Updated : 25/05/2021 06:59 IST

Krishnapatnam: ఆనందయ్య మందుపై అధ్యయనం షురూ

 చికిత్స పొందిన 500మంది నుంచి వివరాలు సేకరణ
 రంగంలోకి దిగిన ఆయుర్వేద పరిశోధన సంస్థలు
 రెండు మూడు నెలల్లో ఫలితాలు!

ఈనాడు, అమరావతి, తిరుపతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా బాధితులకు ఆనందయ్య ఇస్తున్న మందు, వైద్యప్రక్రియలో శాస్త్రీయతపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా అధ్యయనం ప్రారంభించాయి. ఆనందయ్య వద్ద చికిత్స పొందిన సుమారు 500 మందిని నుంచి సేకరించే సమాచారంతో తొలుత జంతువులు, ఆ తరువాత మానవులపై క్లినికల్‌ ట్రయల్‌్్స జరుగుతాయి. ఆ తరవాతే ఆనందయ్య వైద్యం ఆయుర్వేద ప్రమాణాలకు తగ్గట్లుగా ఉందా లేదా అన్నది కేంద్ర ఆయుర్వేద సంస్థ నిర్ధారిస్తుందని వైద్యులు వెల్లడించారు. యుద్ధ ప్రాతిపాదికన పరిశోధనలు జరిగితే ఫలితాలు వచ్చేందుకు కనీసం 2,3 నెలలు పడుతుందని సమాచారం. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ అధ్యయనానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడి చొరవతో కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ వెంటనే రంగంలోకి దిగింది.
కొవిడ్‌ మందు కోసం అన్వేషణ!
కొవిడ్‌-19 తొలిదశలో తమిళనాడులో సిద్ధ వైద్యానికి సంబంధించి కబాసుర కుడనీర్‌ (కషాయం మందు) తయారుచేశారు. నిమ్ముతో కూడిన జ్వరాలు, ఇతర అనారోగ్యాల పరిష్కారానికి ఈ మందు బాగా ఉపయోగపడుతుందని, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్పి వాడుకలోకి తెచ్చారు. కేంద్రం ఆయుర్వేద పరిశోధన సంస్థ కూడా ఆయుష్‌-64 మాత్రలను వాడుకలోకి తెచ్చింది. కేంద్ర ఆయుర్వేద వైద్య, పరిశోధన సంస్థ కొవిడ్‌ మందును తయారు చేసేందుకు దేశవ్యాప్తంగా ఆయుర్వేద వైద్య నిపుణుల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఈ మేరకు 16వేల ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో 2,000 ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకొని మరింత లోతుగా అధ్యయనం చేసి చివరిగా 200 ప్రతిపాదనలు ఎంపిక చేశారు. వీటిలో ప్రస్తుతం 16 ప్రాజెక్టులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణపట్నం ఆయుర్వేదంపై ఆయుష్‌ శాఖ కార్యదర్శి ఆదేశాల ప్రకారం కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీకాంత్‌ చేపట్టిన తదుపరి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అధ్యయనం ప్రారంభమైంది.
32 బృందాలుగా ఏర్పడి...!
ఆనందయ్య వైద్యానికి ప్రజల నుంచి స్పందన కనిపిస్తుండటాన్ని గమనించిన దిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ (సీసీఆర్‌ఏఎస్‌) జారీ చేసిన సూచనల మేరకు విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, టీటీడీ ఆయుర్వేదిక్‌ కళాశాల వైద్యులు సంయుక్తంగా అధ్యయనాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కొందరు వైద్యులు, పీజీ విద్యార్థులు 32 బృందాలుగా ఏర్పడ్డారని ఆయుర్వేద వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌  పి.మురళీకృష్ణ తెలిపారు. వీరు ఆనందయ్య వద్ద చికిత్స పొందిన వారికి ఫోన్లు చేసి వారికి కరోనా ఎప్పుడు వచ్చింది, ఆ సమయంలో ఆర్‌టీపీసీఆర్‌, సీటీ స్కాన్‌ పరీక్షలు చేయించుకున్నారా అనే వివరాలు తీసుకుంటున్నారు. కొవిడ్‌ వచ్చినట్లు తెలిసిన తర్వాత ఎన్ని రోజులకు ఆనందయ్య వద్ద మందులు తీసుకున్నారు, ఎప్పుడు ఉపశమనం కలిగిందన్న దానిపై  ఆరా తీస్తున్నారు. ఇలా అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తరవాత ఈ సమాచారాన్ని క్రోడీకరించి తయారు చేసిన నివేదికను పరిశోధనసంస్థకు పంపుతారు.

ఇవి ఎలా పనిచేస్తాయో పరిశీలిస్తాం

‘విజయవాడలోని ప్రాంతీయ కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ సహకారంతో కృష్ణపట్నం మందు ఉపయోగించిన 500 మంది నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నాం. ఇందులో అత్యధికుల అభిప్రాయాలు సానుకూలంగా వస్తే ఎలుకలపై ప్రయోగిస్తాం. ఈ ప్రక్రియలోనూ సానుకూలత వస్తే మనిషిలోని సెల్‌లైన్స్‌ ద్వారా (టిష్యూ కల్చర్‌) వైరస్‌, ఇమ్యూనిటీ పరంగా ఎలా మందులు పనిచేస్తాయో పరిశీలిస్తాం. ఆ తరువాత మనుషులపై ప్రయోగాలు జరుగుతాయి. మందులో దుష్ప్రభావాలు లేవని తేలితే కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభిస్తుంది’

-సి.మురళీకృష్ణ, ఆయుర్వేద వైద్య సంస్థ, విజయవాడ

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని