CBI: వివేకా గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారు?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారంటూ సీబీఐ అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు (పీఏలు) రాఘవరెడ్డి, రమణారెడ్డి,

Updated : 11 Aug 2021 07:49 IST

ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలను విచారించిన సీబీఐ అధికారులు

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారంటూ సీబీఐ అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శులు (పీఏలు) రాఘవరెడ్డి, రమణారెడ్డి, అప్పటి సాక్షి పత్రిక జిల్లా విలేకరి బాలకృష్ణారెడ్డిని ఆరా తీశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా సమాచారం అందించారని రాఘవరెడ్డిని అడిగినట్లు తెలిసింది. ఎంపీ పీఏలు ఇద్దరిని మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్యకు వాడిన మారణాయుధాలను పడేసినట్లుగా అనుమానిస్తున్న రెండు ప్రాంతాల్లో వెలికితీత చర్యలను సీబీఐ అధికారులు మంగళవారం తాత్కాలికంగా నిలిపేశారు. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సీబీఐ అధికారులు మంగళవారం 12 మందిని విచారించారు. వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల పట్టణ సీఐగా పనిచేసిన శంకరయ్య, హోంగార్డు నాగభూషణంరెడ్డిని ప్రశ్నించారు. శంకరయ్య హత్యాస్థలంలో ఉండగానే రక్తపుమరకలు, ఇతర సాక్ష్యాధారాలను తుడిచేశారనే అభియోగాలపై ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన అనుమానితుల జాబితాలో ఈయన పేరుంది. వివేకా కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసిన ఇనయతుల్లా, వివేకా పీఏ జగదీశ్వర్‌రెడ్డి తమ్ముడు ఉమాశంకర్‌రెడ్డి, చక్రాయపేట మండలానికి చెందిన వైకాపా నాయకులు ఆదిరెడ్డి, అంజిరెడ్డి, వేంపల్లె మండలానికి చెందిన చెన్నకేశవ, మల్లి, రహ్మతుల్లాఖాన్‌ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని