ఆన్‌లైన్‌ టికెటింగ్‌తో ఆయనకేం సంబంధం?

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవహారంతో నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏం సంబంధమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు

Updated : 27 Sep 2021 05:12 IST

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తారు
పవన్‌కల్యాణ్‌పై పేర్ని నాని ఆగ్రహం
టికెట్లు ఇష్టానుసారం పెంచితే ఊరుకోవాలా?: బొత్స

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవహారంతో నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏం సంబంధమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘సామాన్యులకు పారదర్శకంగా, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు సినిమా టికెట్లు అమ్మితే పవన్‌ గోలేంటి? రోజుకు నాలుగు షోలు వేయాలని చట్టం చెబుతుంటే ఇష్టమొచ్చినట్లు ప్రదర్శనలు వేస్తామంటారా..? ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తారు జాగ్రత్త’ అని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకర్లతో ఆదివారం మాట్లాడారు. ‘ప్రభుత్వం సినిమా టికెట్ల పోర్టల్‌ మాత్రమే నడుపుతుంది. థియేటర్ల యజమానులు ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తారు. ఒక రోజు కలెక్షన్లు.. తర్వాతి రోజు ఉదయమే రిజర్వుబ్యాంకు గేట్‌వే ద్వారా ఎవరి డబ్బులు వారికి వెళ్లిపోతాయి. ఈ వివరాలన్నీ పవన్‌ తెలుసుకున్నారా..?’ అని ప్రశ్నించారు.

దమ్ముంటే కేసీఆర్‌ను విమర్శించాలి: ‘ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేక సినిమా డబ్బుతో రుణం తెచ్చుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. వకీల్‌సాబ్‌ సినిమా నిర్మాతకు ఏపీలో వచ్చిన షేరు రూ.55 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందా..? ఎందుకిలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు? నటుడు సాయితేజ్‌కు ప్రమాదం జరిగినప్పుడు తెలంగాణ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లోని విషయాన్నే మీడియా చెప్పింది. పవన్‌కు దమ్ముంటే తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్‌ను విమర్శించాలి. జగన్‌ అంటే లోకువా..?’ అని ప్రశ్నించారు. ‘ఇడుపులపాయ నేలమాళిగల్లో డబ్బులుంటే ప్రధాని, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లి అరెస్టు చేయించు. కోడికత్తి కేసును ఎన్‌ఐఏ విచారిస్తోంది. వెళ్లి అమిత్‌ షాను అడిగే దమ్ములేక సొల్లు కబుర్లు చెబుతున్నారు’ అని దుయ్యబట్టారు.

ఏపీలో 800 థియేటర్లలో ప్రదర్శనలు: ‘ఏపీలో 1100 వరకూ థియేటర్లు నడిచే స్థితిలో ఉన్నాయి. దాదాపు 800 హాళ్లలో ప్రదర్శనలు వేస్తున్నారు. లవ్‌స్టోరీ సినిమా మొదటిరోజు ఏపీలో నిర్మాతకు అన్ని ఖర్చులు పోనూ వచ్చిన షేరు రూ.3.80 కోట్లు. టికెట్‌ రేటు పెంచుకొని, నచ్చినన్ని షోలు వేసుకుంటే తెలంగాణలో రూ.3 కోట్లు వచ్చింది. రెండోరోజు ఏపీలో రూ.2.67 కోట్లు, తెలంగాణలో రూ.2.49 కోట్లు వచ్చింది. ఏపీలో సినీ పరిశ్రమను జగన్‌ ఎలా ఇబ్బంది పెట్టారో నిర్మాత సునీల్‌ నారంగ్‌ చెప్పాలి’ అని మంత్రి నాని పేర్కొన్నారు.


థియేటర్లు మూసేశామా: మంత్రి అనిల్‌

నెల్లూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి పవన్‌కల్యాణ్‌ అయినా.. సంపూర్ణేష్‌బాబు అయినా ఒకటేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులో విలేకర్లతో మాట్లాడారు.  సిక్స్‌ ప్యాక్‌ చేసేందుకు సుధీర్‌బాబు, ప్రభాస్‌ ఒకేలా కష్టపడ్డారన్నారు. సినిమా థియేటర్లు ఏమైనా మూసేశామా అని ప్రశ్నించారు. టికెట్‌ ధర అందరు హీరోలకూ సమానంగా ఉండాలన్నారు. ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని రూ.100 టికెట్‌ రూ.200 పెట్టి కొనాలని ఎవరైనా చెబుతారా.. దాన్ని అభిమానాన్ని క్యాష్‌ చేసుకోవడం అంటారన్నారు. రాష్ట్రంలో పవన్‌కల్యాణ్‌ పార్టీ చాప చుట్టేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.


పవన్‌ క్షమాపణ చెప్పాలి: మంత్రి ముత్తంశెట్టి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిపై పవన్‌కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండు చేశారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబులా పవన్‌కల్యాణ్‌ కూడా రాష్ట్రానికి టూరిస్టులా వచ్చిపోతూ చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు. సినీ పరిశ్రమకు సహకారం అందిస్తుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు. విదేశాల్లో కాకుండా లంబసింగి, గండికోట, హార్స్‌లీ హిల్స్‌లో సినిమా షూటింగులు ఎందుకు చేయడం లేదన్నారు.


అనుచిత వ్యాఖ్యలు తగవు: మంత్రి వేణుగోపాలకృష్ణ

పిఠాపురం, న్యూస్‌టుడే: ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరిజిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని ఆదివారం సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుస్తకాలు చదివానని, శాస్త్రీయ దృక్పథం ఉందని చెప్పుకొనే పవన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.


పవన్‌ రుషి పుంగవుడా: మంత్రి బొత్స

విజయనగరం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులను సన్నాసులుగా సంబోధిస్తున్న పవన్‌కల్యాణ్‌ రుషి పుంగవుడా? అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ‘పవన్‌ పనికిమాలిన వాడు, పనికిమాలిన మాటలు మాట్లాడతాడు’ అని తామంటే ఏమైపోతాడో ఓసారి గుర్తుంచుకోవాలన్నారు. విజయనగరంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సినిమా టికెట్లను ఇష్టానుసారం రూ.500, రూ.1,000 చొప్పున అమ్ముకుంటామంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. వినోదం కోసం ప్రజలు సినిమాలకు వెళ్తారని, వారిని దోచుకుంటామంటే ఎలాగని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లకు లేని బాధ పవన్‌కు ఎందుకని విమర్శించారు. చిత్ర పరిశ్రమలో ఏమైనా ఇబ్బందులుంటే చిరంజీవి, మోహన్‌బాబు వంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చన్నారు. ఇది రిపబ్లిక్‌ ఇండియా కాబట్టే ఇష్టానుసారం ఉండటం కుదరదని చెప్పారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, దీనిపై ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని