ఏపీ మండలి రద్దు అంశం పరిశీలనలో ఉంది

ఏపీ శాసనమండలి రద్దు కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 169వ అధికరణ కింద చేసి పంపిన తీర్మానం తమకు అందిందని, ప్రస్తుతం ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజూ తెలిపారు....

Published : 30 Jul 2021 04:27 IST

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఏపీ శాసనమండలి రద్దు కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 169వ అధికరణ కింద చేసి పంపిన తీర్మానం తమకు అందిందని, ప్రస్తుతం ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజూ తెలిపారు. గురువారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు హాజరైన సభ్యుల్లో 2/3 వంతు మద్దతుతో తీర్మానం చేసి పంపితే రాష్ట్రాల్లో శాసనమండలి ఏర్పాటు, రద్దుపై పార్లమెంటు చట్టం చేయొచ్చని కేంద్రమంత్రి తెలిపారు.

ఇందుకు ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిపై న్యాయశాఖ స్థాయీసంఘం తన 63వ నివేదికలో కొన్ని సిఫార్సులు చేసినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై పరిశీలనలో భాగంగా సర్కారియా కమిషన్‌ ఈ మొత్తం అంశాన్ని పరిశీలించి శాసనమండలి రద్దు, ఏర్పాటుకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా శాసనసభలో తీర్మానం ఆమోదించి పంపితే, దాన్ని పార్లమెంటుకు పంపేందుకు ముందు ఆ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను పేర్కొంటూ నిర్ణీత సమయంలోపు రాష్ట్రపతి ముందుంచాలని సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. తర్వాత పార్లమెంటు ఆ తీర్మానాన్ని ఆమోదించవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చని చెప్పారు. తీర్మానం చేసేటప్పుడు అసెంబ్లీకి హాజరైన వారిలో 2/3 వంతు ఓటేస్తే చాలని.. అంతకుమించి నిబంధనల్లో మార్పులు అవసరం లేదని అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని