Updated : 24/11/2021 05:22 IST

Chandrababu: ఇది మానవ వైఫల్యంతో తలెత్తిన విపత్తు

తుపాను వస్తుందని తెలిసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
కడప జిల్లా రాజంపేటలో బాధితులకు పరామర్శ
నిర్వాసితులకు అండగా ఉంటానని హామీ
రాజధాని, శాసనమండలి రద్దుపై జగన్‌ మాట తప్పారు, మడమ తిప్పారని విమర్శ

రాజంపేట మండలం మందపల్లెలో వరద నీటిలో 9 మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న ఆలయ పూజారిని ఓదార్చుతున్న చంద్రబాబు

రాజంపేట, న్యూస్‌టుడే: తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, వరద వస్తుందని తెలిసినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదని, ఫలితంగా అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోయి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. కట్ట తెగుతుందన్న ముందస్తు సమాచారాన్ని ప్రజలకు చెప్పకుండా అధికారులు ఘోర తప్పిదం చేశారన్నారు. కడప జిల్లా రాజంపేట మండలంలో అన్నమయ్య జలాశయం కట్ట తెగిపోవడంతో ముంపు బారినపడ్డ మందపల్లి, పులపుత్తూరు గ్రామాలను మంగళవారం ఆయన పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘గతేడాదే పింఛ కట్ట తెగింది. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు పనిచేయలేదు. అయినా వాటికి మరమ్మతులు చేయించలేదు. కింద ఇసుక, టిప్పర్లు ఉన్నాయన్న మీ స్వార్థ రాజకీయాలు, ఆదాయం కోసం ప్రజల జీవితాలను నాశనం చేస్తారా? నష్టపోయిన వెయ్యి కుటుంబాలను ఆదుకోలేని నువ్వూ.. ఓ ముఖ్యమంత్రివేనా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఎన్నో తుపానులు చూశాను. వాటిని ఆపలేకపోయినా.. తీవ్రతను గుర్తించి నష్టాన్ని నివారించాం. ప్రాణనష్టం జరగకుండా కాపాడాను. రాత్రింబవళ్లు పనిచేయించి ప్రజల కన్నీళ్లు తుడిచాను. అలా చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాద’ని పేర్కొన్నారు. ‘అన్నమయ్య జలాశయం గేట్లను పటిష్ఠం చేయాలి. చెయ్యేరు నీరు గ్రామాల్లోకి రాకుండా కాంక్రీటుతో రక్షణ గోడలు నిర్మించాలి. అప్పటిదాకా మీకు అండగా ఉంటాన’ని హామీ ఇచ్చారు. ‘విశాఖలో గతేడాది ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు సీఎం వెళ్లి ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడీ వరద విపత్తు మీ వైఫల్యం వల్లే కదా? ఇక్కడ రూ.5 లక్షలు ఇవ్వడమేంటి? మేం అధికారంలోకి వచ్చాక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇస్తాం. తక్షణ సాయంగా మృతుల కుటుంబానికి రూ.లక్ష, నష్టపోయిన కుటుంబానికి రూ.5 వేలు చొప్పున అందజేస్తామ’ని ప్రకటించారు.

* మీకు జరిగిన నష్టం.. మీరు పడుతున్న బాధలు నన్ను కదిలించాయి. నేను ఎన్నో విపత్తులను చూశాను. కానీ వాటికీ, ఈ విపత్తుకూ చాలా తేడా ఉంది. ఇది మనుషుల వైఫల్యం వల్ల జరిగిన ఘోరం. ప్రాణ, ఆస్తినష్టం జరిగి ప్రజలు గగ్గోలు పెడుతుంటే సీఎం హెలికాప్టర్‌లో తిరిగిపోవడం ఏమిటి? అధికారంలో లేనప్పుడు ఊరూరా భూమి మీద తిరిగారు. ఇప్పుడు ఆకాశంలో గిరగిరా తిరిగి వెళ్లారు.


* నాడు శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. నేడు మళ్లీ పునరిద్ధరిస్తానని చెప్పారు. రాజధాని అమరావతి విషయంలోనూ ఏదో మెలికపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాట  తప్పను, మడమ తిప్పనని చెప్పే జగన్‌.. అన్ని విషయాల్లో మాట తప్పుతున్నారు. మడమ తిప్పుతున్నారు. అమరావతే రాజధాని అనే వరకూ  పోరాడతాను.

-కడప జిల్లా రాజంపేటలో వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా తెదేపా అధినేతనారా చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు

 


రాజంపేట పట్టణంలో ప్రసంగిస్తున్న చంద్రబాబు


ఆడవారినంటే.. ఊరుకుంటారా?

‘అసెంబ్లీలో వైకాపా నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీలో అడుగుపెట్టన’ని చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. బాధితులను పరామర్శించిన తర్వాత రాత్రి రాజంపేట పాత బస్టాండు బైపాస్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద అభిమానులనుద్దేశించి మాట్లాడారు. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినందున రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. ఆడవారిని అవమానపరిస్తే ఎవరైనా ఊరుకుంటారా? అందుకే బాధేసి సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశానని చెప్పారు. అంతకుముందు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కడప విమానాశ్రయానికి భారీగా తరలివచ్చారు. తెలుగు యువత నాయకులు గజమాలతో స్వాగతించారు. ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఫరూక్‌ తదితరులతో విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లో చంద్రబాబు కొద్దిసేపు భేటీ అయ్యి.. వరద ప్రభావంపై సమీక్షించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని