6 నెలలే రక్షణ

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మూడో డోసు టీకా ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కొవిడ్‌-19 పరిశోధకులు డాక్టర్‌ శ్రీధర్‌ చిలిమూరి అభిప్రాయపడ్డారు. సాధారణ వ్యక్తులు రెండో డోసు పొందిన 6 నెలల తర్వాత మూడో డోసు (బూస్టర్‌) పొందితే మంచిదన్నారు.

Updated : 12 Sep 2021 04:53 IST

సాధారణ వ్యక్తులకు 6-8 నెలల మధ్య మూడో టీకా
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి 4 వారాలకే..
2024 నాటికి కరోనా వైరస్‌ ప్రభావం తగ్గే అవకాశం
అమెరికా వైద్యుడు శ్రీధర్‌ చిలిమూరితో ఆన్‌లైన్‌లో ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖి
ఈనాడు-అమరావతి

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మూడో డోసు టీకా ఇస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని కొవిడ్‌-19 పరిశోధకులు డాక్టర్‌ శ్రీధర్‌ చిలిమూరి అభిప్రాయపడ్డారు. సాధారణ వ్యక్తులు రెండో డోసు పొందిన 6 నెలల తర్వాత మూడో డోసు (బూస్టర్‌) పొందితే మంచిదన్నారు. దీనివల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని చెప్పారు. రెండో డోసు పొందిన 6 నెలల తర్వాత యాంటీబాడీలు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడవుతోందన్నారు. భారతదేశంలో ఇంకా టీకా పంపిణీ కొనసాగుతూనే ఉన్నందున రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి, వృద్ధులకు మూడో డోసు ఇస్తే, మూడోదశ వచ్చినా పరిస్థితులు అదుపులో ఉంటాయన్నారు. కొత్త ఉత్పరివర్తనాలను సమర్థంగా ఎదుర్కోవాలంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం అతి ముఖ్యమని తెలిపారు. వీటిని విస్మరిస్తే, టీకా వేయించుకున్నా ఫలితాలు ఉండవని వెల్లడించారు. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌ కేర్‌ హాస్పిటల్‌ సెంటర్‌లో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఛైర్మన్‌ శ్రీధర్‌ ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధికి ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆంధ్రా వైద్యకశాశాలలో ఎంబీబీఎస్‌ చదివి, అనంతరం అమెరికా వెళ్లిన ఈయన కొవిడ్‌-19 గురించి రాసిన 15కి పైగా వ్యాసాలు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ కార్డియాలజీ వంటి వాటిలో ప్రచురితమయ్యాయి.
* ఇజ్రాయెల్‌, అమెరికా, సింగపూర్‌ లాంటి దేశాల్లో గరిష్ఠస్థాయిలో టీకా పంపిణీ చేసినా ఇంకా కేసులు ఎక్కువ రావడానికి కారణాలేంటి?
** న్యూయార్క్‌లో 65% మందికి టీకా పంపిణీ జరిగింది. దీనివల్ల మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ కేసులు తక్కువ. ఫ్లోరిడా, టెక్సాస్‌లో 50% కంటే తక్కువగా ఇచ్చారు. అక్కడ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్లే.. అమెరికా ప్రభుత్వం ఉద్యోగులకు, ఆరోగ్య సిబ్బందికి, ఎంపికచేసిన మరికొన్ని రంగాల వారికి టీకా తప్పనిసరి చేసింది. ఆఫ్రికన్‌ అమెరికన్లు టీకాపై విముఖత చూపుతున్నారు. సహజంగానే తాము ఆరోగ్యవంతులమన్న విశ్వాసం వారిలో ఉంది. కానీ వీరిలో చాలామందికి రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి. ఇలాంటివారే వైరస్‌ బారిన పడుతున్నారు. అమెరికాలో తొలి డోసు ఇచ్చిన 4 వారాల తర్వాత రెండో డోసు పంపిణీ చేశారు. జనవరిలో టీకా పొందినవారిలో కొందరు ఇప్పుడు వైరస్‌ బారిన పడుతున్నారు. యూకేలో తొలి డోసు, రెండో డోసు మధ్య 8-12 వారాల విరామం ఉంది. భారత్‌లోనూ ఇలాగే జరుగుతోంది.

* మూడో డోసు పంపిణీలో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి!
** రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, హెచ్‌.ఐ.వి., క్యాన్సర్‌ బాధితులకు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి, స్టెరాయిడ్స్‌ వాడేవారికి మూడో డోసు పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలి. డయాలసిస్‌ పేషెంట్లు రెండు డోసులు పొందినా వారిలో 50% కంటే తక్కువగా యాంటీబాడీలు వృద్ధి చెందాయి. మూడో డోసు ఇస్తే 20-50% వరకు వృద్ధి కనిపించింది. రెండో డోసు పొందిన 4 వారాల తర్వాత వీరికి మూడో డోసు ఇవ్వడం అమెరికాలో మొదలైంది. ఆరోగ్యరంగంలోని వారికి మూడో డోసు పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలి. భారత్‌లో ఇప్పుడిప్పుడే యువతకు టీకా ఇస్తున్నారు. వీరిలో అత్యధికులకు టీకా ఇస్తే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుంది. వృద్ధులకు మూడో డోసు ఇస్తే మరణాల రేటు తగ్గుతుంది. ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవాలి. టీకా తీసుకున్నవారూ వైరస్‌ బారిన పడుతుంటే మూడో డోసు పంపిణీపై దృష్టిపెట్టాలి. దీనికి సన్నద్ధం కావాలంటే భారతదేశంలో టీకా పంపిణీ ఇంకా వేగవంతం కావాలి. ఇజ్రాయెల్‌లో మూడో డోసు ఇవ్వడంవల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. టీకా తీసుకున్నంత మాత్రాన ఏమీ కాదన్న ధీమా ఉండకూడదు. జులైలో కాలిఫోర్నియాలో ఆంక్షలు తగ్గించగానే కేసులు పెరిగాయి.
* మూడోదశ వస్తుందా? టీకా వల్ల ఉపయోగాలు ఎలా ఉండబోతున్నాయి?
** మూడో దశపై కచ్చితమైన ఆధారాలు ఏమీలేవు. భారత్‌లాంటి దేశాల్లో టీకా పంపిణీ బాగుంది. ఒక డోసు పొందిన వారినుంచి వైరస్‌ మరొకరికి వ్యాప్తి చెందదు. 18 ఏళ్లలోపు యువకులకు టీకా ఇవ్వనందున వీరికి ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ సోకవచ్చు. అమెరికాలో రెండోదశలో 20-30 ఏళ్ల మధ్య వారికి వచ్చింది. పలువురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారొచ్చు. నాలుగు గోడల మధ్య కార్యక్రమాలు నిర్వహించకూడదు. తప్పనిసరైతే ఆరుబయటే నిర్వహించుకోవాలి. వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఎంచుకోవాలి.
* కరోనా వైరస్‌ ప్రభావం ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది?
** 2024 నాటికి కరోనా వైరస్‌ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. వైరస్‌ వ్యాప్తి తీవ్రమయ్యే దశలోనే టీకాలు వచ్చాయి. దానివల్ల ఫలితాలు కనిపిస్తున్నాయి. మనమే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి సరిగా పాటించడం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చే టీకాలు, ఇతర పరిస్థితులను బట్టి చూస్తే 2024 నాటికి కరోనా వైరస్‌ ప్రభావం అంతగా ఉండదని అంచనా.
* కొవిడ్‌-19లోని ప్రస్తుత ఉత్పరివర్తనాలు ఎలా ఉన్నాయి?
** కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనాలు ఎక్కువే. వాటిలో కొన్ని వైరస్‌కు అనుకూలంగా ఉంటే, మరికొన్ని వైరస్‌నే కనుమరుగు చేస్తాయి. ఉత్పరివర్తనాలు ఎక్కువగా ఉండటంతోనే భారత్‌లో కంటే అమెరికాలో కేసులు ఎక్కువవుతున్నాయి. అమెరికాలో ఇప్పుడు ‘మ్యూ’ ఉత్పరివర్తనం ఉంది. వీటిలో కొన్ని రోగనిరోధక శక్తినీ తప్పించుకుంటాయి. డెల్టా రకం 99% డామినేట్‌ చేస్తుంది. వేరే రకానికి అవకాశం ఇవ్వడంలేదు. ఇన్ఫెక్షన్‌ స్థాయి అధికంగా ఉన్నంతవరకు వైరస్‌ ఉత్పరివర్తనాలు తీవ్రంగా ఉంటాయి.
* కొవిడ్‌ కేసులకు తగ్గట్లు చికిత్సను ఎలా మెరుగుపరుచుకోవాలి? మానవ వనరులు ఎలా పెంచుకోవాలి?
** భారతదేశంలో చిన్నపిల్లల వైద్యులు తక్కువగా ఉండటం ఓ సవాలు. ప్రపంచవ్యాప్తంగా వైద్యసిబ్బంది అలసిపోయారు. అమెరికాలో నర్సు కోర్సుపై ఆసక్తి గలవారిని చేర్చుకుని శిక్షణ ఇస్తున్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేనివారికి వీరి ద్వారా ప్రాథమిక చికిత్స అందేలా చేయాలి.


* తొలి, మలివిడత కొవిడ్‌లో గమనించిన తేడాలేంటి?

అమెరికాతో పోలిస్తే భారతదేశం పరిస్థితులు విభిన్నం. అమెరికాలో మలి విడతకు ముందుగానే సన్నద్ధత జరిగింది. తగిన సంఖ్యలో పీపీఈ, ఆక్సిజన్‌, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడం, తొలి విడతలో వైరస్‌ లక్షణాలపై పూర్తి అవగాహన రావడం, చికిత్స పద్ధతులను పకడ్బందీగా తయారు చేసుకోవడంతో మరణాల సంఖ్య తక్కువగా ఉంది. తొలివిడతలో ఒక వ్యక్తికి కొవిడ్‌ వస్తే ఇంట్లో ఉండే వారిలో 20% మందికే సోకింది. రెండోదశలో 80% మందికి సోకింది. డెల్టా రకం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. డెల్టా రకం వచ్చినవారిలో దగ్గు ఎక్కువగా ఉంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువమందికి వ్యాపించింది. అమెరికాలో రెండోదశలో మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ ఇంజెక్షన్లను ఎక్కువగా వాడాం. దీనివల్ల ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు తగ్గాయి. వైరస్‌ నిర్ధారణ జరిగిన పది రోజుల్లోగా ఇవి ఇవ్వొచ్చు. ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండేవారికి ఇవ్వకూడదు.


* ఏపీలో మలివిడత కొవిడ్‌ ప్రభావం తగ్గకుండా ఇంకా కొనసాగుతూనే ఉంది?
** నా వద్ద వివరాలు పూర్తిగా లేవు. యువకులు మాస్కులు ధరించడం లేదు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు బయట తిరుగుతున్నారు. డెల్టా ప్రభావం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి.
* అందరికీ రోగనిరోధకశక్తి రావాలంటే ఎంతమందికి యాంటీబాడీలు వచ్చి ఉంటే మంచిది?
** అమెరికాలో చేసిన అధ్యయనాల్లో 83% మంది (టీకా పొందినవారు, ఇన్‌ఫెక్షన్‌ వచ్చినవారు)లో యాంటీబాడీలు వృద్ధి చెందాయి. అయినా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. కొత్త ఉత్పరివర్తనాలు వస్తున్నన్నాళ్లు హెర్డ్‌ ఇమ్యూనిటీ వల్ల అంతగా ఉపయోగం ఉండకపోవచ్చు.
* భారత్‌లో మలివిడతలో బ్లాక్‌ఫంగస్‌ కేసులు పెరగడానికి కారణాలేంటి? అమెరికాలో పరిస్థితి ఏంటి?
** అమెరికాలో దాదాపుగా బ్లాక్‌ఫంగస్‌ కేసులు లేవు. భారత్‌లో ఎప్పటి నుంచో ఉన్నాయి. వాతావరణంలో మార్పులు, పరిశుభ్రత లేమి, గాలి, వెలుతురు తక్కువ కావడం, కొవిడ్‌ సమయంలో చికిత్స ప్రోటోకాల్‌ సక్రమంగా పాటించకపోవడం, ఆక్సిజన్‌ మాస్కులలో శుభ్రత లేకపోవడం వంటి కారణాలవల్ల బ్లాక్‌ఫంగస్‌ కేసులు మలివిడతలో పెరిగాయి.
* భారతదేశంలోనే కేరళలో ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. అయినా అక్కడ వైరస్‌ కేసులు పెరగడానికి కారణాలేమిటి?
** పరీక్షలు ఎక్కువగా చేస్తుండటంతో కేసులు ఎక్కువసంఖ్యలో బయటపడుతున్నాయి. ఈ పరీక్షలతో లక్షణాలు లేని వారిలోనూ వైరస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. స్వల్ప లక్షణాలు కలిగిన వారినీ పరీక్షల ద్వారా గుర్తిస్తున్నారు. పండుగలు, ఇతర కార్యక్రమాల నిర్వహణపై పరిమితులు తగ్గించినందు వల్ల కదలికలు పెరిగి కూడా కేసులు వస్తున్నాయి.
* ప్రయాణాలపై ఆంక్షల గురించి ఏమంటారు?
** అమెరికన్లు కెనడాకు వెళ్లితే ఆంక్షలు ఏమీలేవు. కెనడా వారు అమెరికా రావడంపై మాత్రం ఆంక్షలు అమలవుతున్నాయి. వాస్తవానికి కెనడాలో ఇన్‌ఫెక్షన్లు తక్కువే. అమెరికాలో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఆంక్షలు అక్కర్లేదు. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఏమీలేవు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని భావిస్తున్నారు.
* కొవిడ్‌ వైరస్‌ మరో వైరస్‌తో కలిసి సరికొత్త వైరస్‌ వచ్చే అవకాశం ఉందా? రివర్స్‌ జునోసిస్‌ (గబ్బిలం నుంచి మనిషికి వచ్చినట్లే... మనిషి నుంచి జంతువులకు రావడం) అవకాశం ఉందా?
** అవకాశం లేదు. రివర్స్‌ జునోసిస్‌ ఊహాగానమే. దీనిపై యూరప్‌లో అధ్యయనం జరుగుతోంది. ఫలితాలు రావాల్సి ఉంది.
** కొవిడ్‌ వైరస్‌ ఒకరి నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంట్‌ ఐదారుగురికి వ్యాపిస్తోంది. ఇంకొన్ని పరిశోధనల్లో ఎక్కువమందికి వ్యాప్తి చెందుతోంది.
** లక్షణాలు లేకుండా కొవిడ్‌ వచ్చిన బాధితుల నుంచి వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీనికి ముఖ్య కారణం మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం. ఈ ధోరణిలో మార్పు రాకుంటే.. కొత్త దశలు వస్తూనే ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని