - అమరావతి, ఈనాడు డిజిటల్‌ - తిరుపతి: మాదక ద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని, యువతను నిర్వీర్యం చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆందోళన వ్యక్తం చేశారు. వీటి వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రులు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేయాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని చెప్పారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, ఆ నేరాలను ఏ మాత్రమూ ఉపేక్షించొద్దని నిర్దేశించారు. తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో ఆదివారం జరిగిన 29వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌) సమావేశంలో అమిత్‌షా అధ్యక్షోపన్యాసం చేశారు. ‘ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ సవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలివ్వాలి. ఆ ప్రక్రియలో అధికారులు, నిపుణుల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి. విచారణలు వేగవంతం చేసేందుకు వీలుగా రాష్ట్రాలు ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌’ అనే స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ప్రధాని మోదీ చొరవతో ఇప్పటికే జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాయని అమిత్‌షా చెప్పారు. ప్రతి రాష్ట్రం కనీసం ఒక్క ఫోరెన్సిక్‌ సైన్స్‌ కళాశాలనైనా ఏర్పాటు చేయాలని, వాటిలో సిలబస్‌ స్థానిక భాషలో ఉండాలని సూచించారు. తద్వారా ఫోరెన్సిక్‌ దర్యాప్తు అవసరాలు తీర్చేందుకు వీలుగా సిబ్బందికి శిక్షణ ఇవ్వటం సాధ్యపడుతుందన్నారు.

దేశాన్ని సుసంపన్నం చేసిన దక్షిణాది

దక్షిణ భారత రాష్ట్రాల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు దేశాన్ని సుసంపన్నం చేశాయని అమిత్‌ షా కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా దేశాభివృద్ధిని ఊహించలేమన్నారు. ‘గత ఏడేళ్లలో 18 జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించాం. కౌన్సిల్స్‌ అందించే సలహాలతో అనేక సమస్యలను విజయవంతంగా పరిష్కరించాం. ఈ సమావేశాల వల్ల సభ్యుల మధ్య అత్యున్నత స్థాయిలో పరస్పర చర్చలకు అవకాశం ఏర్పడుతుంది. ఇకపై వివిధ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను కేంద్రం గౌరవిస్తుంది. అందుకే ఈ సమావేశం వివరాలను ఆయా రాష్ట్రాల భాషల్లోకి అనువదించేలా కౌన్సిల్‌ ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో ప్రతినిధులు సొంత భాషలో మాట్లాడే అవకాశం ఉండాలన్నది కేంద్రం ఆకాంక్ష.

నవంబరు 15న జన్‌ జాతీయ గౌరవ్‌ దివస్‌

స్వాతంత్య్ర ఉద్యమం, దేశాభివృద్ధిలో గిరిజన తెగల పాత్రను గుర్తు చేసుకుంటూ ఏటా నవంబరు 15న ‘జన్‌ జాతీయ గౌరవ్‌ దివస్‌’గా పాటించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి.

కొవిడ్‌ నియంత్రణతో సత్తా చాటాం

* కొవిడ్‌ మహమ్మారిని నియంత్రించే స్థాయి భారతదేశానికి లేదని అంతా భావించారు. అయితే.. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలతో పాటు దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని వేగవంతం చేసింది. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ అమలుకు చర్యలు తీసుకుంది. ఫలితంగా దేశం ఈ రోజు కొవిడ్‌ భయాందోళనల నుంచి బయటపడింది.

* దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించటానికి సహకార, పోటీ సమాఖ్యవాదం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో చెప్పారు. కరోనా నియంత్రణకు 111 కోట్ల డోసుల టీకాలు వేయడం సమాఖ్యవాద విజయానికి ఉదాహరణ’ అని అమిత్‌షా వివరించారు. సబ్‌డివిజన్‌, అంతకంటే కింది స్థాయిలో రెండో డోసు టీకాల ప్రక్రియను వేగవంతం చేయాలని.. ముఖ్యమంత్రులు, అధికారులు దీని పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. 

40 అంశాలను పరిష్కరించాం

‘జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాలకు సంబంధించి మొత్తం 51 పెండింగ్‌ అంశాలకు గాను ఈ భేటీ సందర్భంగా 40 పరిష్కరించాం’ అని అమిత్‌షా సమావేశం అనంతరం ట్వీట్‌ చేశారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని