Updated : 23/11/2021 06:09 IST

Justice NV Ramana: పాలకులకు అవలక్షణాలు ఉండకూడదు

పురాణాలు చెప్పిన రాజధర్మం ఇదే...
బలహీనుల రక్షణకే చట్టాల అమలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

సత్యసాయి సమాధిపై పూలమాల వేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్‌ తదితరులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, పుట్టపర్తి: ‘అధికారంలోకి వచ్చిన రాజుకు 14 అవలక్షణాలు వస్తాయని పురాణాలు చెబుతున్నారు. వాటిని దరిచేరనీయకుండా రాజు జనరంజక పాలన సాగించాలి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన సత్యసాయి విశ్వవిద్యాలయం 40వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ... ‘పాలకులకు ఆగ్రహం, దురుసుతనం, విజ్ఞులమాట వినకపోవడం, దుష్టులైన మిత్రుల సలహాలను స్వీకరించడం, అనాలోచిత నిర్ణయాలను అమలు చేయడం వంటి లక్షణాలు ఉండకూడదు. నేటి పాలకులు ఆయా లక్షణాలు తమలో ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. వాటిని తొలగించుకుని ప్రజలకు న్యాయమైన పాలన అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు... పాలకులు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజాప్రయోజనం కోసమే అయి ఉండాలి. రామాయణ, మహాభారతాల్లో నేటి సమకాలీన సమాజానికి అవసరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. రామాయణంలో తనను కలవడానికి వచ్చిన భరతుడితో రాముడు మాట్లాడుతూ... పెద్దలను గౌరవిస్తున్నావా? ప్రజలను బాగా చూసుకుంటున్నావా? మహిళలు, బాలలు, బలహీనులకు రక్షణ కల్పిస్తున్నావా? అని ప్రశ్నిస్తాడు. మహాభారతంలోనూ... ధర్మరాజుతో నారదముని మధ్య ఇలాంటి సంభాషణే జరిగింది’ అని ఆయన గుర్తుచేశారు.

స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

రాజధర్మం పాటించాలి..
చట్టాలను బలహీనుల రక్షణ కోసమే అమలు చేయాలని... దీన్నే పురాణాల్లో రాజధర్మంగా పేర్కొన్నారని జస్టిస్‌ రమణ అన్నారు. ‘విద్య అంటే అకడమిక్‌ లెర్నింగ్‌ మాత్రమే కాదు. విద్యార్థి జీవితంలో సానుకూల మార్పు, ఉన్నతికి చదువు దోహదపడాలి. సత్యసాయి విద్యాసంస్థలు విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యనందించడంలో ముందున్నారు. ప్రాపంచిక, ఆధ్యాత్మిక అభ్యాసాలను పిల్లలకు అందించాలని బాబా కోరుకున్నారు. దానికి అనుగుణంగానే సత్యసాయి విద్యాసంస్థలు మహోన్నత స్థానానికి చేరుకున్నాం. నైతిక విలువలు, మానవత్వం, క్రమశిక్షణ, నిస్వార్థం, కరుణ, ఓరిమి, క్షమాగుణాలను అలవర్చుకోవడమే అసలైన విద్య. సొంత బలాన్ని ఎప్పుడూ సందేహించవద్దు... మీ నైపుణ్యాలతో ప్రపంచాన్ని మార్చగలరు’ అని విద్యార్థులకు ఉపదేశించారు. ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు.


బాబా బోధనల్లో విశ్వజనీన ప్రేమ

మాజానికి ప్రేమను పంచాల్సిన అవసరముందని, మనుషులతోపాటు జంతువులు, ప్రకృతిని కూడా ప్రేమించాలని... అదే విశ్వజనీన ప్రేమ అన్న సత్యసాయి బోధనలను జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తన ప్రసంగంలో ఉటంకించారు. బాబాకు పిల్లలంటే అమిత ఇష్టమని... ఆ ప్రేమలో నుంచే ఈ విశ్వవిద్యాలయం పుట్టుకొచ్చిందన్నారు. ‘ప్రపంచ శాంతి, భద్రతలకు విద్యార్థులే వేర్లు కావాలి. ఆ వేర్లలకు నీరు పోయడమే నాపని. నేను అన్ని విధాలా విద్యార్థులకు అంకితం. నాకు వారిపై ప్రగాఢ విశ్వాసముంది. నాకున్న ఏకైక ఆస్తి నా పిల్లలే’ అని బాబా విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తన ప్రసంగంలో పేర్కొన్నారు. బాబా మాతృమూర్తిని, మాతృప్రాంతాన్ని ఎంత ప్రేమించారో మాతృభాషకూ అంతే ప్రాధాన్యమిచ్చారన్నారు. కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రీతూరాజ్‌ అవస్థీ, అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి జడ్జి రమేష్‌, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ రత్నాకర్‌, విశ్వవిద్యాలయం కులపతి చక్రవర్తి, ఉపకులపతి సంజీవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని