AP News: పేదలకు సదవకాశం

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్‌) పూర్తిగా స్వచ్ఛందమేనని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. దీని ద్వారా పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని,..

Updated : 09 Dec 2021 05:51 IST

వాడుకుంటారో లేదో వారిష్టం

ఓటీఎస్‌పై సీఎం జగన్‌ వ్యాఖ్యలు

ప్రజలపై రూ.10వేల కోట్ల భారం తొలగిస్తున్నామని వెల్లడి

ఈనాడు, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్‌) పూర్తిగా స్వచ్ఛందమేనని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. దీని ద్వారా పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని, వాడుకోవాలా వద్దా అన్నది వారిష్టమని స్పష్టం చేశారు. గృహ నిర్మాణానికి పేదలు తీసుకున్న రుణాల్ని ఓటీఎస్‌ ద్వారా మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్‌ ఉచితంగా చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలపై రూ.10వేల కోట్ల భారాన్ని తొలగిస్తున్నామని తెలిపారు. ఓటీఎస్‌ కింద రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి ఇంటిపై సంపూర్ణ హక్కులు లభిస్తాయని చెప్పారు. ఓటీఎస్‌ ద్వారా ఇన్ని రకాలుగా మేలు జరుగుతుందని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు, బలహీనవర్గాలకు గృహ నిర్మాణ పథకాల పురోగతిపై ముఖ్యమంత్రి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.

గతంలో వడ్డీనీ మాఫీ చేయలేదు

‘ఓటీఎస్‌ అమలు కాకుండా చాలా మంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదనల్నీ గత ప్రభుత్వం పరిశీలించలేదు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 43వేల మంది అసలు, వడ్డీ కట్టారు. ఈరోజు ఓటీఎస్‌పై మాట్లాడుతున్నవారు అప్పుడెందుకు కట్టించుకున్నారు? గతంలో అసలు, వడ్డీ కట్టినా.. బి-ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఓటీఎస్‌ ద్వారా సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నాం. లబ్ధిదారులు ఆ ఇంటిని తమ అవసరాల కోసం తనఖా పెట్టుకోవచ్చు. అమ్ముకునే హక్కూ వారికుంటుంది’ అని సీఎం పేర్కొన్నారు.

21 నుంచి రిజిస్ట్రేషన్‌ పత్రాలు

ఓటీఎస్‌ కింద డబ్బు కట్టినవారికి ఈ నెల 21 నుంచి రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇస్తామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రుణాలు చెల్లించిన 43 వేల మందికీ రిజిస్ట్రేషన్‌ చేస్తామని, వారికీ ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు. అధికారులు మాట్లాడుతూ.. 22-ఎ తొలగింపునకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని, ఓటీఎస్‌ వినియోగించుకున్న వారికి స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ, యూజర్‌ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు.  కోర్టు కేసులు పరిష్కారం కావడంతో పేదల గృహ నిర్మాణాలకు అడ్డంకులు తొలగిపోయాయని సీఎం పేర్కొన్నారు. వర్షాలు ఆగిపోయాయి కాబట్టి ఇళ్ల నిర్మాణంలో ఇక గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ‘నాణ్యతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సొంతంగా ఇళ్లు కట్టుకునేవారికి మంచి సలహాలిచ్చి, నాణ్యంగా కట్టుకునేలా చూడాలి. నిర్మాణ ఖర్చులు తగ్గించేందుకు అన్ని రకాల చర్యలూ చేపట్టాలి. ఇటుకలు ఆయా కాలనీలకు సమీపంలోనే తయారయ్యేలా చూడాలి. నిర్మాణ కార్మికుల బస, సిమెంటు గోదాముల వంటివి లేఅవుట్లలోనే ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులు కలిసి వస్తాయి’ అని సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని