Updated : 25/11/2021 09:24 IST

Annamayya Reservoir: గూడు కూలి.. గోడు

అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి, ముంచెత్తిన వరద

పులపుత్తూరు, తోగూరుపేటల్లో కొట్టుకుపోయిన 80 శాతం ఇళ్లు 

ఎవరిని కదిలించినా కన్నీటి కథలే

కడప జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ‘ఈనాడు’ క్షేత్ర పరిశీలన

కడప జిల్లా పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

తోగూరుపేటలో ఇల్లు కొట్టుకుపోయి.. ఇసుకదిబ్బల్లో కనిపిస్తున్న శిథిలాలు

నిన్నటి వరకు ఆ ఇళ్లన్నీ పిల్లాపాపలతోనూ, ఆ ఊళ్లన్నీ జనాలతోనూ కళకళలాడాయి. వారం క్రితం కురిసిన భారీ వర్షాలు ఆ గ్రామాలను కన్నీటి సంద్రంలో ముంచెత్తాయి. కడప జిల్లా రాజంపేట మండలం బాదనగడ్డపై నిర్మించిన అన్నమయ్య జలాశయం మట్టికట్ట (ఎర్త్‌బండ్‌) వరద ఉద్ధృతికి తెగిపోవటంతో.. చెయ్యేరు నది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో ఒడ్డునున్న పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాలను వరద ముంచెత్తింది. ఇళ్లన్నింటినీ కూలదోసుకుంటూ.. ఉవ్వెత్తున ప్రవహించిన జలరాశి ఆ రెండూళ్లను శిథిలాల దిబ్బగా మార్చేసింది. ‘ఈనాడు ప్రతినిధి’ బుధవారం ఆ రెండు గ్రామాలను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించగా.. ఇప్పుడు అక్కడ ఎవరిని కదిలించినా కన్నీటి కథలే. పైసా పైసా పోగేసి కట్టుకున్న ఇళ్లు క్షణాల్లో నేలమట్టమై నిలువనీడ కరవైన అభాగ్యుల గాథలే. 

 తోగూరపేటలో వరద విధ్వంసానికి నిదర్శనం ఈ ట్రాక్టర్‌

నిలువనీడా కరవైంది

ఈ రెండు గ్రామాల్లో 80 శాతం మందికి ఇప్పుడు నిలువనీడైనా లేకుండా పోయింది. ఇంట్లోని సామగ్రి, బంగారం, డబ్బులు, దుస్తులు అన్నీ కొట్టుకుపోయి, బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వరద రాకముందు వారి ఇళ్లున్న స్థలాల్ని చూసుకుంటూ పగలూరాత్రీ అక్కడే నడిరోడ్డుపైనే ఉంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల వద్ద పెట్టే, దాతలు అందించే ఆహారంతో కాలం నెట్టుకొస్తున్నారు. కొందరు చిన్న చిన్న టార్పాలిన్లు వేసుకుని వాటి కింద తలదాచుకుంటున్నారు. వరద ముంచెత్తి బుధవారం నాటికి అయిదు రోజులు గడిచిపోయినా ఇప్పటికీ ఈ గ్రామాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదు. చీకట్లోనే మగ్గిపోతున్నామని పులపుత్తూరుకు చెందిన ఉమామహేశ్వరరాజు ఆవేదనగా చెప్పారు.

తర్వాత ఎక్కడుండాలి?

పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాల్లో అనేక మంది అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. అవి తీరకముందే కట్టుకున్న ఇళ్లు వరద ధాటికి కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలామని కన్నీటిపర్యంతమవుతున్నారు. కొందరికైతే వారి బంధువులు, స్నేహితులు దుస్తులు తెచ్చిచ్చేవరకూ మార్చుకోవడానికి మారుబట్టలు కూడా లేవు.

పిల్లలు తాగేందుకైనా పాలు లేవు

పులపుత్తూరు ఎస్సీ కాలనీలో చిన్నారులకు అయిదు రోజులుగా పాలు లేవు. పాలు అని అడిగినప్పుడు తినటానికి ఏదైనా ఇచ్చి బాబును బుజ్జగిస్తున్నామని పులపుత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన ఒంటిమిట్ట భారతి వాపోయారు. వరద ప్రభావిత గ్రామాల్లో ఇలాంటి పిల్లలు అనేక మంది ఉన్నారు.

టార్పాలిన్ల కింద తలదాచుకుంటున్న కుటుంబాలు


సగం ఊరు సమాధి

ఈ ఇసుక దిబ్బల కింద సగం ఊరు ఉందని చూపిస్తున్న శివయ్య

అంతెత్తున పోగుపడిన ఇసుక మేటలపై నిల్చున్న ఈయన పేరు వెంకటశివయ్య. ఆయన చుట్టూ కనిపిస్తున్న ఇసుక దిబ్బల కింద నిన్నమొన్నటి వరకూ ఊరుండేది. చిత్రంలో కనిపిస్తున్న ఇంటిని ఆనుకుని పదుల ఇళ్లు ఉండేవి. ఈ నెల 19 వేకువజామున నిమిషాల వ్యవధిలో గ్రామాన్ని వరద ముంచెత్తటంతో అక్కడున్న ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. వరద తగ్గాక ఇళ్ల స్థానంలో ఇలా ఇసుక మేటలు కనిపించాయి. రాజంపేట మండలం తోగూరుపేట గ్రామంలో పరిస్థితి ఇది. ఈ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉండగా వాటిలో అక్కడక్కడ కొన్ని మాత్రమే మిగిలాయి.  


ఆ ఊరు ఇప్పుడో శిథిలాల దిబ్బ

శిథిలాల దిబ్బగా మారిపోయిన పులపుత్తూరు ఎస్సీ కాలనీ

కనుచూపు మేరలో భవన శిథిలాలు.. అంతటా ఇసుక, మట్టి, రాళ్లూరప్పలతో కనిపిస్తున్న ఈ ప్రదేశంలో నిన్నమొన్నటి వరకూ వందల ఇళ్లతో ఒక ఊరే ఉండేది. ఈ నెల 18వ తేదీ రాత్రి వరకూ కళకళలాడిన ఆ గ్రామం..  19వ తేదీ ఉదయం 6 గంటలకల్లా కనుమరుగైపోయింది. ఉప్పెనలా ఆ గ్రామాన్ని చుట్టుముట్టిన వరద ఇళ్లు-వాకిళ్లూ అన్నింటినీ ముంచెత్తింది. ఆ ఉద్ధృతికి సగానికి పైగా ఇళ్లు కొట్టుకుపోగా.. మరో సగానికి పైగా ఇళ్లు నేలమట్టమై జలసమాధి అయిపోయాయి. ఆ ఉరిలో 80 శాతం ఇప్పుడు శిథిలాల దిబ్బగా కనిపిస్తోంది. ఇది రాజంపేట మండలం పరిధిలోని పులపుత్తూరు పరిస్థితి. ఇక్కడ నదిని ఆనుకుని ఉన్న ఎస్సీ వీధిలో 130కి పైగా ఇళ్లున్నాయి. వాటిలో ఒకటీ అరా మినహా మిగతావన్నీ నదిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడా వీధిలో శిథిలాలే మిగిలాయి. ఇదే గ్రామంలోని రాజులవీధిదీ ఇదే పరిస్థితే. రెడ్లవీధిలోనూ 50 శాతం ఇళ్లు కొట్టుకుపోయాయి.


అప్పయినా తీరలేదు.. అప్పుడే వీధినపడ్డాం

నేను రూ.2 లక్షలు అప్పు తెచ్చి కిందటేడాదే ఇల్లు కట్టాను. ఆ అప్పు తీరకముందే వరదకు ఇల్లు కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో మిగిలా. ఇప్పుడు ఎక్కడ ఉండాలో కూడా తెలియట్లేదు.

- పులపుత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన ఒంటిమిట్ట చిన్నక్క ఆవేదన


అది తలచుకుంటేనే భయమేస్తోంది

‘నా ఇల్లు మొత్తం కొట్టుకుపోయింది. ప్రాణాలు తప్ప ఏమీ మిగల్లేదు. ఇప్పుడు మళ్లీ ఇల్లు కట్టుకోవటం సాధ్యం కాని పని. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలనేది తలచుకుంటేనే భయమేస్తోంది’ అని భోరుమంటున్నారు తోగూరుపేటకు చెందిన ఈ జొన్నా నారాయణరావు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని