Published : 04/10/2021 03:44 IST

రండి.. రహదారుల టెండర్లు వేయండి

గుత్తేదారులను పదేపదే కోరుతున్న ఇంజినీర్లు
ముందు బకాయిలు ఇవ్వాలంటున్న గుత్తేదారులు

ఈనాడు, అమరావతి: గుత్తేదారులతో రహదారుల పనులు చేయించేందుకు ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఆపసోపాలు పడుతున్నారు. రహదారులు అధ్వానంగా మారడంతో అక్టోబరు చివరి నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, వర్షాలు తగ్గగానే పనులు చేపట్టాలని ఇటీవల సీఎం ఆదేశించారు. దీంతో టెండర్లలో గుత్తేదారులు పాల్గొనేలా చూసేందుకు ఇంజినీర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. గుత్తేదారులు మాత్రం బకాయిలు ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ముఖ్యంగా 9 వేల కి.మీ.మేర రహదారుల పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉంది. దీనికి ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ) రూ.2,205 కోట్లు బ్యాంకు రుణం తీసుకుంటోంది. 1,140 పునరుద్ధరణ పనులకు అన్ని జిల్లాల్లో రెండు, మూడు సార్లు టెండర్లు పిలిస్తే 403 పనులకే బిడ్లు దాఖలయ్యాయి. మిగిలిన వాటికి గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. దీంతో ఆయా జిల్లాల్లో తాజాగా మరోసారి టెండర్లు పిలుస్తున్నారు. ఈసారి బిడ్లు వేయాలంటూ ఇంజినీర్లు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు గుత్తేదారులతో చర్చలు జరిపారు. గతవారం కూడా ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, గుత్తేదారులతో జూమ్‌ సమావేశం నిర్వహించి మాట్లాడారు. బకాయిలు తప్పకుండా ఇస్తామని, బిడ్లు వేయాలని కోరారు. ఈ పనులకు బ్యాంకు రుణం తీసుకోనుండటంతో చెల్లింపులకు సమస్య ఉండదని చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ రెండు బకాయిలు ఇవ్వండి

గుత్తేదారులు మాత్రం నిర్వహణ పనుల్లో భాగంగా గత ఏడాది చేసిన అత్యవసర మరమ్మతులు, కేంద్ర రహదారి నిధి (సీఆర్‌ఎఫ్‌) బకాయిలు పూర్తిగా ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. అత్యవసర మరమ్మతుల బకాయిలు రూ.388 కోట్లకుగాను పది రోజుల కిందట రూ.150 కోట్లు చెల్లించారు. సీఆర్‌ఎఫ్‌లో రూ.200 కోట్లకు రూ.20 కోట్లు చెల్లించారు. ఇవి రెండూ పూర్తిగా ఇచ్చాకే బిడ్లు వేస్తామంటూ గుత్తేదారులు స్పష్టం చేశారు. ఈ నెలలో చెల్లిస్తామని అధికారులు చెబుతుండగా.. అవి జరిగాకే టెండర్లలో పాల్గొంటామని కొందరు గుత్తేదారులు పేర్కొన్నట్లు సమాచారం. వివిధ జిల్లాల గుత్తేదారులు మంగళవారం విజయవాడలో భేటీకానున్నారు. బకాయిల విషయంలో అంతా ఒకేమాటపై ఉండాలని చర్చించనున్నారు. ఆ తర్వాత ఆర్‌అండ్‌బీలోని చీఫ్‌ ఇంజినీర్లను కలిసి ఇదే విషయాన్ని తెలియజేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ నెలలో మిగిలిన పనులకు ఎలాగైనా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయిస్తామని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని