Chandrababu: నష్టం రూ.6,054 కోట్లు.. ఇచ్చేది 35 కోట్లా?

విపత్తు సమయంలో ముందస్తు హెచ్చరికలతో పాటు.. వరద అనంతర సహాయ చర్యలనూ ప్రభుత్వం విస్మరించిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘నవంబరు మొదటి వారానికే చెరువులన్నీ నిండి ఉన్నాయి.

Updated : 29 Nov 2021 05:49 IST

ముందస్తు హెచ్చరికలను, సహాయచర్యలనూ విస్మరించిన ప్రభుత్వం
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలి
హెక్టారు వరికి రూ.20వేలు.. అరటి, మామిడికి రూ.50వేల పరిహారమివ్వాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

ఈనాడు-అమరావతి: విపత్తు సమయంలో ముందస్తు హెచ్చరికలతో పాటు.. వరద అనంతర సహాయ చర్యలనూ ప్రభుత్వం విస్మరించిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘నవంబరు మొదటి వారానికే చెరువులన్నీ నిండి ఉన్నాయి. అయినా వర్షపాతం, అల్పపీడనంపై జాతీయ విపత్తు నిర్వహణ మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రత, ముందస్తు చర్యలను చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వరదల స్వభావాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. న్యాయ విచారణ జరిపించాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు లేఖ రాశారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా సందర్శించి.. ప్రజల బాధలు చూశానన్నారు. ‘ప్రాథమిక పరిశీలన ఆధారంగా మౌలిక సదుపాయాల నష్టం రూ.6,054.29 కోట్లు ఉంటే.. ప్రభుత్వం కేవలం రూ.35కోట్లు మాత్రమే విడుదల చేయడం విషాదకరమ’ని విమర్శించారు. విపత్తు సహాయ నిధి రూ.1,100 కోట్లను వ్యక్తిగత డిపాజిట్‌ ఖాతాకు మళ్లించిన ప్రభుత్వం.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రాథమిక సూత్రాలను విస్మరించిందని ధ్వజమెత్తారు. కుటుంబసభ్యుల్ని కోల్పోయిన వారికి రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు, వరదనీరు ఇళ్లలోకి చేరిన వారికి రూ.10వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.25వేల సాయం, ఇళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా గృహాలను నిర్మించి ఇవ్వాలని డిమాండు చేశారు. నేత, మత్స్యకార కుటుంబాలకు ప్రత్యేక సాయంగా 50 కిలోల చొప్పున బియ్యం అందించాలన్నారు.

వరికి హెక్టారుకు రూ.30వేలివ్వాలి

‘వరదల కారణంగా 8లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ మంత్రి శాసనసభలో వెల్లడించారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న వరికి హెక్టారుకు రూ.30వేలు, అరటి, జీడిమామిడికి రూ.50వేలు, మామిడికి రూ.40వేలు, చెరకుకు రూ.25వేలు, పత్తికి రూ.30వేలు, వేరుసెనగకు రూ.25వేలు, జొన్నకు రూ.15వేలు, మొక్కజొన్నకు రూ.20వేలు, కొబ్బరి(చెట్టుకు) రూ.3వేలు చొప్పున పరిహారం ఇవ్వాలి. ఆక్వాకు హెక్టారుకు రూ.50వేలు, పడవలు ధ్వంసమైన మత్స్యకారులకు రూ.2లక్షలు, పూర్తిగా ధ్వంసమైన వారికి రూ.8లక్షలు, వలలు కోల్పోయిన వారికి రూ.20వేలు, కొత్త వలల కొనుగోలుకు 75% రాయితీ, కొత్త పడవల కొనుగోలుకు రూ.5లక్షల రాయితీ అందించాలి. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి. ఉపాధి కోల్పోయిన చేనేతలు, వీధి వ్యాపారులు, ఆటో రిక్షాల వారికి రూ.20వేల చొప్పున సాయం ఇవ్వాలి’ అని సూచించారు. ‘వరదల్లో చనిపోయిన ప్రతి ఆవు/గేదెకు రూ.40వేలు, జెర్సీ ఆవుకు రూ.50వేలు, గొర్రె/మేకకు రూ.6వేలు, ధ్వంసమైన గోశాలలకు రూ.25వేలు, పూర్తిగా ధ్వంసమైన గోశాలలకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షలు, దెబ్బతిన్న కోళ్ల ఫారాలకు రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలి’ అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

కపిల తీర్థం చుట్టూ కందకం నిర్మించాలి

కపిల తీర్థం పక్కన కొండచుట్టూ కందకం తవ్వడం ద్వారా.. వర్షపు నీటిని స్వర్ణముఖి నదిలోకి మళ్లించాలని చంద్రబాబు సూచించారు. వర్షపు నీరు తిరుపతి నగరంలోకి మళ్లకుండా ఇది ఉపయోగపడుతుందన్నారు. ‘తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితి నెలకొల్పేందుకు రహదారులు, వంతెనలు, విద్యుత్తు, సమాచార వ్యవస్థను పునర్నిర్మించాలి. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో మళ్లీ ఎడతెరపి లేకుండా వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలున్న నేపథ్యంలో.. ముందస్తు ఉపశమన ప్రయత్నాలు చేపట్టాలి’ అని చంద్రబాబు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని