దసరా బాదుడు

దసరా రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు బస్‌ ట్రావెల్స్‌ అప్పుడే సిద్ధమయ్యాయి. ముందస్తుగా టిక్కెట్లు బుక్‌ చేసుకునే వారికి ఛార్జీలను అదనంగా పెంచాయి.

Updated : 04 Oct 2021 08:11 IST

ప్రైవేటు ట్రావెల్స్‌ ఏసీ బస్సుల్లో టిక్కెట్‌పై రూ.300-400 అదనం
నాన్‌ ఏసీలో రూ.200 వరకు వడ్డింపు

ఈనాడు, అమరావతి: దసరా రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు బస్‌ ట్రావెల్స్‌ అప్పుడే సిద్ధమయ్యాయి. ముందస్తుగా టిక్కెట్లు బుక్‌ చేసుకునే వారికి ఛార్జీలను అదనంగా పెంచాయి. ఈ వారాంతం నుంచి విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల దసరా సెలవులు మొదలు కానున్నాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారితో బస్సులు, రైళ్లలో రద్దీ పెరగనుంది. ఇదే అదనుగా దాదాపు అన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ ఛార్జీలను పెంచేశాయి. ఏసీ స్లీపర్‌, సీటర్‌ సర్వీసుల్లో టిక్కెట్‌పై రూ.300-400 వరకు అదనంగా పెంచాయి. నాన్‌ ఏసీ సీటర్‌, స్లీపర్‌ సర్వీసుల్లో టిక్కెట్‌ ధర రూ.200 వరకు పెరిగింది. తక్కువ సర్వీసులే అందుబాటులో ఉన్నాయని, రద్దీ పెరిగితే మరింత ధర పెరిగే అవకాశం ఉందంటూ బుక్‌ చేస్తున్నారు.

తక్కువ దూరానికే..

విజయవాడ నుంచి విశాఖకు ఆర్టీసీ ఏసీ స్లీపర్‌లో టికెట్‌ ధర రూ.880, సీటర్‌ రూ.580, నాన్‌ ఏసీ సూపర్‌లగ్జరీలో రూ.504 ఉంది. అదే ప్రైవేటు ట్రావెల్స్‌లో ఏసీ స్లీపర్‌ రూ.1200- 1300, ఏసీ సీటర్‌లో రూ.900-1000 వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో ఇదే విధంగా ఛార్జీలను పెంచారు.

ఇక రాయలసీమ జిల్లాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లోనూ ధరలను భారీగా పెంచేశారు. విజయవాడ - బెంగళూరు ఏసీ స్లీపర్‌ సర్వీసుల్లో రూ.1800-2000 చెబుతున్నారు. అదే ఆర్టీసీ వెన్నెల ఏసీ స్లీపర్‌ సర్వీసులో రూ.1,600 ధర ఉంది.

ప్రత్యేక సర్వీసులు: దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 400వరకు అదనంగా ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దూర ప్రాంత సర్వీసులతోపాటు వివిధ జిల్లాల మధ్య అదనపు సర్వీసులు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని