Updated : 05/10/2021 13:09 IST

Pandora Papers: పాండోరా పత్రాల్లో జగన్‌ పేరు ఉండే ఉంటుంది

రాష్ట్రం నుంచి ఎవరున్నారో పరిశోధించి బయట పెట్టాలి
తెదేపా వ్యూహ కమిటీ సమావేశంలో నేతలు

ఈనాడు, అమరావతి: పన్ను ఎగవేతదారుల జాబితాలను బయటపెట్టిన పాండోరా పేపర్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పేరు కూడా ఉండే అవకాశం ఉందని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. ‘షెల్‌ కంపెనీలను సృష్టించి అవినీతికి పాల్పడటంలో జగన్‌ దిట్ట. అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. పాండోరా పత్రాల్లో రాష్ట్రం నుంచి ఎవరున్నారో పరిశోధించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని’ సోమవారం తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో జరిగిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఈ సమావేశంలో తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆయా నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలు ఇవీ..!

రాష్ట్రంలో డ్రగ్‌ మాఫియా చెలరేగుతోంది. తాడేపల్లి నుంచి వచ్చే ఆదేశాలతోనే రూ.వేల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇసుక, భూకబ్జాలు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా హవాలా రూపంలో రూ.వేల కోట్లు విదేశాలకు తరలిపోతున్నాయి. వైకాపా నేతలు డ్రగ్స్‌ డాన్‌లుగా, స్మగ్లింగ్‌ కింగ్‌లుగా అవతారమెత్తారు.

నకిలీ మద్యం తయారవుతోంది. మద్యంలో మాదకద్రవ్యాల్ని కూడా కలుపుతున్నట్టు ప్రజలు భావిస్తున్నారు. లిక్కర్‌ మాఫియా ద్వారా వచ్చిన డబ్బుని హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి... ముఖ్యమంత్రి జగన్‌కి బినామీగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటిపై దర్యాప్తు జరపాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా నియంత్రణకు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విద్యార్థులు వైరస్‌ బారినపడుతున్నారు. తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలి.

తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను    లబ్ధిదారులకు అందజేసేంత వరకు పోరాటం.

రైతులు వేసిన పంట వివరాలు ప్రభుత్వ లెక్కల్లో చేరడం లేదు. రైతులకు పెట్టుబడి సాయం, పంట బీమా అందడం లేదు. ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించడం లేదు. యంత్ర పరికరాల సరఫరా నిలిచిపోయింది. రాయలసీమలో వేరుసెనగ పంటకు రక్షక తడులు, మ్యాచింగ్‌ గ్రాంట్‌ ద్వారా కేంద్రం ఇచ్చే నిధుల్ని రైతులకు అందించడంలో విఫలమైంది.

తెదేపా హయాంలో ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన పథకాల్ని జగన్‌రెడ్డి రద్దు చేశారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయంపై తెదేపా పోరాడుతుంది.

ప్రజా రాజధాని అమరావతిని జగన్‌రెడ్డి నాశనం చేశారు. హైదరాబాద్‌లో భూములు వేలం వేస్తే ఎకరం రూ.60 కోట్లు చొప్పున పలికింది. ఇక్కడ మాత్రం ఉద్యోగాల్లేక యువత నష్టపోతోంది. అమరావతి నిర్మాణం నిలిపివేయడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో గోవుల్ని ట్రాక్టర్‌కు  కట్టి మున్సిపల్‌ సిబ్బంది అమానుషంగా ఈడ్చుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండించింది.

ఉపాధి హామీ, నీరు-చెట్టు పనులకు బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ తాత్సారంపై తెదేపా పోరాటం కొనసాగిస్తుంది.

విశాఖ, ఇతర ప్రాంతాల్లోని ప్రజా ఆస్తుల్ని తాకట్టుపెట్టి మరీ అక్రమ పద్ధతిలో అప్పులు చేసి, దొంగ లెక్కలు చూపిస్తూ, ప్రభుత్వ ఖజానా దోచుకుంటున్నారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని