Published : 27/11/2021 02:56 IST

కేంద్రానిది పక్షపాత ధోరణి

పోలవరం వ్యయం రూ.55,657 కోట్లుగా ఆమోదం పొందాలి

రూ.1,000కోట్ల వరద సాయానికి పట్టుబట్టాలి

వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం జగన్‌ మార్గనిర్దేశం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం ఎందుకు పక్షపాతం చూపుతోందో పార్లమెంట్‌లో ప్రశ్నించాలని వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ‘చంద్రబాబు హయాంలో పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్రం అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు..2018-19లోనే రుణ సేకరణకు ఎందుకు పరిమితిని విధించలేదు? అప్పుడు పరిమితికి మించి అప్పులు చేశారంటూ ఇప్పుడు రాష్ట్ర నికర రుణ పరిమితి(ఎన్‌డీసీ)లో కోత పెట్టి దాన్ని వచ్చే మూడేళ్లవరకూ వర్తింపజేస్తామనడం సరికాదు’అనే విషయాన్ని పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ ప్రస్తావించాలని తీర్మానించారు. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన 13అంశాలతోపాటు ఇటీవల తిరుపతిలో సదరన్‌ జోనల్‌ సమావేశంలో ఏపీ ప్రస్తావించిన  ఆరు అంశాలను పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తాలని ముఖ్యమంత్రి ఎంపీలకు మార్గదర్శనం చేశారు. వైకాపా ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తూ ‘మన ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లయింది. మరో రెండేళ్ల తర్వాత ఎన్నికల కాలం వచ్చేస్తుంది. పార్లమెంటులో మనకంటూ సొంతబలం ఉంది..మన పార్టీకి ఉన్న ప్రతిష్ఠను నిలబెట్టేలా పోరాడాలి. మనం ఎన్డీయే, యూపీఏ కూటముల్లో లేము. పార్లమెంటులో మనం లేవనెత్తే ప్రతీ అంశమూ ప్రజల తరఫునే’ అని స్పష్టం చేశారు. ‘పోలవరం అంచనా వ్యయం రూ.55,657కోట్ల ఆమోదానికి కేంద్రాన్ని పట్టుబట్టాలి. ప్రాజెక్టుల్లో ఎప్పుడూ లేనివిధంగా తాగునీటి అంశాన్ని విడదీస్తే ఎలా? ఇప్పటివరకూ పోలవరంపై రాష్ట్రం ఖర్చు చేసిన రూ.2,104కోట్లను కేంద్రం తిరిగిచెల్లించేలా అడగాలి’ అని ఎంపీలను సీఎం కోరారు. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత లేదు..మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిని ప్రస్తావించాలి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు కేంద్రం నుంచి రావాల్సిన రాయితీ బకాయి రూ.1,703 కోట్లను చెల్లించమని అడగాలి. రిసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.22,948కోట్ల కోసం ఎంపీలు సమష్టిగా పోరాడాలి. 2021 జనగణన సందర్భంగా బీసీ కులాలవారీగా గణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అడగాలి. రాష్ట్రంలో 16వైద్య కళాశాలలను తీసుకువస్తున్నాం. వీటిలో 13కళాశాలలకు అనుమతుల ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలి. కనీస మద్దతు ధరకు సంబంధించి కొత్తగా చట్టం చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.దానికి మద్దతు పలకాలి’ అని జగన్‌ సూచించారు. సమావేశ నిర్ణయాలను వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విలేకరులకు వెల్లడించారు.. ‘ఉపాధిహామీ పథకం కింద రావాల్సిన రూ.4,976కోట్లు, పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30వేల కోట్లను అడగడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరతామని చెప్పారు.

అమరావతి రైతుల అభిప్రాయాలను తీసుకుంటాం

3 రాజధానులపై కొత్త చట్టం తెచ్చేటపుడు అమరావతి రైతుల అభిప్రాయాలను తీసుకుంటారా అని విలేకరులు అడగ్గా..‘తీసుకుంటాం, చంద్రబాబు తీసుకున్నట్లే మేమూ తీసుకుంటాం’అని సాయిరెడ్డి చెప్పారు. భిక్షాటన చేసి వరద బాధితులకు డబ్బు ఇస్తామని భాజపా నేతలు అంటున్న విషయాన్ని ప్రస్తావించగా ‘భాజపా వాళ్లు భిక్షాటన చేయడం ఎందుకు? కేంద్రంలో వారి ప్రభుత్వమే ఉంది, కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిందే చాలా ఉంది, అవన్నీ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు’ అని అన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని