Updated : 02/12/2021 05:31 IST

AP News: ఏపీకి సహకరిస్తాం

రెవెన్యూ లోటు భర్తీకి యత్నం
పోలవరం ఎత్తుపై మరోసారి అధ్యయనం చేస్తే మేలు
నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌
సీఎం జగన్‌తో భేటీ

ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు తమ వంతు సహకారం అందిస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. విభజనతో హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోయినందున ఆదాయం తగ్గిందన్న విషయం తమకు తెలుసని, రెవెన్యూ లోటు పూడ్చేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే.. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో మార్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రెండురోజుల పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్‌ బృందం ప్రతినిధులు.. తొలిరోజు బుధవారం రాత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి కె.రాజేశ్వరరావు, ఇతర సభ్యులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, జెన్‌కో, డిస్కమ్‌లకు ఆర్థిక సహాయం సహా పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను అధికారులు నీతి ఆయోగ్‌ బృందానికి వివరించారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నాయి
‘రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయం. గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు, రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ ప్రక్రియలు, దిశ యాప్‌ తదితరాలు బాగున్నాయి. కొవిడ్‌తో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసే విధానంతో పాటు దిశ యాప్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచిస్తాం. సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో చేస్తోంది’ అని వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ అభినందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం కోరగా.. ఇందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని బదులిచ్చారు. రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి కేంద్రంతో పరస్పర సహకారంతో మెలగాలని, సమాఖ్య స్ఫూర్తి కొనసాగేలా కృషిచేస్తామని చెప్పారు. తీరప్రాంతంలో ఆర్థిక, పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయాలని, పర్యాటక రంగం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని సూచించారు.  

అధికారులు ఏం వివరించారంటే..
తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్తు బకాయిలు ఇప్పించాలని అధికారులు నీతి ఆయోగ్‌ బృందాన్ని కోరారు. రీసోర్స్‌ గ్యాప్‌ కింద కాగ్‌ నిర్ధారించిన మేరకు రూ.18,969 కోట్ల నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.
- ఆర్బీకేల ద్వారా సేంద్రియ పంటల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని, రైతులకు మంచి ఆదాయం వస్తుందని రాజీవ్‌కుమార్‌ సూచించగా.. ఇప్పటికే దీనిపై దృష్టి పెట్టామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, అమ్మఒడి పథకాల అమలు తీరును వివరించారు.
- అంగన్‌వాడీలతో పాటు పాఠశాలలను ఆరు అంచెలుగా విభజించామని, సబ్జెక్టుల వారీగా బోధన, పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించడాన్ని సీఎం స్వయంగా వివరించారు. ఆసరా, చేయూత ఉద్దేశాలను, సుస్థిర ఆర్థిక ప్రగతికి అమలు చేస్తున్న ఉపాధి కార్యక్రమాలను జగన్‌ ప్రస్తావించారు.

ప్రకృతి సేద్యానికి కేంద్రం ప్రాధాన్యం
గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకృతి సేద్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, రైతులు దీన్ని అందిపుచ్చుకోవాలని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌ సూచించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ గ్రామాన్ని ‘సేంద్రియ వ్యవసాయానికి తీర్థయాత్ర క్షేత్రం’గా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామన్నారు. యువరైతు బత్తుల సతీష్‌రెడ్డి సేంద్రియ సేద్యం పద్ధతులను చూసి అభినందించారు. దేవిరెడ్డి ముత్తారెడ్డి మామిడి తోటలను పరిశీలించారు. గ్రామ, వార్డు సచివాలయాలను, ఆర్బీకేలను పరిశీలించారు. పొదుపు సంఘాల రైతులతో మాట్లాడి, మిద్దె, పెరటి తోటల పెంపకం చేపట్టిన మహిళలను ప్రశంసించారు.

పారిశ్రామిక వర్గాలతో భేటీ
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని వినియోగించుకొని పరిశ్రమలు అభివృద్ధి చెందాలని రాజీవ్‌కుమార్‌ సూచించారు. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి 13 రంగాల్లో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలు, సంఘాల ప్రతినిధులతో సాయంత్రం నీతిఆయోగ్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడం, నిబంధనలు సరళీకరించడం ద్వారా సులభతర వాణిజ్యం అమలులో ముందున్నామని అధికారులు వివరించారు. ఈ బృందంలో నీతిఆయోగ్‌ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్వరరావు, సలహాదారులు నీలం పటేల్‌, అవినాశ్‌ మిశ్ర, సీహెచ్‌పీ.సారథిరెడ్డి, సుజిత్‌జైన్‌, మన్‌ప్రీత్‌కౌర్‌ ఉన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని