కొత్తలో కోత!

రాష్ట్రంలో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి తీసుకోవడంతో కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో ఖాళీల సంఖ్య తగ్గిపోనుంది. ఇది ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధన వృత్తిలోకి రావాలనుకుంటున్న

Published : 04 Oct 2021 02:11 IST

ప్రభుత్వంలోకి 8,573 మంది ఎయిడెడ్‌ బోధన సిబ్బంది రాకతో తగ్గనున్న నియామకాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి తీసుకోవడంతో కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో ఖాళీల సంఖ్య తగ్గిపోనుంది. ఇది ప్రభుత్వ విద్యాసంస్థల్లో బోధన వృత్తిలోకి రావాలనుకుంటున్న నిరుద్యోగుల ఆశలపై ప్రభావం చూపనుంది. ఉపాధ్యాయులు, అధ్యాపకులు కలిపి మొత్తం 8,573 మంది ఎయిడెడ్‌ నుంచి ప్రభుత్వంలోకి వస్తున్నారు. వీరిలోని 1091 మంది ఎయిడెడ్‌ అధ్యాపకులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద సిబ్బంది మినహా 500 వరకు ఉన్న ఖాళీలన్నీ ఎయిడెడ్‌ అధ్యాపకులతో నిండిపోనున్నాయి. మిగిలిన వారిలో కొందరిని విశ్వవిద్యాలయాలకు పంపించేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో పనిచేసేందుకు 285 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిని వర్సిటీల్లో నియమిస్తే అక్కడ కొన్ని ఖాళీలు భర్తీ అవుతాయి. ప్రభుత్వం రెండు వేల సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రకటన విడుదల చేస్తామని జాబ్‌ క్యాలెండర్‌లో ప్రస్తావించింది. తాజా పరిణామంతో ఈ సంఖ్య తగ్గిపోతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో 1946 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా, వీటిల్లో 6,982 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

ఎయిడెడ్‌ సిబ్బంది విలీనంతో వీరంతా జిల్లా, మండల పరిషత్తు పాఠశాలల్లోకి వస్తారు. సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతించిన ఎయిడెడ్‌ విద్యాసంస్థల నుంచి ఇప్పటికే ఉపాధ్యాయులు వచ్చి ఎంఈవోల వద్ద రిపోర్టు చేశారు. దీంతోపాటు నూతన జాతీయ విద్యా విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉంది. ఎస్జీటీల పదోన్నతుల ద్వారా స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలు కొంతవరకు భర్తీ అవుతాయి. దీనికితోడు ఎయిడెడ్‌ సిబ్బంది రావడంతో ఖాళీలు దాదాపుగా భర్తీ కానున్నాయి.

జూనియర్‌ కళాశాలల్లోకి సైతం: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోకి ఎయిడెడ్‌ నుంచి 500 వరకు జూనియర్‌ లెక్చరర్లు రానున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను మినహాయిస్తే 1,100 వరకు ఖాళీలు ఉండగా.. ఎయిడెడ్‌ సిబ్బంది బదలాయింపుతో దాదాపు సగం భర్తీ కానున్నాయి. ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలపై స్పష్టత వస్తే కొందరు ఉపాధ్యాయులు పదోన్నతిపై జేఎల్స్‌గా వస్తారు. ఇక అర్హత కలిగిన ఇంటర్‌లోని బోధనేతర సిబ్బందితో 10% లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగితే, లేదా బోధన సిబ్బంది ఉద్యోగ విరమణ చేస్తే తప్ప... కొత్తగా భర్తీ ఉండకపోవచ్చని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని