Updated : 09/12/2021 13:15 IST

Chandrababu: కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన

పనిచేయని వారిని, ప్రత్యర్థులతో లాలూచీ పడేవారిని క్షమించను

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు- అమరావతి, కుప్పం పట్టణం- న్యూస్‌టుడే: పార్టీలో ప్రక్షాళన కుప్పం నుంచే ప్రారంభిస్తానని, వచ్చే ఆరు నెలలపాటు కుప్పంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీకి నష్టం చేసేవారిని, క్షేత్ర స్థాయిలో పని చేయకుండా తన దగ్గరకొచ్చి కబుర్లు చెప్పేవారికి ఉపేక్షించబోనని.. రాబోయే 6 నెలల్లో కొత్త రక్తంతో పార్టీకి జవసత్వాలు తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇకపై పార్టీని సమర్థంగా ముందుకు నడిపించేవారికి పట్టం కడతామన్నారు. మొహమాటాలు, లాలూచీ వ్యవహారాలతో ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యే వారికి స్థానం ఉండదని తేల్చి చెప్పారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులతో తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం చంద్రబాబు సమీక్షించారు. కుప్పంలో పార్టీని సమర్థంగా నడిపేందుకు సమన్వయ కమిటీని నియమిస్తానన్నారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో కేవలం 350 ఓట్ల తేడాతో ఏడు వార్డుల్లో ఓడిపోయామని ఆయన తెలిపారు. పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయారంటూ ఒక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై.. అందరి జాతకాలూ తన దగ్గరున్నాయని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. స్థానిక నాయకులు అధికార పార్టీ ఆగడాలతో కొంత భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోందన్నారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుప్పంలో దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు మహిళలు చొరవ చూపించారని, పోరాటపటిమ కనబరిచారని చంద్రబాబు కొనియాడారు.

అందరూ రహస్య నివేదికలివ్వండి

కుప్పం మున్సిపాలిటీలో పోటీ చేసిన తెదేపా అభ్యర్థులు తాము ఎదుర్కొన్న అన్ని సమస్యలపై నివేదికలు తయారుచేసి, తనకు పంపాలని చంద్రబాబు సూచించారు. ప్రతి నివేదికనూ చూసి, భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. ‘ప్రత్యర్థులు నీచ రాజకీయాలకు దిగారు. వారిని దీటుగా ఎదుర్కొనే సమర్థ నాయకత్వం అవసరమని భావిస్తున్నాను. కుప్పంలో కొన్ని వార్డులకు అభ్యర్థుల్ని చివరి నిమిషంలో ఎంపిక చేయడమూ కొంత నష్టం కలిగించింది. అయితే నిత్యం ప్రజల వద్దకు వెళ్తూ, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నచోట మంచి ఫలితాలు వచ్చాయి. బేల్దారి మేస్త్రి, లిఫ్ట్‌ ఆపరేటర్‌, పెయింటర్‌, బడ్డీకొట్టు వ్యాపారి విజయం సాధించారు. ఆ విజయాల్ని ఉదాహరణలుగా తీసుకుని ముందుకు సాగాలి’ అని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక రాజకీయ నేరగాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు లేదని, ఆయన స్థానికుడు కాదని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారని, అక్కడ ఇల్లు నిర్మించుకుని 3 నెలలకోసారైనా రావాలని బాలకుమార్‌ అనే స్థానిక నాయకుడు చంద్రబాబును కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. 


తెదేపా కేంద్ర కార్యాలయంలో కుప్పం నాయకులతో మాట్లాడుతున్న చంద్రబాబు.
పాల్గొన్న ఎమ్మెల్యే రామానాయుడు, వర్ల రామయ్య

వరదల్లో గల్లంతైనవారి కోసం ఇంకా వెతుకులాటే

ఈనాడు, అమరావతి: అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోవటంవల్ల వరదలో చిక్కుకుని గల్లంతైన 13 మంది కోసం బాధిత కుటుంబ సభ్యులు 17 రోజులుగా వెతుకుతూనే ఉన్నారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక తార్కాణమని వ్యాఖ్యానించారు. అయినా ముఖ్యమంత్రి మొద్దు నిద్ర నుంచి మేల్కొనట్లేదంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. చెయ్యేరు నదిలో మోకాలి లోతు నీటిలో నడుస్తూ, పరివాహక ప్రాంతంలో తిరుగుతూ గల్లంతైన తమ వారి కోసం బాధిత కుటుంబసభ్యుల గాలిస్తున్న వీడియోను ఆయన ట్వీట్‌కు జతపరిచారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం